మూసీ ఇళ్ల కూల్చివేతలు మొదలు

ఖాలీ చేసిన వారి ఇళ్ల కూల్చివేత
పోలీస్‌ ‌బందోబస్తు మధ్య కొనసాగుతున్న పనులు
డబుల్‌ ఇళ్లకు నిర్వాసితుల‌ తరలింపు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 1: ‌మూసీ పరీవాహక ప్రాంతాల్లో కూల్చివేతలు మొదలయ్యాయి. చాదర్‌ఘాట్‌ ‌శంకర్‌ ‌నగర్‌ ‌బస్తీలో కూల్చివేతలను మంగళవారం ఉదయం అధికారులు ప్రారంభించారు. ఇళ్లు ఖాలీ చేసిన వాటిని అధికారులు కూల్చివేస్తున్నారు. ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా పోలీసులను భారీగా మోహరించారు. దాదాపు 140 ఇళ్లు ఖాలీ అయ్యాయి. ఇళ్లు ఖాలీ చేసిన వారికి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇళ్లను కేటాయించినట్లు సమాచారం. ఈ క్రమంలో మలక్‌పేట పరిధిలోని శంకర్‌నగర్‌లో మూసీ రివర్‌బెడ్‌లోని ఇళ్ల కూల్చివేతలను అధికారులు చేపట్టారు.

ఇక్కడ స్వచ్ఛందంగా ఖాలీ చేసిన నిర్వాసితుల ఇళ్లను కూల్చివేస్తున్నారు. వీధులు ఇరుకుగా ఉండడంతో కూలీల సాయంతో కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. నిర్వాసితులను రెండు పడక గదుల ఇళ్లకు తరలిస్తున్నారు. నిర్వాసితుల సామగ్రి తరలింపునకు వాహనాలను ఏర్పాటు చేశారు. మరోవైపు అంబర్‌పేట్‌ ‌నియోజకవర్గం కాగా.. మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌ను తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే.

హైదరాబాద్‌ను వరదల నుంచి రక్షించేందుకు, ఆక్రమణకు గురైన మూసీ నది పరీవాహక ప్రాంతాలను పునరుద్ధరించి, కాలుష్య కోరల నుంచి మూసీని కాపాడేందుకు ప్రభుత్వం మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. అధికారులు ముందుగా మూసీ నది ఎఫ్‌టీఎల్‌ ‌పరిధిని సర్వే చేశారు. అందులో దాదాపు 16 వేల నివాసాలు ఎఫ్‌టీఎల్‌ ‌పరిధిలో ఉన్నట్లు తేలింది. అందులో పేద, మధ్యతరగతి వారు నివసిస్తున్నారు. దీంతో ప్రభుత్వం.. మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌లో భాగంగా ఎఫ్‌టీఎల్‌ ‌పరిధిలో నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్న పేదలకు ఉచితంగా డబుల్‌ ‌బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించింది. అందుకోసం ఇప్పటికే జీ.ఓ. కూడా జారీ చేసింది.

అయితే డబుల్‌ ‌బెడ్రూమ్‌లు ఎవరికి ఇవ్వాలనే దానిపై తాజాగా రెవెన్యూ అధికారులు సర్వే చేసి.. గుర్తించి ఇళ్లపై గుర్తులు వేశారు. కాగా… ఇటీవల మూసీ నది పరీవాహక ప్రాంతాల్లో అధికారులు పర్యటించి ఎఫ్‌టీఎల్‌ ‌పరిధిలోకి వొచ్చే ఇళ్లను గుర్తించి వాటిపై పెద్ద అక్షరాలతో పెయింట్‌ ‌వేసిన విషయం తెలిసిందే. అయితే తమ ఇళ్లను కూల్చి వేస్తారంటూ ఆందోళన చెందిన స్థానిక ప్రజలను అధికారులపై తిరగబడ్డారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అయితే డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ పలువురు స్థానికులు ఆందోళనకు దిగారు. మూసీ రివర్‌ ‌బెడ్‌లో ఉన్న ఇళ్లు, వాటి యాజమానుల వివరాలు నమోదు చేసేందుకు వచ్చిన అధికారులను పలు ప్రాంతాల్లో నివాసితులు అడ్డుకున్నారు. చివరకు భారీ పోలీసులు భద్రత నడుమ రెవెన్యూ అధికారులు ఇళ్లపై మార్క్ ‌వేశారు. ప్రస్తుతం మరికొన్ని ప్రాంతాల్లో కూడా మార్క్ ‌సర్వే ను అధికారులు కొనసాగిస్తున్నారు. పోలీసు భద్రత మధ్యే ఈ సర్వే సాగుతోంది. కూల్చివేయాల్సిన ఇళ్లకు అధికారులు మార్క్ ‌వేస్తున్నారు. అక్కడి ప్రజలు ఇళ్లు ఖాలీ చేసిన వెంటనే అధికారులు ఆ ఇళ్లను కూల్చివేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page