అడవిని ఆదాయ వనరుగా మార్చే దిశగా అడుగు

– గిరిజన ఆర్థిక స్వావలంబనకు ఇప్ప పువ్వు ప్రాజెక్టు దిక్సూచి
– గిరిజన మహిళలు, రైతులు, యువత ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
– గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ 

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 15: గిరిజన ప్రాంతాల్లో సంప్రదాయ జీవన విధానానికి ఆధారమైన ఇప్ప (మహువా) పువ్వును గిరిజన కుటుంబాల ఆర్థికాభివృద్ధికి ప్రధాన వనరుగా మలిచే దిశగా ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. సచివాలయంలోని తన బ్లాక్‌లో శుక్రవారం జరిగిన మహువా ఫ్లవర్ ప్రాజెక్టు అమలుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ గిరిజన ఆదివాసీ మహిళలు, రైతులు, యువత, ముఖ్యంగా అత్యంత వెనుకబడిన గిరిజనవర్గాల జీవనోపాధి మెరుగుదలకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని స్పష్టం చేశారు. అడవుల్లో సహజ సిద్ధంగా లభించే ఇప్ప పువ్వు గిరిజన సంస్కృతి, ఆహార సంప్రదాయాలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఇప్ప పువ్వును సంప్రదాయ వినియోగానికి మాత్రమే పరిమితం కాకుండా ఆహార ఉత్పత్తులు, ఔషధ వినియోగాలు, విలువ ఆధారిత పరిశ్రమలు, గ్రామీణ సూక్ష్మ పరిశ్రమల అభివృద్ధికి ఉపయోగించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. గిరిజన ప్రాంతాల్లో శాస్త్రీయ సేకరణ, నిల్వ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ వ్యవస్థలను అభివృద్ధి చేసి గిరిజన కుటుంబాలకు స్థిరమైన ఆదాయం అందించేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రత్యేకంగా గిరిజన మహిళా సంఘాలు, స్వయం సహాయక బృందాలు, యువజన సమాఖ్యలను ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం చేసి గ్రామీణ స్థాయిలో ఉపాధి అవకాశాలు పెంచాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. గిరిజన ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన, పోషకాహార భద్రత, మహిళా సాధికారత, యువతకు ఉపాధి కల్పన వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఇప్ప పువ్వు ఆధారిత ప్రాజెక్టులను రూపొందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లో సహజ వనరుల ఆధారంగా స్థిరమైన ఉపాధి అవకాశాలు సృష్టించి యువత వలసలను తగ్గించడం, మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.  వివిధ శాఖలతో అలాగే ప్రభుత్వ యంత్రాంగం ఉమ్మడిగా పైలట్ ప్రాజెక్టులు చేపట్టి భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే దిశగా కార్యాచరణ చేపట్టాలని మంత్రి సూచించారు.

చిన్న పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి

మంత్రి సీతక్క మాట్లాడుతూ ఇప్ప పువ్వు అటవీ ఉత్పత్తి మాత్రమే కాక గిరిజన కుటుంబాల ఆర్థిక స్వావలంబనకు బలమైన ఆధారంగా మారే సామర్థ్యం కలిగి ఉందన్నారు. ఇప్ప పువ్వు నుండి సంప్రదాయ ఆహార పదార్థాలు తయారు చేయవచ్చని, గింజల నుండి నూనె తయారీకి కూడా విశేష అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఆకులు, పువ్వులు, గింజలు అన్నీ వినియోగంలోకి తీసుకువస్తే గిరిజన ప్రాంతాల్లో చిన్నస్థాయి పరిశ్రమలు ఏర్పడి మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందన్నారు. గ్రామీణ స్థాయిలో మహిళా సంఘాలకు శిక్షణ ఇచ్చి ట్రైబల్ నాచురల్ ఫుడ్ బ్రాండ్స్ రూపంలో మార్కెట్‌లోకి తీసుకురావాలని సూచించారు. గిరిజన మహిళల సంప్రదాయ జ్ఞానాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానం చేస్తే ప్రపంచ మార్కెట్‌లో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావచ్చని సీతక్క పేర్కొన్నారు. గిరిజన మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీలు, ప్రభుత్వ సబ్సిడీలు, స్వయం ఉపాధి పథకాలను అనుసంధానం చేయాలని అధికారులకు సూచించారు. వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ మహువా ప్రాజెక్టును కేవలం చర్చల స్థాయిలో కాక క్షేత్రస్థాయిలో అమలు జరిగేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే గిరిజన ప్రాంతాల్లో కొత్త ఆశలు నింపుతుందని నరేందర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లో సేకరణ తర్వాత నిల్వ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ వ్యవస్థలు బలోపేతం కాకపోతే గిరిజనులకు ప్రయోజనం కలగదన్నారు. అందువల్ల ఇప్ప పువ్వు ఆధారిత ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ ప్రాజెక్టు అమలుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి వివిధ శాఖల సమన్వయంతో కార్యాచరణను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. సరైన ప్రణాళిక, పారదర్శక అమలు, మార్కెటింగ్ వ్యవస్థలతో తెలంగాణను దేశంలోనే మహువా ఆధారిత పరిశ్రమల కేంద్రంగా తీర్చిదిద్దే అవకాశం ఉందన్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గిరిజన మహిళా సంఘాలు, యువత భాగస్వామ్యంతో గ్రామీణ స్థాయిలో సూక్ష్మ పరిశ్రమలు నెలకొల్పే అవకాశాలను స్పష్టంగా వివరించారు. గిరిజన ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరగాలంటే అటవీ ఉత్పత్తులకు సరైన మార్కెట్ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రొఫెసర్ వెంకట రామయ్య చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విశేషంగా ఆకట్టుకుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మహువా ఆధారిత జీవనోపాధి నమూనాలు, గిరిజన ఆర్థిక వ్యవస్థలో వాటి ప్రభావం, విలువ ఆధారిత ఉత్పత్తుల ద్వారా ఆదాయం పెంపు వంటి అంశాలను శాస్త్రీయ విశ్లేషణతో వివరించారు. గిరిజన ప్రాంతాల్లో సహకార సంఘాలు, మహిళా సమాఖ్యలు, స్టార్టప్ మోడల్స్ ద్వారా మహువా ఉత్పత్తులను జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు తీసుకెళ్లే అవకాశాలను వివరించారు. సమావేశంలో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, గిరిజన ఎమ్మెల్యేలు రామచంద్ర నాయక్, మురళి నాయక్‌తోపాటు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి బి.ఎల్.సంతోష్, భద్రాచలం పీవో రాహుల్, ఉట్నూర్ పీవో మంద మకరందు, ఏటూరునాగారం పీవో లెనిన్ వత్సాల్ టొప్పో, పలువురు ప్రముఖ ప్రొఫెసర్లు, నిపుణులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *