– సీఎస్ రామకృష్ణారావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 15 : రాష్ట్రంలో సహకార ఉద్యమం బలంగా ఉందని, సమగ్ర ఆర్థిక అభివృద్ధికి విశేషంగా దోహదపడే సామర్థ్యం గలదని ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు పేర్కొన్నారు. గ్రామీణ స్థాయిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎస్)లను మరింత బలోపేతం చేసేందుకు రాఫ్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఆశిష్ కుమార్ బుటాని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుతో కలిసి సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర సహకార అభివృద్ధి కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు. సమావేశంలో కేంద్ర సహకార శాఖ, రాష్ట్ర ప్రభుత్వ వివిధ శాఖల సీనియర్ అధికారులు పాల్గొని రాష్ట్రవ్యాప్తంగా సహకార రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పాడి పరిశ్రమ, మత్స్య రంగాల్లో సహకార వ్యవస్థ విస్తరణకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, ఆదాయ అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని సీఎస్ అన్నారు. సహకార సంస్థలను మరింత పోటీ సామర్థ్యంతో, స్థిరత్వంతో ముందుకు తీసుకెళ్లేందుకు సామర్థ్య వృద్ధి, ఆధునిక సాంకేతికత వినియోగంపై అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించడంలో, గ్రామీణ స్థాయిలో ఆర్థిక సాధికారత కల్పించడంలో సహకార రంగం కీలక పాత్ర పోషిస్తోందని ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. మెరుగైన పాలన, డిజిటల్ సమీకరణ, మెరుగైన ఆర్థిక నిర్వహణ, సామర్థ్యం వృద్ధి ద్వారా సహకార సంఘాలను బలోపేతం చేయాల్సిన ముఖ్య రంగాలను గుర్తించాలని ఆదేశించారు. వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ సహకార రంగంపై సమగ్రంగా వివరించారు. గ్రామీణ సామాజిక-ఆర్థిక అభివృద్ధిలో సహకార సంస్థలు పోషిస్తున్న కీలక పాత్రను తెలియజేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 60,925 సహకార సంఘాలు పనిచేస్తున్నాయని, ఇది సహకార ఉద్యమం బలాన్ని ప్రతిబింబిస్తోందని తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కంప్యూటరీకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అనుసరణలో ఉందని, పారదర్శకత, సామర్థ్యం, సేవల అందజేతను మెరుగుపరచడమే దీని లక్ష్యమని చెప్పారు. గ్రామీణ ఆర్థిక కార్యకలాపాలను విస్తరించి బలోపేతం చేసే క్రమంలో తెలంగాణ కోఆపరేటివ్ యూనియన్ 311 పీఏసీఎస్‌లను రైతు ఉత్పత్తిదారుల సంస్థ(ఎఫ్‌పీవో)లుగా అభివృద్ధి చేస్తోందని, దీని ద్వారా రైతులకు మార్కెట్ల ద్వారా మెరుగైన విలువ ఆధారిత సేవలు లభిస్తాయని వివరించారు. సహకార రంగ అభివృద్ధి, ఆధునీకరణకు రాష్ట్ర సహకార విధానాన్ని ప్రభుత్వం రూపొందిస్తున్నదని కార్యదర్శి తెలిపారు. ప్రతిపాదిత విధానం ద్వారా వృత్తిపరమైన నిర్వహణ, ఆర్థిక స్థిరత్వం, డిజిటల్ రూపాంతరం, అభివృద్ధి చెందుతున్న రంగాల్లో సహకార కార్యకలాపాల విస్తరణకు ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు. కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సిద్ధార్థ్ జైన్, పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, పశు సంవర్ధక శాఖ కార్యదర్శి ఇలంబర్తి తదితర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
హై స్పీడ్ రైల్‌తో ఎకనామిక్ గ్రోత్ కారిడార్‌గా అభివృద్ధి
హైదరాబాద్ నుండి ముంబై, చెన్నై, బెంగళూరు ప్రధాన నగరాలను అనుసంధానించే హై స్పీడ్ రైల్ ప్రాజెక్టు వల్ల తెలంగాణ రైజింగ్-2047 ఎకనామిక్ గ్రోత్ కారిడార్‌గా అభివృద్ధి చెందే అవకాశం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు పేర్కొన్నారు. హైదరాబాద్ కేంద్రంగా ప్రతిపాదిత హైస్పీడ్ రైలు కారిడార్ ప్రాజెక్టులపై డాక్టర్ బి.ఆర్.అంబేడŠ్కర్ సచివాలయంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ఆయన శుక్రవారం సమీక్షించారు. తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర రైల్వే శాఖ భాగస్వామ్యంతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు రిపోర్టులు, ప్రాజెక్టు అమలులో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ, కనెక్టివిటీ, మౌలిక వసతుల అభివృద్ధి, ఇతర అంశాలపై తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. దేశంలో వేగవంతమైన రవాణా వ్యవస్థకు హై స్పీడ్ రైలు ప్రాజెక్టు నిలుస్తుందని, ప్రజల భవిష్యత్ అవసరాలకు, పారిశ్రామిక, ఐటి, పర్యాటక రంగాలలో అభివృద్ధికి ఈ ప్రాజెక్టు ఉపకరిస్తుందని సీఎస్ తెలిపారు. హైదరాబాద్-పూనే-ముంబై హై స్పీడ్ రైల్ మార్గానికి సంబంధించి డీపీఆర్ సిద్ధం అయ్యిందని రైల్వే అధికారులు తెలిపారు. సూమారు 671 కి.మీ మార్గానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని, తెలంగాణలో 93 కి.మీ మేరకు భూ సేకరణ అవసరం ఉంటుందని, అదేవిధంగా హైదరాబాద్-బెంగళూరు కారిడార్, హైదరాబాద్-చెన్నై కారిడార్‌లో సూమారు 123 కి.మీ నిడివిలో భూసేకరణ అవసరమని, కోకాపేట, శంషాబాద్ ప్రాంతాలల్లో రైల్వే డిపోలకు కొంత భూసేకరణ చేయాలని అధికారులు పేర్కొన్నారు. వీటికి సంబంధించి రోడ్లు, భవనాల శాఖ, హెచఎండీఏ, జీఎంఆర్ ఎయిర్‌పోర్టు అధికారులు కేంద్ర రైల్వే ప్రాజెక్టు అధికారులతో సమన్వయం చేసుకొని హై స్పీడ్ రైలు ప్రాజెక్టుకు సహకరించాలని సీఎస్ అన్నారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు వికాస్ రాజ్, నవీన్ మిట్టల్, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, కేంద్ర రైల్వే శాఖ అధికారులు, జీఎంఆర్ ఎయిర్‌పోర్టు అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



