ఓట‌ర్ల జాబితా ఖ‌చ్చిత‌త్వం కోస‌మే ‘స‌ర్‌’

– ఎన్నిక‌ల సంఘం నిర్వ‌హించే స్వ‌తంత్ర ప్ర‌క్రియ‌
– ప్ర‌తి భార‌త పౌరుడికి ఓటు హ‌క్కు క‌ల్పించ‌డ‌మే ల‌క్ష్యం
– విప‌క్షాలు ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదారి ప‌ట్టిస్తున్నాయి
– బీఎల్ఓల‌ను బెదిరించ‌వ‌ద్దు, వేరే ప‌నులు పుర‌మాయించొద్దు
– కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 27:  కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ‘స‌ర్‌’ ప్రక్రియ ఓటర్ల జాబితాను మరింత పారదర్శకంగా, ఖచ్చితంగా, విశ్వసనీయంగా మార్చే అత్యంత కీలకమైన కార్యక్రమమ‌ని కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయ‌న మీడియా స‌మావేశంలో శ‌నివారం మాట్లాతూ ఇది కొత్తగా మొదలైన ప్రక్రియ కాదు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కూడా అనేకసార్లు ఈ ప్రక్రియ నిర్వ‌హించార‌ని గుర్తుచేశారు. అర్హత ఉన్న ప్రతి భారతీయుడికి ఓటు హక్కు కల్పించాలన్న‌దే ఈ ప్ర‌క్రియ ఉద్దేశ‌మ‌న్నారు. దురదృష్టవశాత్తు కొన్ని పార్టీలు ఈ ప్రక్రియను కూడా రాజకీయ కోణంలో చూస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాయ‌ని ఆరోపించారు. ‘స‌ర్ ‘ప్రక్రియ జరిగిన రాష్ట్రాల్లో పోలింగ్ శాతం కూడా పెరిగింద‌న్నారు. ఎందుకంటే ఈ ప్రక్రియ ద్వారా ప్రతి ఓటరు చైతన్యవంతమవుతున్నారన్నారు. దీనివల్ల పోలింగ్ రోజు ఓటు వేయాలనే బాధ్యత, అవగాహన మరింత పెరుగుతోంద‌న్నారు. ఎన్నికల సంఘం రాజకీయాలకు, ప్రభుత్వాలకు అతీతంగా పనిచేసే రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థ.. అది ఏ పార్టీకి, ఏ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసే సంస్థ కాదు. కాబట్టి ఎన్నికల సంఘంపై నిరాధార ఆరోపణలు చేయడం, ప్రజల్లో అనుమానాలు కలిగించడం, ఆందోళన సృష్టించడం సరైనది కాద‌ని కిష‌న్‌రెడ్డి హిత‌వు ప‌లికారు. బీఎల్ ఓలు ఇంటికే వచ్చి వివరాలు సేకరిస్తున్నారు కాబట్టి ప్రతి పౌరుడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటర్ల జాబితా సవరణలో భాగస్వామ్యం కావాల‌ని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో రోహింగ్యాలు, బంగ్లాదేశ్ నుంచి వచ్చినవారు, పాకిస్తాన్ నుంచి అక్రమంగా వచ్చినవారు ఉన్నారనే విషయాలు గతంలో అనేక కేసుల ద్వారా బయటపడ్డాయ‌ని, కొంతమంది జైళ్లలో కూడా ఉన్నారని గుర్తు చేశారు. వారిలో చాలామందికి ఓటర్ ఐడీలు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు కూడా ఉన్నాయనే విషయాలు వెలుగులోకి వచ్చాన్నారు. ఈ వాస్తవాలను పక్కనబెట్టి ఓటర్ జాబితా శుద్ధి ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం చేయడం విప‌క్షాల బాధ్యతారాహిత్యమ‌న్నారు.ముఖ్యమంత్రి స్వయంగా కొన్ని వర్గాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం మరింత ఆందోళన కలిగిస్తోందన్నారు. ఎన్నికల సంఘంపై ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసినా ఈ ప్రక్రియ ఆగదని స్ప‌ష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించడం, బీఎల్ఓల‌పై ఒత్తిడి తేవ‌డం, ఇంటింటికీ వెళ్లొద్దని చెప్పడం వంటి చర్యలు అత్యంత దురదృష్టకరమ‌న్నారు. ప్రత్యేకంగా ఓల్డ్ సిటీలో ఎంఐఎం నాయకులు బీఎల్ఓలను బెదిరిస్తూ ఇంటింటికీ వెళ్లి సర్వే చేయవద్దని, తమ ద్వారా మాత్రమే ఫారాలు ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం వస్తోందని. ఇది అత్యంత ప్రమాదకర ధోరణి అని కిష‌న్ రెడ్డి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఎన్నికల సంఘం ప్రక్రియపై రాజకీయ ఒత్తిడి తీసుకురావడం ప్రజాస్వామ్యానికి మంచిది కాద‌న్నారు.మజ్లిస్ పార్టీ కనుసైగల్లో స‌ర్‌ ప్రక్రియ నడవాలని ఎవరైనా అనుకుంటే అది సాధ్యం  కాద‌ని స్ప‌ష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులను ఎవరైనా బెదిరిస్తే బీజేపీ వారికీ అండగా నిలుస్తుంద‌న్నారు. కొన్నచోట్ల బీఎల్ఓలతో ఎన్నికల ప్రక్రియకు సంబంధం లేని కార్యక్రమాలు కూడా చేయిస్తున్నారనే ఫిర్యాదులు వచ్చాయ‌ని, ఇందిరమ్మ చీరల పంపిణీ వంటి కార్యక్రమాల్లో వారిని నియోగించడం తగదన్నారు. ఈ అంశంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామ‌న్నారు. దీనిపై కూడా ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ‘మీ ఓటు గ్రామంలో లేకపోతే మీ సంక్షేమ పథకాలు పోతాయి..మీ భూమి పోతుంది.. మీ పెన్షన్ పోతుంది అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంబెదిరింపులకు పాల్పడుతోంద‌ని ఆరోపించారు. ఈ బెదిరింపులకు ఎవరూ లొంగాల్సిన అవసరం లేదు.హైదరాబాద్‌లో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ తమ ప్రస్తుత నివాసాన్ని ఆధారంగా చేసుకుని ఇక్కడే ఓటు నమోదు చేసుకోవచ్చు. భవిష్యత్తులో అవసరమైతే తిరిగి మీ గ్రామానికి, జిల్లాకు లేదా రాష్ట్రానికి మార్చుకునే అవకాశం ఎప్పుడైనా ఉంటుంది. ప్రతి పౌరుడు తన ఓటు హక్కును కాపాడుకోవాలన్నారు.  ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా స‌ర్ ప్రక్రియలో పాల్గొని ఎన్నికల సంఘానికి సహకరించాలని కిష‌న్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *