“భారత ఆర్థిక వ్యవస్థలో సేవారంగం ఆధిపత్యం రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో, ఆ రంగాన్ని కూడా పరిశ్రమల మాదిరిగానే నిరంతరం కొలవడం అనివార్యమైంది. ఆ అవసరాన్ని తీర్చే దిశగా సేవా ఉత్పత్తి సూచీ ఒక కీలక సంస్కరణ. ప్రారంభంలో ఇది ప్రయోగాత్మక సూచీగానే ఉన్నప్పటికీ, రాబోయే రోజుల్లో భారత ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకోవడానికి అత్యంత కీలకమైన గణాంక సూచీలలో ఒకటిగా నిలవడం ఖాయం.”

dchandrabhanumail@gmail.com
భారత ఆర్థిక వ్యవస్థలో గత రెండు దశాబ్దాలుగా అత్యంత వేగంగా విస్తరించిన రంగం సేవారంగం. ఒకప్పుడు దేశ వృద్ధికి వ్యవసాయం, పరిశ్రమలు ప్రధాన ఆధారాలుగా ఉండగా, నేడు వ్యాపారం, రవాణా, బ్యాంకింగ్, బీమా, సమాచార సాంకేతిక సేవలు, హోటళ్లు, పర్యాటకం, స్థిరాస్తి వ్యాపారం, వృత్తిపర సేవలు వంటి రంగాలే ఆర్థికాభివృద్ధికి ప్రధాన చోదకశక్తిగా నిలుస్తున్నాయి. 2013-14 నుంచే దేశ స్థూల విలువ జోడింపులో సేవారంగం వాటా 50 శాతానికి పైగా కొనసాగుతోంది. అంటే, భారత ఆర్థిక వ్యవస్థకు సేవారంగమే వెన్నెముకగా మారింది.
అయితే ఇంతటి ప్రాధాన్యం ఉన్న రంగం నెలనెలా ఎలా పనిచేస్తోందో తెలిపే అధికారిక సూచీ ఇప్పటివరకు లేకపోవడం ఒక పెద్ద లోటు. పరిశ్రమల ఉత్పత్తి పెరుగుతోందా? తగ్గుతోందా? అనే విషయాన్ని పారిశ్రామిక ఉత్పత్తి సూచీ ద్వారా ప్రతి నెల తెలుసుకునే అవకాశం ఉంది. కానీ సేవారంగం పనితీరును అదే స్థాయిలో అంచనా వేసే స్వల్పకాలిక కొలమానం లేకపోవడంతో విధాన నిర్ణేతలు, ఆర్థికవేత్తలు, పరిశోధకులు సమగ్ర చిత్రాన్ని పొందలేకపోయారు. ఈ లోటును భర్తీ చేస్తూ కేంద్ర గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ సేవా ఉత్పత్తి సూచీని జూలై 2026 నుంచి ప్రవేశపెడుతోంది. ఇది కేవలం మరో గణాంకం కాదు; భారత ఆర్థిక వ్యవస్థను మరింత సమగ్రంగా అర్థం చేసుకునేందుకు ఉపయోగపడే కొత్త కొలమానం.
ఇప్పుడే ఎందుకు సాధ్యమైంది?
సేవారంగానికి ప్రత్యేక ఉత్పత్తి సూచీ రూపొందించాలనే అవసరం చాలా కాలంగా ఉన్నప్పటికీ, దాన్ని అమలు చేయడం అంత సులభం కాదు. పరిశ్రమల్లో ఉత్పత్తిని టన్నులు, లీటర్లు లేదా తయారైన వస్తువుల సంఖ్య ద్వారా కొలవవచ్చు. కానీ సేవలు కనిపించని ఉత్పత్తులు. బ్యాంకింగ్ సేవ, విద్యా సేవ, వైద్య సేవ, న్యాయ సేవ లేదా సమాచార సాంకేతిక సేవలను భౌతిక ప్రమాణాలతో కొలవడం సాధ్యం కాదు. అందువల్ల ప్రతి సేవా రంగానికి వేర్వేరు కొలమానాలు అవసరమవుతాయి. గతంలో సేవారంగానికి సంబంధించిన సమగ్ర పరిపాలనా గణాంకాలు అందుబాటులో లేకపోవడం, సేవల విలువ నుంచి ధరల ప్రభావాన్ని తొలగించే తగిన ధరల సూచీలు లేకపోవడం కూడా ప్రధాన అడ్డంకులుగా నిలిచాయి. ఈ కారణాల వల్ల సేవారంగానికి నెలవారీ ఉత్పత్తి సూచీని రూపొందించడం సాధ్యం కాలేదు.
అయితే గత పదేళ్లలో దేశ గణాంక వ్యవస్థలో వచ్చిన మార్పులు ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేశాయి. వస్తు, సేవల పన్ను అమలులోకి రావడంతో నమోదిత సేవా సంస్థల వ్యాపార లావాదేవీలకు సంబంధించిన నెలవారీ గణాంకాలు పెద్దఎత్తున అందుబాటులోకి వచ్చాయి. అదే సమయంలో ఇన్‌కార్పొరేటెడ్ సేవారంగ సంస్థల వార్షిక సర్వే ప్రారంభం కావడంతో ఆరోగ్యం, విద్య వంటి రంగాలకు సంబంధించిన విశ్వసనీయ సమాచారాన్ని సేకరించే అవకాశం ఏర్పడింది. వివిధ ప్రభుత్వ శాఖల పరిపాలనా గణాంక వ్యవస్థలు కూడా బలోపేతం కావడంతో సేవారంగానికి ప్రత్యేక ఉత్పత్తి సూచీని రూపొందించడం సాధ్యమైంది.
సేవా ఉత్పత్తి సూచీ ఎలా రూపొందుతుంది?
సేవా ఉత్పత్తి సూచీ అనేది సేవారంగంలో వాస్తవ ఉత్పత్తి పరిమాణంలో నెలనెలా జరిగే మార్పులను కొలిచే స్వల్పకాలిక సూచీ. సేవల విలువ మాత్రమే కాకుండా, ధరల పెరుగుదల ప్రభావాన్ని తొలగించిన తర్వాత నిజంగా సేవల ఉత్పత్తి ఎంత పెరిగిందో లేదా తగ్గిందో ఇది తెలియజేస్తుంది. దీనికి 2024-25ను మూల సంవత్సరంగా నిర్ణయించారు. 2025-26 సంవత్సరానికి సంబంధించిన ప్రయోగాత్మక నెలవారీ సూచీలతో పాటు 2026 ఏప్రిల్ నెల సూచీని జూలై 14న విడుదల చేయనున్నారు. ఆ తరువాత ప్రతి నెల సుమారు 60 రోజుల వ్యవధితో ఈ సూచీని విడుదల చేస్తారు.
ఈ సూచీని మూడు ప్రధాన గణాంక వనరుల ఆధారంగా రూపొందిస్తారు. విమాన రవాణా, రైల్వేలు, బ్యాంకింగ్, బీమా రంగాలకు పరిపాలనా గణాంకాలను వినియోగిస్తారు. టోకు, చిల్లర వ్యాపారం, మరమ్మతు సేవలు, హోటళ్లు, ఆహార సేవలు, రోడ్డు రవాణా, జల రవాణా, గిడ్డంగులు, తపాలా, కొరియర్ సేవలు, దూరసంప్రేషణ సేవలు, సమాచార సాంకేతిక సేవలు, ప్రసార సేవలు, స్థిరాస్తి వ్యాపారం, వృత్తిపర, శాస్త్రీయ, సాంకేతిక సేవలు, పరిపాలనా సహాయక సేవలు, కళలు, వినోద రంగాలకు వస్తు, సేవల పన్ను గణాంకాలను ఉపయోగిస్తారు. ప్రైవేటు ఆరోగ్యం, విద్య రంగాలను వార్షిక సర్వే ఫలితాలు అందుబాటులోకి వచ్చిన తరువాత ఇందులో చేర్చనున్నారు.
అయితే సేవారంగంలోని అన్ని కార్యకలాపాలు ఈ సూచీలో భాగం కావు. ప్రభుత్వ పరిపాలన, రక్షణ, ప్రభుత్వ విద్య, ప్రభుత్వ ఆరోగ్య సేవలు, కొన్ని ఆర్థిక సేవలు, సామాజిక సేవలలోని కొన్ని విభాగాలు, వ్యక్తిగత సేవలు, గృహ సేవలు, సభ్యత్వ సంస్థలు, జూదం వంటి కార్యకలాపాలను ఇందులో చేర్చడం లేదు. ఇవి ప్రధానంగా ప్రభుత్వ ఆధీనంలో ఉండటం లేదా మార్కెట్ ఆధారంగా పనిచేయకపోవడమే ఇందుకు కారణం. అలాగే ఈ సూచీ ప్రధానంగా నమోదిత, వ్యవస్థీకృత సేవారంగ పనితీరునే ప్రతిబింబిస్తుంది.
సేవారంగ ఉత్పత్తిని కొలవడానికి రెండు విధానాలను అనుసరిస్తారు. విమాన రవాణా, రైల్వేల్లో ప్రయాణికుల సంఖ్య, ప్రయాణ దూరం వంటి భౌతిక ప్రమాణాలను ఆధారంగా తీసుకుంటారు. మిగిలిన చాలా రంగాల్లో వ్యాపార ఆదాయం లేదా సేవల ద్వారా వచ్చిన మొత్తం లావాదేవీల విలువను ఉత్పత్తికి సూచికగా పరిగణిస్తారు. సేవలు ఉత్పత్తి అయిన వెంటనే వినియోగంలోకి వస్తాయి. నిల్వలు ఉండవు. అందువల్ల వ్యాపార ఆదాయం సేవల ఉత్పత్తిని ప్రతిబింబించే అత్యంత అనుకూల సూచికగా భావిస్తున్నారు.
అయితే వ్యాపార ఆదాయంలో ధరల పెరుగుదల ప్రభావం కూడా ఉంటుంది. అందుకే ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తొలగించి వాస్తవ ఉత్పత్తి పెరుగుదలను అంచనా వేయడానికి ధరల సర్దుబాటు సూచీలు ఉపయోగిస్తారు. టోకు వ్యాపారానికి టోకు ధరల సూచీ, అవసరమైన చోట వినియోగదారుల ధరల సూచీ, బ్యాంకింగ్, బీమా రంగాలకు సాధారణ వినియోగదారుల ధరల సూచీ, ఇతర సేవలకు ఆహారేతర వినియోగదారుల ధరల సూచీని వినియోగిస్తారు. దీనివల్ల సేవల నిజమైన ఉత్పత్తి పెరుగుదలను ఖచ్చితంగా అంచనా వేయడం సాధ్యమవుతుంది.
ఆర్థిక వ్యవస్థకు కొత్త దిక్సూచి:
సేవా ఉత్పత్తి సూచీ అందుబాటులోకి రావడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై మరింత సమగ్ర అవగాహన ఏర్పడుతుంది. ఇప్పటివరకు పరిశ్రమల నెలవారీ పనితీరును తెలిపే పారిశ్రామిక ఉత్పత్తి సూచీ మాత్రమే అందుబాటులో ఉండగా, ఇకపై దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యధిక వాటా కలిగిన సేవారంగానికి కూడా అదే తరహా నెలవారీ కొలమానం లభిస్తుంది. దీనివల్ల జాతీయ ఆదాయ అంచనాలు మరింత ఖచ్చితంగా రూపొందుతాయి. సేవారంగంలో వృద్ధి మందగిస్తున్నదా, వేగవంతమవుతున్నదా అనే విషయాన్ని ప్రారంభ దశలోనే గుర్తించి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునే వీలుంటుంది. అలాగే ఆర్థిక ధోరణులను విశ్లేషించడానికి, భవిష్యత్ వృద్ధిని అంచనా వేయడానికి, పరిశోధనలకు, విధాన రూపకల్పనకు కూడా ఈ సూచీ ఎంతో ఉపయోగపడుతుంది.
భారత ఆర్థిక వ్యవస్థలో సేవారంగం ఆధిపత్యం రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో, ఆ రంగాన్ని కూడా పరిశ్రమల మాదిరిగానే నిరంతరం కొలవడం అనివార్యమైంది. ఆ అవసరాన్ని తీర్చే దిశగా సేవా ఉత్పత్తి సూచీ ఒక కీలక సంస్కరణ. ప్రారంభంలో ఇది ప్రయోగాత్మక సూచీగానే ఉన్నప్పటికీ, రాబోయే రోజుల్లో భారత ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకోవడానికి అత్యంత కీలకమైన గణాంక సూచీలలో ఒకటిగా నిలవడం ఖాయం. దేశ ఆర్థికాభివృద్ధిని మరింత సమగ్రంగా అంచనా వేయడానికి ఇది కొత్త దిక్సూచిగా మారనుంది.





