స్వగృహ ప్లాట్ల విక్రయానికి మంచి స్పందన

– తొర్రూర్‌లో చదరపు గజం రూ.45,500
– బహదూర్‌పల్లిలో రూ.40,500
– సుమారు రూ.83 కోట్ల మేర ఆదాయం

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 18: రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఓపెన్ ప్లాట్ల కొనుగోలుకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. ఎలాంటి వివాదాలు లేని, అన్ని వసతులతో అభివృద్ధి చెంది మంచి డిమాండ్‌తో ఫ్యూచర్ సిటీకి, అవుటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోని తొర్రూర్ (66 ప్లాట్లు), కుర్మల్‌గూడ (11), బహదూర్‌పల్లి (8) ప్రాంతాల్లో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌కు చెందిన 85 ఓపెన్ ప్లాట్ల విక్రయానికి సోమవారం బహిరంగ వేలం నిర్వహించారు. పెద్ద అంబర్‌పేటలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఈ వేలంలో పాల్గొన్న బిడ్డర్లు చదరపు గజానికి నిర్దేశించిన దానికంటే అధిక మొత్తంతో ప్లాట్లను కొనుగోలు చేయడం విశేషం.  సుమారు రూ.83 కోట్ల మేర ఆదాయం వచ్చిందని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ వి.పి గౌతం తెలిపారు.

తొర్రూర్‌లో పోటీ పడిన బిడ్డర్లు

తొర్రూల్ లే అవుట్‌లో ప్లాట్‌ను కొనుగోలు చేయడానికి బిడ్డర్లు పోటీ పడుతూ గరిష్టంగా చ.గ స్థలాన్ని రూ.45,500కు కొనుగోలు చేశారని ఎండీ గౌతం తెలిపారు. ఓఆరఆర్, ఆదిభట్ల ఐటీ కారిడార్‌కు సమీపంలో ఉన్న తొర్రూర్ లో 200-700 చ.గ విస్తీర్ణంలో ఉన్న 66 ప్లాట్లకు చదరపు గజానికి కనీస ధర రూ.25 వేలుగా నిర్దారించగా, సగటున రూ.32,500 ధర పలికిందన్నారు. తమకు నచ్చిన భూముల కోసం పోటీపడుతూ బిడ్డర్లు ఒక దశలో ప్లాట్‌ను దక్కించుకోడానికి దాదాపు 20సార్లు ధరలు పెంచారంటే ఇక్కడి భూములకున్న డిమాండ్ అర్ధం చేసుకోవచ్చునన్నారు. అదేవిధంగా ఎయిర్‌పోర్టు, ఆర్సీఐకి దగ్గర్లో ఉన్న కుర్మల్‌గూడలో 200 నుంచి 400 చ.గ విస్తీర్ణంలోని ప్లాట్లకు కనీస ధర రూ.20 వేలుగా నిర్ణయించగా గరిష్టంగా రూ.27,500 ధర పలికిందన్నారు. అవుటర్ రింగ్ రోడ్‌ను ఆనుకుని ఉన్న బహదూర్‌పల్లి ప్రాంతంలో 200 నుంచి 1000 చ.గ విస్తీర్ణంలోని ప్లాట్లకు కూడా మంచి ధర పలికింది. ఇక్కడ చదరపు గజం కనీస ధర రూ.27 వేలుగా నిర్ణయించగా వేలం పాటలో గరిష్ఠంగా రూ.40,500 ధర పలికిందని, వేలం పాటలో సగటున ఈ భూములకు గజం రూ.33,800కు కొనుగోలు చేశారని  గౌతం తెలిపారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 150 మంది బిడ్డర్లు పాల్గొన్నారన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *