ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా..
51 డిమాండ్లపై డిప్యూటీ సీఎం భట్టి చైర్మన్ గా కేబినెట్ సబ్ కమిటీ
డీఏపై రేపటి సాయంత్రలోగా నిర్ణయం
ఉద్యోగ సంఘాలతో సమావేశంలో కీలక నిర్ణయాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 22 : టీజీవో ఉద్యోగుల బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురువారం సమావేశమయ్యారు. ప్రధానంగా ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. ఉద్యోగుల సమస్యలపై ఆర్థిక మంత్రి భట్టి ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వానికి సహకరించాలని ఉద్యోగులను కోరారు. శుక్రవారం సాయంత్రంలోపు డీఏలపై స్పష్టత ఇస్తామని తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ వేసింది.
దీనికి సబ్ కమిటీ చైర్మన్ గా ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రత్యేక ఆహ్వానితులుగా కె.కేశవరావు ఉంటారని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.. దీపావళి తరువాత డిపార్ట్ మెంట్స్ వారీగా కేబినెట్ సబ్ కమిటీ సమావేశమవుతుందని సీఎం తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. . సమస్యల పరిష్కారానికి ఈ సమావేశం తొలి మెట్టు అని తెలిపారు. డీఏల విషయంలో శుక్రవారం సాయంత్రంలోగా నిర్ణయం ప్రకటిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. 317 జీవోపై కమిటీ నివేదిక సమర్పించిన నేపథ్యంలో కేబినెట్ లో నిర్ణయం తీసుకోనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.