పథకాలకు పాతర.. కుంభకోణాల జాతర

– వ‌చ్చే ఎన్నిక‌ల్లో బంగాళాఖాతంలోకి కాంగ్రెస్‌
– కేసీఆర్‌ నాయ‌క‌త్వంలో నెంబ‌ర్ వ‌న్ స్థానంలో రాష్ట్రం
– కాంగ్రెస్ పాల‌న‌లో తెలంగాణ‌కు తీర‌ని న‌ష్టం
– రైతుబంధు దేవుడెరుగు.. యూరియా దిక్కులేదు
– మ‌హేశ్వ‌రం బీఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో కేటీఆర్‌

మ‌హేశ్వ‌రం, ప్ర‌జాతంత్ర‌, జూన్ 27: అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ బంగాళాఖాతంలో కలిసేది పక్కా, బ్రహ్మాండంగా బీఆర్ఎస్ గెలిచేది పక్కా అని బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి శ‌నివారం ముఖ్య అతిథిగా హాజరై ‘స‌ర్‌’తోపాటు పార్టీ సభ్యత్వ నమోదుపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ మహేశ్వరంలో కార్యకర్తల జోష్ చూస్తుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిన భావన కలుగుతోంద‌న్నారు. కేసీఆర్ కిట్ పోయింది. కరెంటు కోతల కాలం వచ్చింది.  రైతు బంధు పోయింది.. రాహుల్ బంధు వచ్చింది. రాష్ట్రంలో సంక్షేమ పథకాల పాతర.. కుంభకోణాల జాతర నడుస్తోంద‌ని విమ‌ర్శించారు. సీఎంగా రేవంత్ ఉన్నా ప్రజలు కేసీఆర్ నే త‌ల‌చుకుంటున్నార‌న్నారు. మహేశ్వరం ముద్దుబిడ్డ సిరిపురం యాదయ్య ఓయూ వద్ద రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేశారు.. ఎంతోమంది అమరవీరుల త్యాగాల స్ఫూర్తితోనే పదేళ్ల పాలన సాగింది. ప్రజాసంక్షేమం.. ప్రగతిపథం రెండు జోడెడ్లలా ముందుకు సాగాయి. ఇవాళ బీఆర్ఎస్ ఓడిపోవడం వల్ల ఎవరు నష్టపోయారో ఆలోచించండన్నారు. ఇవాళ కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కోలుకోని నష్టం జరిగింది. మేఘాలయ ముఖ్యమంత్రి సంగ్మా నిన్న హైదరాబాద్ కు వచ్చి కేసీఆర్ నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ను చూసి ఆశ్యర్యపోయారు. ఆయ‌న‌ నాకు స్వయంగా ఫోన్ చేసి కేసీఆర్ దార్శనికత అద్భుతమని కొనియాడారు. ఇంత అద్భుతమైన వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదని అభినందించారన్నారు. పోరాటయోధుడే పాలకుడైతే పరిపాలన ఎలా ఉంటుందో ఇదో ఉదాహరణ అన్నారు. నాడు ఉద్యమ నాయకుడికి ప్రజలు పాలనా పగ్గాలు అప్పగిస్తే.. తెలంగాణను నంబర్ వన్ స్థానంలో నిలబెట్టారు. రాష్ట్రం రాకెట్ వేగంతో దూసుకుపోయే సమయంలో  పొరపాటునో, గ్రహపాటునో ఇప్పుడు ఒక ద్రోహి ముఖ్యమంత్రి అయ్యిండు అని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మూడో పంటకు రైతుబంధు ఎందుకు ఇవ్వరు అని అడిగిండు.. ఒక్కరికే పెన్షన్ ఇస్తున్నరు.. నేను కుటుంబంలో ఇద్దరికి ఇస్త అని మాయమాటలు చెప్పిండు. రైతుబంధు 15 వేలు చేస్తా అని డైలాగులు కొట్టిండు. 420 అబద్ధాలతో ఆగం చేసి గద్దెనెక్కిండు. రైతుబంధు దేవుడెరుగు.. కనీసం యూరియాకు రాష్ట్రంలో దిక్కులేదు.. షాపులో కాదు.. యూరియాను యాపులో పెడ్తం అన్నరు. ఇప్పుడు యాప్ లో యూరియా కాదు కదా..చివరికి రంగారెడ్డి జిల్లా పేరు లేదు.. మల్కాజ్ గిరి పేరు లేదు. ఇక్కడ బ్రహ్మాండమైన రైతులున్నా రేవంత్ రెడ్డికి కనిపించడం లేదా అని ప్ర‌శ్నించారు. వంద రోజులు గ్యారెంటీ కార్డు జాగ్రత్తగా పెట్టుకోమని భ‌ట్టి అన్నరు.. రెండున్నరేళ్లయినా నాలుక గీసి పడేయడానికి కూడా ఈ గ్యారెంటీ కార్డు పనికి రావడంలేద‌ని ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీలకు అసైన్డ్ భూముల పట్టాలిస్తాం అని దగా చేశారన్నారు. రెండున్నరేళ్లలో నాలుగు లక్షల కోట్ల అప్పు చేసిన రేవంత్ ఒక్క ఇటుక పేర్చిన పాపాన పోలేదు. నేడు ముఖ్యమంత్రి రేవంత్ కు కనీసం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సంచులిచ్చే ముఖం లేదు. సంచులన్నీ ఢిల్లీకి పోతున్నై అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అని కొత్త డైలాగులు కొడుతున్నడు. ముఖ్యమంత్రికి నిజాయ‌తీ ఉంటే ముందు కనీసం లక్షాధికారులను చెయ్యాలి. రాష్ట్రంలో 18 ఏండ్లు నిండిన ఆడబిడ్డలు.. కోటి 67 లక్షల మంది ఉన్నారు.  వారందరికీ నెలకు 2500 చొప్పున ఐదేళ్లకు ఇవ్వాల్సిన‌వి ఇస్తే శాశ్వతంగా రాజకీయ సన్యాసం చేస్తా అని సవాల్ చేస్తున్నాన‌న్నారు. ఫోర్త్ సిటీ, ప్యూచర్ సిటీ, పేరిట అన్నదమ్ములు విలువైన భూములపై పడి దోచుకుంటున్నరు. కేసీఆర్ ఈ ప్రాంతంపై ప్రేమతో ఇక్కడి బిడ్డలకు కొలువులు రావాలనే ఫార్మా సిటీ తెచ్చారు. ప్రపంచ స్థాయిలో కాలుష్యం లేకుండా, అంతర్జాతీయ ప్రమాణాలతో జీరో లిక్విడ్ డిస్చార్జ్ తో కట్టాలని సంకల్పించారు. మూడు హెలికాప్టర్లలో అధికారులను తీసుకొచ్చి ఈ స్థలాన్ని ఎంపిక చేశారు. ఐదు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా హైదరాబాద్ ఫార్మా సిటీకి ఏడేళ్లు కష్టపడి ప్రణాళికలు రచించారు. రైతులను మెప్పించి ఒప్పించి 14 వేల ఎకరాలను మహేశ్వరం, ఇబ్రహింపట్నం లో సేకరించాం. కరోనా వంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు హైదరాబాదే ప్రపంచానికి ఏకైక దిక్కు కావాలని అనుకున్నాం. సీఎం రేవంత్ అధికారంలోకి రాగానే ఫార్మా సిటీ రద్దు అన్నారు. ఫార్మా సిటీ రద్దుచేసి, ఆ భూములు తిరిగి రైతులకు ఇస్తామన్నారు. ఆ భూములు వెనక్కి ఇచ్చేది లేదు అని ఇప్పుడు మాట మార్చారు. రెండున్నరేళ్లలో ఇంచు భూమైనా వెనక్కి ఇచ్చారా.. మొత్తం రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నరు. ఎట్లా భూములు గుంజుకోవాలె అనేదే రేవంత్ సర్కారు ఏకైక పని అన్నారు. 16 వేల ఎకరాలు కాదట.. మొత్తం 30 వేల ఎకరాలతో ఫ్యూచర్ సిటీ అని పొంకనాలు కొడుతున్నరు. రాష్ట్రంలో రేవంత్ ఫ్యూచర్ కే దిక్కులేదు.

కార్యకర్తలే కథానాయకులై కదంతొక్కాలి

కార్యకర్తలే కథానాయకులై కదంతొక్కితే ప్రతి బూత్ లో బీఆర్ఎస్ పార్టీకే మెజారిటీ వస్తది. ఎస్.ఐ.ఆర్. కార్యక్రమాన్ని కార్యకర్తలు అత్యంత సీరియస్ గా తీసుకోవాలి. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా అప్రమత్తంగా వ్యవహరించండి. డిజిటల్ రూపంలో పార్టీ సభ్యత్వ నమోదును పెద్దఎత్తున విజయవంతం చేయండి. ప్రతి కార్యకర్తకు పార్టీ తరఫున ప్రత్యేక గుర్తింపు కార్డును ఇస్తాం. ఈ గుర్తింపు కార్డుతో కార్యకర్తలు ఎక్కడికెళ్లినా గౌరవం లభిస్తది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల యుద్దానికి ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులు సిద్ధం కావాల‌ని పిలుపునిచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *