ఉద్యోగ సంఘాల జెఎసితో సిఎం భేటీ
పలు అంశాలపై ముఖ్యమంత్రి సుదీర్ఘ చర్చ
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24 : తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ (టీజీవో) ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో చర్చలు జరిగాయి. సీఎస్ శాంతికుమారి, ప్రభుత్వ సలహాదారు కేకే, జేఏసీ ప్రతినిధులు చర్చల్లో పాల్గొన్నారు. జెఎసి ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, జేఏసీ ప్రతినిధులు. ఉద్యోగుల సమస్యలపై చర్చించారు.
భేటీ అనంతరం జేఏసీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మాట్లాడి ప్రకటన చేస్తామని సీఎం చెప్పినట్లు వారు తెలిపారు. ‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అన్ని విషయాలను ఒకదాని తర్వాత ఒకటి పరిష్కరించుకుంటూ వస్తున్నాం. ఉద్యోగుల సమస్యలు కూడా నాకు తెలుసు. ఒకటి రెండు రోజుల్లో ఒక నిర్ణయం తీసుకొని ప్రకటన చేస్తాం. బదిలీలు, ఉద్యోగుల సర్వీసు అంశాలను పరిష్కరిస్తాం. వాటితో పాటు మిగతా అన్ని సమస్యలపై చర్చిస్తాం. ఆర్థిక, ఆర్థికేతర సమస్యలను పరిష్కరిస్తాం అని సీఎం హామీ ఇచ్చినట్లు జేఏసీ నేతలు తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వంపై పూర్తి నమ్మకం ఉందని వారు వెల్లడించారు. కాగా తమ డిమాండ్ల సాధనలో ఇది మొదటి మెట్టు అని ఉద్యోగులు పేర్కొన్నారు.
317 జీవో అంశంపై ప్రస్తుతం సబ్ కమిటీ పని చేస్తున్నందున జేఏసీ నేతలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పారని తెలిపారు. ఆర్థిక పరమైన అంశాలపై ఓ కమిటీని వేయబోతున్నట్లు సీఎం వెల్లడించారన్నారు. త్వరలో మరోసారి జేఏసీతో భేటీ అవుతానని చెప్పారన్నారు. ‘నేను మీ కుటుంబ సభ్యుడినని, మీ అన్నలాంటి వాడిని, మీ సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది, ఆందోళన అక్కర్లేదు’ అని భరోసా ఇచ్చారని ఉద్యోగులు తెలిపారు.
ఉద్యోగులు, ఉద్యోగసంఘాలపై తమ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు తీసుకోబోమని చెప్పారన్నారు. ఉద్యోగుల సమస్యలపై సీఎం స్పష్టమైన హామీ ఇచ్చినందున మధ్యవర్తులను, వేరే జేఏసీ పేరుతో మాట్లాడుతున్నవారి మాటలను ఉద్యోగులు నమ్మవొద్దని కోరారు. వేరే శాఖల్లోకి వెళ్లిన వీఆర్వోలను తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకుంటామని సైతం సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు.