ఆ ఆరుగురు ఎవరు..?

మంత్రివర్గ విస్తరణపై వీడని ఉత్కంఠ
నాన్చుతున్న కేంద్రం ఆశ‌ల పల్ల‌కీలో సీనియ‌ర్లు

( మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) కాంగ్రెస్‌ అధికారం చేపట్టి దాదాపు పదినెలలు కావొస్తున్నా, ఇంకా పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోలేకపోతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసేప్పుడు తనతో కలిపి పదొండు మంది మంత్రులకు కేబినెట్‌లో అవకాశం లభించింది. దీంతో ఒక్కో మంత్రికి మూడు, నాలుగు శాఖలు చూసుకోవాల్సి వొస్తున్నది. కీల‌క‌మైన‌ హోంశాఖ, విద్యాశాఖలకు ప్రత్యేక మంత్రులు లేకపోవడంతో త్వరితగతిన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నట్లు వార్తలు వొస్తున్నాయి. అంతేగాక ముఖ్యమంత్రి వద్దే పలు శాఖలు ఉండడంతో ఆయన అన్ని రంగాల పైన దృష్టి పెట్టడం ఇబ్బందికరంగానే ఉంది. దీంతో త్వరలో క్యాబినెట్‌ను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో ఇప్పటికే పలు దఫాలుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిల్లీ  వెళ్లి పెద్దలను కలిసివొస్తున్నప్పటికీ, మంత్రి వర్గ‌ విస్తరణకు అధిష్ఠానం ఇంకా పూర్తిస్థాయిలో గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లులేదు. ఇంతకాలం మంత్రివర్గ విస్తరణకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికకు ముడిపడింది . పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పార్టీలోని చాలామంది సీనియర్లు ఉత్సాహపడ్డారు. తమ గాడ్‌ ఫాదర్స్‌తో దిల్లీ  స్థాయిలో సిఫారసు చేయించుకున్నారు. అయినా తనకు అనుకూలమైన వ్యక్తి మహేష్‌కుమార్‌ గౌడ్‌కు ఆ పదవిని ఇప్పించుకోవడంలో సిఎం రేవంత్‌రెడ్డి సక్సెస్‌ అయ్యారనుకుంటున్నారు.

పాలనలో ఎలాంటి అవరోధాలు రాకుండా ఉండాలంటే తనకు అనుకూలమైన వారే ఆ పదవిలో ఉండాలన్న రేవంత్‌రెడ్డి లక్ష్యం నెరవేరింది. అలాగే మంత్రివర్గ విస్తరణ విషయంలో కూడా ఆయన ఆచీతూచీ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం రాష్ట్రంలో మంత్రుల సంఖ్య ముఖ్యమంత్రితో కలిపి 17 కు మించి ఉండేందుకు వీలులేదు. ప్రస్తుతం ముఖ్యమంత్రితో కలిసి పదకొండు మందితో రాష్ట్ర క్యాబినెట్‌ కొనసాగుతున్నది. అంటే ఇంకా ఆరుగురిని మంత్రులుగా తీసుకునే అవకాశముంది. ఈ ఆరుగురి విషయంలోనే చాలాకాలంగా తర్జనబర్జన జరుగుతున్నది.

ఒక విధంగా మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో అధికులు సీనియర్లే కావడంతో ఎవరిని కాదనలేని పరిస్థితి. అయినా పోటీ తీవ్రతరంగా ఉంది. కాబోయే మంత్రుల జాబితాను పట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు ఒకరిద్దరు ఇతర మంత్రులు దిల్లీ , హైదరాబాద్‌ చుట్టూ ఇంకా చక్కర్లు కొడుతూ ఉంటే, తమకు ఈసారి ఎట్టి పరిస్థితిలో అవకాశం లభిస్తుందన్న ఆశతో పలువురు ఎమ్మెల్యే , ఎమ్మెల్సీలు కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. రేవంత్‌రెడ్డి దిల్లీకి  మోసుకుపోతున్న జాబితాలో ఎందరున్నారో గాని, రాష్ట్రంలో ఈ పదవులు ఆశిస్తున్నవారి సంఖ్య మాత్రం దాదాపు ఇరవై వరకు ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నవారు కాకుండా, ఇతర జిల్లాలకు చెందిన నాయకులు ఎక్కువగా ఆశపెట్టుకున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తోపాటు నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, కరీంనగర్‌ జిల్లాల నుంచి పలువురు ఎమ్మెల్యేలు  ఈ పదవులు ఆశిస్తున్నవారిలో ఉన్నారు.

ప్రస్తుత క్యాబినెట్‌లో ఏడుగురు ఓసి మంత్రులు, ఇద్దరేసి బిసీ, ఎస్సీ, ఒక ఎస్టీ మంత్రులున్నారు. తాజాగా ఎంచుకున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసీ వర్గానికి చెందినవాడు. కాగా, ఇప్పుడు మంత్రివర్గంలోకి తీసుకునేప్పుడు ఈ సామాజికవర్గాలను దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేసుకోవాల్సి ఉంది. ఆ విషయంలోనే గత కొంతకాలంగా తీవ్ర కసరత్తు జరుగుతున్నది. ఇప్పటికే దూకుడు మీద ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి, పాలనను మరింత దూకుడుగా ముందుకు తీసుకుపోయేందుకు తనకు సహకరించే వ్యక్తులకు మంత్రి పదవులు కట్టబెట్టాలనుకుంటున్నట్లు స‌మాచారం. ప్రస్తుతం వివిధ కారణాలతో వాయిదా పడుతున్న పంచాయతీ ఎన్నికల్లో పార్టీని అగ్రభాగాన నిలబెట్టే వ్యక్తులను దృష్టిలోపెట్టుకుని ఎంచుకునే పనిలో రేవంత్‌రెడ్డి ఉన్నట్లు తెలుస్తుస్తోంది. మంత్రి వర్గ విస్తర్ణలో చోటు లభిస్తుందని ఆశిస్తున్నవారిలో ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, దానం నాగేందర్‌ ముందు వరుసలో కనిపిస్తున్నారు.

రాజగోపాల్‌రెడ్డికి దీటుగా అదే నల్లగొండ నుంచి బాలూనాయక్‌ కూడా తీవ్ర ప్రయత్నాలు చేసుకుంటున్నారు. దానం నాగేందర్‌కు రాని పక్షంలో మైనార్టీ అయిన అమీన్‌ అలీఖాన్‌కు మంత్రిపదవి వొచ్చే అవకాశముంటుందనుకుంటున్నారు.  ఆదిలాబాద్‌ విషయానికొస్తే ఇద్దరు అన్నదమ్ములు  జి. వివేక్‌, జి. వినోద్‌లిద్దరూ చాలా కాలంగా మంత్రి పదవులను ఆశిస్తున్నవారిలో ఉన్నారు. వారికి తోడుగా కె.ప్రేమ్‌సాగర్‌రావు కూడా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. రంగారెడ్డి విషయానికొస్తే మల్‌రెడ్డి రంగారెడ్డి, టి. మోహన్‌రెడ్డి ఆశిస్తున్నవారిలో ఉన్నారు. ఇకపోతే నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌లనుంచి పి. సుదర్శన్‌రెడ్డి పేరు మొదటి నుంచి వినిపిస్తుండగా, మిగతా జిల్లాల నుంచి వాకిటి శ్రీహరి, టి. జీవన్‌రెడ్డి పేర్లు కూడా వినవొస్తున్నాయి. వీరితోపాటు మరికొందరు ఎమ్మెల్సీ , ఎమ్మెల్యే ల పేరుకూడా చక్కర్లు కొడుతున్నాయి. మంత్రి పదవులకు పోటీ తీవ్రతరం కావడంతో చీప్‌విప్‌, విప్‌ పదవులతోపాటు పలు చైర్మన్  పదవులతో వారిని సంతృప్తిపర్చే ఆలోచనలో అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *