ఆ ప్రాజెక్టుల‌తో మనకు మరణ శాసనమే

– సీక్రెట్ మీటింగ్‌లో కుదిరిన ఒప్పందాన్ని బయటపెట్టాలి
– బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు డిమాండ్
– ముంపు మేస్త్రివి కావద్దు  రేవంత్‌కు హితవు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 27 : కర్ణాటకలో జరిగిన తుంగభద్ర గేట్ల ప్రారంభోత్సవంలో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై చారిత్రక ఒప్పందం చేసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి సంబరాలు చేసుకోవడం పూర్తిగా హాస్యాస్పదమని బీఆర్‌ఎస్ నేత టి.హరీష్‌రావు అన్నారు. ఇటు కర్ణాటక, అటు ఏపీ కలిసి మొత్తం 55 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునేలా నవేలి, గుండ్రేవుల ప్రాజెక్టుల రూపకల్పనతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గుండ్రేవులపై 2013 నాటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ జడ్జిమెంట్‌లో చాలా స్పష్టంగా ఉందని, సిల్టేషన్ సమస్య ఉంటే ప్రత్యామ్నాయాలు చూసుకోవాలి తప్ప కొత్త ప్రాజెక్టు కట్టాల్సిన అవసరం లేదని, గుండ్రేవులకు నీటి కేటాయింపులు చేయలేమని తేల్చి చెప్పిందని పేర్కొన్నారు. గత తొమ్మిదిన్నరేళ్ల బీఆర్‌ఎస్ హయాంలో ఏపీ ప్రభుత్వం గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మించే ప్రయత్నం చేస్తే తీవ్రంగా వ్యతిరేకించి, నిరసన తెలపడం ద్వారా దాన్ని కోల్డ్ స్టోరేజీలో పడేశామన్నారు. ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుచరుడు, శిష్యుడు అయిన వ్యక్తి తెలంగాణకు ముఖ్యమంత్రి అవ్వడం వల్లే మళ్లీ గుండ్రేవుల ప్రాజెక్టును తెరమీదకు తీసుకొచ్చారన్నారు. తుంగభద్ర నదిపై కొత్త ప్రాజెక్టులతో ఈ 55 టీఎంసీల నీటిని అటు కర్ణాటక, ఇటు ఏపీ ఆపేస్తే నీరు9 శ్రీశైలం రాక దానిపై ఆధారపడిన కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. ముఖ్యమంత్రుల సమావేశంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని, మన రాష్ట్ర ఇంజనీర్లను లోపలికి రానివ్వకుండా బయటే కూర్చోబెట్టారని ఆరోపించారు. కర్ణాటక, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులతోపాటు కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి కాంతారావు మాత్రమే ఆ సమావేశంలో పాల్గొన్నారన్నారు. ఏపీతో అనుబంధం ఉండి, చంద్రబాబు నాయుడు తనకున్న పలుకుబడితో కేంద్రంలో కార్యదర్శిగా నియమింపజేసుకున్న కాంతారావు సమక్షంలో జరిగిన ఆ సీక్రెట్ మీటింగ్‌లో కుదిరిన అగ్రిమెంట్ ఏంటో రేవంత్ రాష్ట్ర ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. దేవాదుల ఏ దేశంలో ఉందో తెలియదు, నల్లమల ఏ రాష్ట్రంలో ఉందో తెలియదు.. బచావత్ ట్రిబ్యునల్‌కు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు తేడా తెలియక గతంలో అనేకసార్లు అభాసుపాలైన రేవంత్ రెడ్డికి నదీ జలాలపై అవగాహన తక్కువ అని హరీష్‌రావు ఎద్దేవా చేశారు. మూడు రాష్ట్రాల మధ్య గొప్ప ఒప్పందం జరిగిందంటున్న రేవంత్ రెడ్డి ఆర్డీఎస్ ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు రావాల్సిన 15.9 టీఎంసీల న్యాయమైన వాటా సాధించారా