కులం జైలులో ప్రజాస్వామ్యం… ప్రశ్నలు మరిచిన వోటరు !

“బాబాసాహెబ్ అంబేద్కర్ తన అక్షరాల్లో స్వేచ్ఛను, సమానత్వాన్ని కలగన్నాడు కానీ ఈ దేశపు కుళ్ళు రాజకీయ వ్యవస్థ ఆ అక్షరాల చుట్టూ కుల సంకెళ్ళు వేసి బంధించింది. అది నేటి ఆధునిక కాలంలోనూ నిర్లజ్జగా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే ఈ మేధో బానిసత్వం ఇంకెంతకాలం సాగాలి?”

ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనే పవిత్ర పదం పుట్టినప్పటి నుంచి దాని ఆత్మను నిలువునా హత్యచేస్తూనే ఉన్నారు. రాజ్యాంగం రాసిన చేతుల తడి ఇంకా ఆరకముందే, తెరవెనుక కుల గణనల కుతంత్రాలు మొదలయ్యాయి. మత పేరిట వోట్లు అడుక్కోవడం ఒక రాజకీయ ఆనవాయితీగా మారింది. బాబాసాహెబ్ అంబేద్కర్ తన అక్షరాల్లో స్వేచ్ఛను, సమానత్వాన్ని కలగన్నాడు కానీ ఈ దేశపు కుళ్ళు రాజకీయ వ్యవస్థ ఆ అక్షరాల చుట్టూ కుల సంకెళ్ళు వేసి బంధించింది. అది నేటి ఆధునిక కాలంలోనూ నిర్లజ్జగా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే ఈ మేధో బానిసత్వం ఇంకెంతకాలం సాగాలి?

ప్రజాస్వామ్యం అంటే నిజమైన ప్రజల పాలన. ఇక్కడ ప్రజ అంటే ఒక స్వతంత్ర వ్యక్తి ఏ కులమో, మతమో కాదు. కానీ ఈ దేశంలో ఒక సగటు వ్యక్తి వోటు వేయడానికి బయటకు వెళ్ళేముందే అతని కులం అతని నిర్ణయాన్ని శాసిస్తోంది. అతని మతం అతని అభ్యర్థిని ముందే ఎంపిక చేస్తోంది. అతని జాతి అతని స్వరాన్ని నిర్దేశిస్తోంది. ఇది ఎంతమాత్రం ప్రజాస్వామ్యం కాదు ఇది కేవలం కుల ప్రజాస్వామ్యం, మత ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అనే ఒక పవిత్రమైన ముసుగు పేరిట సాగుతున్న అతి పెద్ద మేధావి మోసమిది.

మనిషి పుట్టుకతోనే కులాన్ని నెత్తిన వేసుకుని వస్తాడు ఇది సమాజం నూరిపోసిన పెద్ద అబద్ధం. మనిషి పుట్టుకతో ఏ ముద్రనూ తీసుకురాడు. ప్రకృతి పరంగా అతను తెస్తున్నది ఒక్కటే అది శ్వాస. కానీ ఈ సంకుచిత సమాజం ఆ పవిత్ర శ్వాసకు కూడా కులపు ముద్ర వేస్తోంది. వేల సంవత్సరాల క్రితం మనుషులు తమ పని ఆధారంగా విభజింపబడ్డారు అది కేవలం ఒక సాంఘిక వ్యవస్థ. కాని ఆ వ్యవస్థ కాలక్రమేణా ఒక భయంకరమైన మానవ నిర్మిత జైలుగా మారింది. జన్మతో విధించే ఆజన్మాంత శిక్ష అయింది. పుట్టిన ఇంటిని బట్టి ఒక వ్యక్తి జీవితం, గౌరవం నిర్ణయమయ్యే అమానవీయ వ్యవస్థగా రూపాంతరం చెందింది.ఈ జైలు గోడలు ఇప్పుడు కేవలం ఇటుకలతో కాదు రాజకీయ పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలతో పటిష్టంగా కట్టబడుతున్నాయి.

పార్టీల జెండాలు కులానికి రంగులు అద్దుతున్నాయి. నేటి నాయకులు మా కులం వాడిని గెలిపించండి అని నేరుగా చెప్పకపోయినా, వారు అదే సందేశాన్ని వేరే నిగూఢ భాషలో పంపుతున్నారు కులం పేరు చెప్పకుండా కులం వోటు అడగడమే ఈనాటి ఆధునిక రాజకీయ కళ. ఆలోచించండి ఒక నాయకుడు వేదికపై అభివృద్ధి గురించి మాట్లాడతాడు, కానీ అతని అభ్యర్థుల జాబితా చూస్తే కులాల లెక్కలు స్పష్టంగా కనిపిస్తాయి. అతను సంక్షేమం చెప్తాడు, కానీ ఆ పథకాల లబ్ధిదారుల ఎంపికలో కుల వివక్ష కనిపిస్తుంది. ఇది ప్రజాసేవ కాదు ఇది కులాల మీద జరుగుతున్న రాజకీయ కార్పొరేట్ వ్యాపారం.

మతం అనేది మనిషికి ఒక ఉన్నతమైన నైతిక దిక్సూచిని ఇవ్వాలి. అది అతనికి మంచి ఏమిటో, చెడు ఏమిటో చెప్పాలి. కానీ ఈ దేశంలో మతం ఇప్పుడు ఎన్నికల ఏజెంటుగా దిగజారిపోయింది. దేవుని పవిత్ర పేరును కేవలం వోటు బ్యాంకుగా వాడుకుంటున్నారు. మందిరాలు, మసీదులు, చర్చిలు ఇవి ఆత్మకు శాంతిని ఇచ్చే స్థలాలు. కానీ ఎన్నికల సమయంలో ఇవి రాజకీయ సమావేశ మందిరాలుగా మారడం మనం చూస్తున్నాం. మత పెద్దలు నాయకులను ఆశీర్వదిస్తున్నారు రేపు రాబోయే వోట్ల బదులు. మత సంఘాలు అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తున్నాయి ప్రభుత్వ సదుపాయాల బదులు.ఇది మతానికి, దైవత్వానికి చేస్తున్న ద్రోహం కాదా? ఏ మతమూ మీ కులం వాడికి వోటు వేయండి అని చెప్పలేదు. ఏ దేవుడూ మతం పేరుతో నన్ను రాజకీయాల్లో వాడుకోండి అని ఆదేశించలేదు. కానీ రాజకీయ నాయకులు దేవుని పేరు వాడుకుని తమ అధికార పీఠాన్ని దిలపరచుకుంటున్నారు. ప్రజలు దేవుని భయంలో తమ అమూల్యమైన వోటును నాయకుల చేతిలో పెట్టేస్తున్నారు. మతం వ్యక్తిగత విశ్వాసం అది రాజకీయ అస్త్రం కాకూడదు. మతం మనిషిని మేల్కొల్పాలి, మనిషిని నిద్రపుచ్చకూడదు.

1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఈ దేశ ప్రజలకు ఒక గొప్ప కల అందింది సమాన హక్కుల కల. రాజ్యాంగం ఒక పవిత్రమైన ప్రతిజ్ఞ చేసింది: ఇక్కడ కులమతాలతో నిమిత్తం లేకుండా ప్రతి పౌరుడూ సమానుడేనని. ఆ ప్రతిజ్ఞ ఇప్పుడు ఎక్కడుంది? ప్రజాస్వామ్యం అంటే ఒక్కొక్క వ్యక్తి తన స్వంత అభిప్రాయంతో, స్వంత ఆలోచనతో వోటు వేయాలి తన కులం చెప్పింది కాదు, తన మత నాయకుడు చెప్పింది కాదు, తన జాతి సంఘం చెప్పింది కాదు. తన స్వంత వివేకంతో. కానీ ఈ దేశంలో వోటు వేసే వ్యక్తి వెనకాల ఒక కులం నిలబడి ఉంటోంది. ఒక మతం మతం నిర్ణయిస్తుంది . ఒక జాతి ఒత్తిడి తెస్తోంది. ఇది స్వేచ్ఛాయుత వోటు కాదు ఇది సమూహ బందీ వోటు. నిజమైన ప్రజాస్వామ్యంలో నాయకుడి కులం ప్రశ్నే ఉండకూడదు. నాయకుడి మతం ప్రమాణం కాకూడదు. ప్రజలు అడగాల్సింది ఒక్కటే,ఈ నాయకుడు నా జీవితాన్ని మెరుగు చేశాడా? నా పిల్లలకు చదువు ఇచ్చాడా? నా కుటుంబానికి భద్రత కల్పించాడా? ఈ ప్రశ్నలు కులంతో ముడిపడి ఉండవు అవి మానవ అవసరాలకు సంబంధించినవి.ఈ దేశంలో విద్యావంతులు, మేధావులు, పండితులు వీరందరూ ఆలోచించగలిగిన వర్గం. కానీ వీరు చేస్తున్నది ఏమిటి? కేవలం మౌనం. కులం పేరుతో వోట్లు అడుగుతున్నప్పుడు వీరు మాట్లాడరు. మత విద్వేషం రాజేసినప్పుడు వీరు నిరసించరు. ఎందుకంటే వీరికి కూడా వారి కులం ముఖ్యమే. మేధాపరమైన జ్ఞానం ఉన్నా, మానసికంగా వారు కూడా ఆ విషవలయంలోనే ఉన్నారు. ఇది మేధావి వర్గానికి ఆత్మావలోకనం చేసుకోవాల్సిన సమయం.

అలాగే నేటి యువత చదువుతోంది, విదేశాలు వెళ్తోంది, స్మార్ట్ ఫోన్లలో ప్రపంచాన్ని చూస్తోంది. కానీ ఎన్నికల సమయంలో ఆ యువత తన కులం పార్టీకే వోటు వేస్తోంది. విదేశాల్లో మెరిట్ ఆధారంగా జీవిస్తున్న యువత, స్వదేశంలో కులం ఆధారంగా వోటు వేయడం ఒక పెద్ద మానసిక సంఘర్షణ. కుటుంబపు ఒత్తిడి, సమాజపు ఒత్తిడి యువతను వెనక్కి లాగుతున్నాయి. యువత మారాలనుకుంటే, మీ వోటు మొదట మారాలి. మీ వోటు
మీ కులానికి కాదు అది మీ భవిష్యత్తుకు ఉండాలి.కులమతాల రాజకీయాలను అంతం చేయడానికి ఒక్క ఎన్నిక చాలదు. కానీ చైతన్యం మాత్రం అన్నీ మార్చగలదు. మొదటిగా నిజమైన విద్య, రాజ్యాంగం చదివే విద్య పాఠశాలల్లో బోధించాలి. రెండవది ప్రశ్నించే సంస్కృతి. నాయకుడు మా కులం వాడు అన్నప్పుడు అడగండి.అతను నా సమస్య పరిష్కరించాడా? ప్రశ్నలే ప్రజాస్వామ్యపు ప్రాణం. మూడవది సమిష్టి నిరాకరణ. కులం పేరు చెప్పి వోట్లు అడిగే నాయకుడిని, మత ద్వేషం రాజేసే నాయకుడిని పూర్తిగా వ్యతిరేకించండి. మీ వోటు మీ గళం, అది సత్యానికే ఉండాలి.

ఈనాటి తరం బాధ్యత ఏమిటి? కులమతాల సంకెళ్ళు తెంచుకోవడం. ప్రజాస్వామ్యాన్ని దాని నిజమైన అర్థంలో నిలబెట్టడం. ప్రతి వోటును ఒక చైతన్య నిర్ణయంగా మార్చడం. ఇది కేవలం రాజకీయ ప్రశ్న కాదు ఇది నైతిక ప్రశ్న, మానవతా ప్రశ్న. కులం పుట్టుకతో వస్తుంది అది నిజమే. కానీ మనిషితనం అంతకంటే పెద్దది. ప్రజాస్వామ్యానికి కావాల్సింది మనిషితనమే కులమతాలు కాదు. ఆ రోజు రాక తప్పదు ఎందుకంటే నిద్రపోయే ప్రజలు ఎప్పటికైనా మేల్కొంటారు. చీకటి ఎంత దట్టంగా ఉన్నా, తెల్లవారుజామున వెలుతురు వస్తూనే ఉంటుంది. ఆ వెలుతురు మీరే. ఆ మార్పు మీరే. మేల్కొనండి. ఆలోచించండి. మారండి..!

డా .సూర్యదేవర రామకృష్ణ ,
9490754169

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *