- మండిపపడిన బిఆర్‌ఎస్ నేత కెటిఆర్
- ఎమ్మెల్యేలతో కలిసి అంబర్‌పేటలో పర్యటన
- బాధితులకు భరోసా ఇచ్చిన బిఆర్‌ఎస్ నేతలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 1: మూసీ ప్రక్షాళన పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న సర్వే, కూల్చివేతలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్‌లో లక్షలాది మందికి నిద్రలేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడు తమ ఇండ్లు కూల్చుతారోనని ప్రజలు ఆవేదనలో ఉన్నారని చెప్పారు. అంబర్‌పేట నియోజకవర్గంలోని గోల్నాక పరిధి తులసీరామ్ నగర్‌లో మూసీ ప్రాంత వాసులను మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, సుధీర్ రెడ్డితో కలిసి కేటీఆర్ పరామర్శించారు.
అనంతరం మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌కు వోట్లు వేసిన వారిపై సీఎం పగబట్టారన్నారు. గరీబోళ్లంతా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్నరని, వాళ్ల బతుకులను ఆగం చేయాలని చూస్తున్నాడని విమర్శించారు. మూసీమే లూఠో.. దిల్లీ మే బాంటో అనేది కాంగ్రెస్ నినాదమని విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్‌లో సగం డబ్బులతో మూసీ ప్రక్షాళన చేపట్టారని ఆరోపించారు. మూసీ పరీవాహక ప్రాంతవాసులను అడవిలోకి పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇండ్లు కడతామంటూ కూల్చుతున్నారని చెప్పారు.
పేదల ఇళ్లు కూల్చుతుంటే ఈ ప్రాంత ఎంపీ ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. కిషన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి ఇద్దరూ కూడపలుక్కున్నారా? అని ప్రశ్నించారు. పేదలకు కష్టం వొస్తే అండగా ఉండేవాడే దేవుడని అన్నారు. రేవంత్ రెడ్డి నీవు మొగోడివైతే నీవు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ బ్రోకర్లు విడగెట్టే ప్రయత్నం చేస్తారని, మన హక్కులను లాక్కునే హక్కు ఎవరికీ లేదన్నారు. కోసం బీఆర్‌ఎస్ తరఫున కోర్టులో కొట్లాడుతామని భరోసానిచ్చారు.