లేదా స్పష్టం చేయాలన్నారు. నాడు కేసీఆర్ తుమ్మిళ్ల లిఫ్ట్ పెట్టి కనీసం 50 వేల ఎకరాలకైనా నీళ్లు వచ్చేలా చేశారు.. మరి నిన్నటి మీటింగ్‌లో ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం రావాల్సిన 15.9 టీఎంసీల గురించి కేంద్ర మంత్రి నుంచి రేవంత్ రెడ్డి ఏదైనా స్పష్టమైన హామీ తీసుకున్నారా అని ప్రశ్నించారు. తుంగభద్రపై కర్ణాటక అక్రమంగా, ఎలాంటి అనుమతులు లేకుండా కురుడి 2 టీఎంసీలు, చిక్కలపర్వి 2.5 టీఎంసీల బ్రిడ్జ్ కం బ్యారేజ్, చుక్కలమంచి 5 టీఎంసీల బ్రిడ్జ్ కం బ్యారేజ్ పేరుతో మొత్తం 9.5 టీఎంసీల సామర్థ్యంతో మూడు బ్యారేజీలు కడుతోందని తెలిపారు. కర్ణాటక బ్యారేజీల వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని రేవంత్ రెడ్డి ఆ సమావేశంలో కనీసం మాట్లాడలేదని, వీటిని నిలిపివేయాలని కేంద్ర మంత్రి నుంచి ఎలాంటి హామీ తీసుకోలేదని అన్నారు. కర్ణాటక అడిషనల్ చీఫ్ సెక్రటరీ మన ఇరిగేషన్ కార్యదర్శికి రాసిన లేఖలో చిక్కమంచి, చిక్కలపర్వి ప్రాజెక్టులపై తెలంగాణ ఎలాంటి అభ్యంతరాలు చెప్పవద్దు.. కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లకుండా సైలెంట్‌గా ఉండండి అని కోరినట్లు స్పష్టంగా ఉందన్నారు. ఈ మూడు కర్నాటక ప్రాజెక్టుల పనులు ప్రారంభమై ఏడాది దాటి ఇప్పటికే సగానికిపైగా పూర్తయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేంద్రానికి గానీ, కృష్ణా బోర్డుకు గానీ ఎలాంటి అభ్యంతరాలు తెలపకుండా కర్ణాటకతో కుమ్మకైందని ఆరోపించారు. తెలంగాణను పోరాడి సాధించిన పార్టీగా బీఆర్‌ఎస్.. రేవంత్ రెడ్డి నీటి హక్కులను హరిస్తానంటే చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారు. గోదావరి నదిలో తెలంగాణకు 968 టీఎంసీల నికర నీటి కేటాయింపు లు ఉండగా బీఆర్‌ఎస్ హయాంలో 830 టీఎంసీలకు పూర్తి అనుమతులు తెచ్చుకున్నామని, మరో 138 టీఎంసీలకు అనుమతులు రావాల్సి ఉందని గుర్తు చేశారు. గతంలో కాంగ్రెస్, టీడీపీల పాలనలో గోదావరిలో కేవలం 265 టీఎంసీలకే అనుమతులు తెచ్చాయి.. అంటే ఏడాదికి సగటున 4.48 టీఎంసీలు సాధిస్తే బీఆరఎస్ ప్రభుత్వం  తొమ్మిదిన్నరేళ్లలో 383 టీఎంసీలకు ఏడాదికి సగటున 40.36 టీఎంసీలు అనుమతులు సాధించిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు దాటినా ఇప్పటివరకు ఒక్క టీఎంసీ నీటికి కూడా కొత్తగా అనుమతులు సాధించలేదన్నారు. నదుల అనుసంధానం జరగాలంటే ముందు తెలంగాణ 968 టీఎంసీల ప్రాజెక్టుల అనుమతులన్నీ క్లియర్ కావాలని బీఆర్‌ఎస్ నాడే కేంద్రానికి తేల్చి చెప్పిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు సాధించకుండానే నదుల అనుసంధానానికి ఎలా ముందుకు వెళ్తోంది అని నిలదీశారు. పెండింగ్‌లో ఉన్న 138 టీఎంసీలకు సంబంధించి సమ్మక్క సాగర్ 47 టీఎంసీలు, వాద్ర ప్రాజెక్టు 20 టీఎంసీలు, ఎల్లంపల్లి 30 టీఎంసీలు డీపీఆర్‌లను బీఆరఎస్ ప్రభుత్వం దిల్లీలో సబ్మిట్ చేస్తే రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం, క్లియరెన్స్ లేకపోవడం వల్ల వాటి డీపీఆర్‌లు వెనక్కి వచ్చాయన్నారు. రేవంత్ రెడ్డి మన 968 టీఎంసీల హక్కుల గురించి ఆలోచించకుండా గోదావరి-బనకచర్ల ఇంటర్ లింకింగ్‌కు ఓకే చెప్తూ రాష్ట్రానికి తీవ్ర నష్టం చేస్తున్నాడని ఆరోపించారు. కేసీఆర్ తొమ్మిదేళ్లు పోరాడి, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి, సుప్రీంకోర్టు దాకా వెళ్లి కృష్ణా నదీ జలాల పున:పంపిణీ కోసం ట్రిబ్యునల్ సాధించారని, కొద్ది నెలల్లోనే కృష్ణా ట్రిబ్యునల్ అవార్డు నీటి లెక్కలు తేలనుండగా రేవంత్ రెడ్డి అజ్ఞానం, గురువుకు గురుదక్షిణ చెల్లించుకోవాలనే తపనతో గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులకు శాపంగా మారిందని అన్నారు. రేవంత్ రెడ్డి గత ఏడాది జూన్ 18న కృష్ణా బేసిన్ మీద 500 టీఎంసీలకు బ్లాంకెట్ ఎన్‌వోసీ ఇస్తామని, ఆ తర్వాత ఏ ప్రాజెక్టులైనా కట్టుకోండని చంద్రబాబుకు ఆఫర్ ఇచ్చారని, సెప్టెంబర్ 13 సమీక్షలో కృష్ణా జలాల్లో 904 టీఎంసీల వాటా సాధిస్తామని పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రతీ దశలోనూ రేవంత్ రెడ్డి చంద్రబాబుకు సహకరిస్తూ తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి కూడా రేవంత్ రెడ్డి నిన్ను బయట కూర్చోబెడితే ఎలా ఊరుకున్నావు.. కనీసం నీకైనా తెలంగాణ సోయి లేదా అని ఉత్తమ్ కుమార్‌ను ప్రశ్నించారు. రాష్ట్ర భవిష్యత్తును కేంద్ర మంత్రి సి.ఆర్.పాటిల్ చేతుల్లో పెట్టారన్నారు. ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలని, ముగ్గురు సీఎంల సమావేశంలో మాట్లాడిన అంశాలను వెంటనే శాసనసభలో పెట్టి చర్చించాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు. సమ్మక్క సాగర్ 47 టీఎంసీలు ద్వారా వరంగల్, నల్గొండ జిల్లాల్లోని ఎస్సారెస్పీ స్టేజ్-2 ఆయకట్టుకు 4 లక్షల ఎకరాలకు నీరందించాల్సి ఉంది.. దాన్ని రేవంత్ రెడ్డి ఎందుకు బలిపెడుతున్నారని అడిగారు. కృష్ణా ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం పరివాహక ప్రాంతం చట్టరీత్యా తెలంగాణకు 700-800 టీఎంసీలు వస్తాయి.. పోలవరం డైవర్షన్ కింద 45 టీఎంసీలు, పాలమూరుకు 90 టీఎంసీలు రావాల్సిందే అని స్పష్టం చేశారు. నదుల అనుసంధానం చంద్రబాబు, మోదీ కల కావచ్చు కానీ అది తెలంగాణను బలిపెట్టకూడదన్నారు. హైడ్రా విషయంలో హిట్లర్ స్ఫూర్తి అని చెప్పుకునే రేవంత్‌కి నీళ్ల విషయంలో రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించిన నీరో చక్రవర్తి స్ఫూర్తిగా అయి ఉండొచ్చని వ్యాఖ్యా నించారు. 968 టీఎంసీల గోదావరి హక్కులను కాపాడారా.. సమ్మక్క సాగర్ ఇంటర్ లింకింగ్ ప్రతిపాదన ఉందా లేదా.. అందులో 50% నీళ్లు తెలంగాణకు వస్తున్నాయా.. ఆర్డీఎస్ కింద 15.9 టీఎంసీలు సాధించారా.. కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను ఆపాలని లేఖ రాస్తారా లేదా.. ఈ విషయాలపై రేవంత్ రెడ్డి ప్రజలకు స్పష్టత ఇవ్వాలన్నారు. ట్రిబ్యునల్స్ ముందు గట్టిగా వాదనలు వినిపించేందుకు మంచి లాయర్లను పెడితే 700-800 టీఎంసీలు సాధించే అవకాశముందని హరీష్‌రావు తెలిపారు. రేవంత్ రెడ్డీ.. నువ్వు గుంపు మేస్త్రివి కావచ్చు.. కానీ తెలంగాణను ముంచే ‘ముంపు మేస్త్రివి’ కావద్దు అని హితవు పలికారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *