– ఏర్పాట్లపై మంత్రులు సురేఖ, శ్రీధర్‌బాబు, సీఎస్ సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16: కాళేశ్వరంలో ఈనెల 21వ తేదీన ప్రారంభం కానున్న సరస్వతీ అంత్య పుష్కరాలకు దాదాపు 40 లక్షలమంది భక్తులు హాజరవుతారని అంచనా వేసినందున అందుకు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి కొండా కొండా సురేఖ, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబులు తెలిపారు. అంత్య పుష్కరాల ఏర్పాట్లపై సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఆధ్వర్యంలో శనివారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ 21వ తేదీ ఉదయం 5.43 గంటలకు కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి పుణ్య స్నానం ఆచరించి అంత్య పుష్కరాలను ప్రారంభిస్తారని వెల్లడించారు. ఈసారి 30 నుండి 40 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో తగు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కాళేశ్వరం ఆలయంలో దర్శనాలు, పుష్కర స్నానాలకు వచ్చే వివిధ పీఠాధిపతులకు తగు ఏర్పాట్లు, ఘాట్‌ల వద్ద పారిశుధ్య నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. మంత్రి సురేఖ మాట్లాడుతూ మేడారం జాతర స్పూర్తితో సరస్వతీ అంత్య పుష్కరాలను విజయవంతంగా నిర్వహించాలన్నారు. అంత్య పుష్కరాల అనుభవాలు రానున్న గోదావరి పుష్కరాలకు ఉపయోగపడతాయన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ అంత్య పుష్కరాలకు అధిక సంఖ్యలో యాత్రికులు హాజరయ్యే అవకాశముందని, శానిటేషన్, ట్రాఫిక్, ప్రొటోకాల్, రవాణా, తాగునీటి సౌకర్యం తదితర ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ మాట్లాడుతూ 2012లో జరిగిన సరస్వతీ పుష్కరాలకు రెండు లక్షల మంది మాత్రమే హాజరవగా గత ఏడాది ఆది పుష్కరాలకు దాదాపు 40 లక్షల మంది హాజరయ్యారని వెల్లడించారు. అంత్య పుష్కరాలలో రోజూ హోమాలు, ఘాట్ వద్ద హారతి, సాంసృతిక కార్యక్రమాలు, తెప్పోత్సవంతోపాటు పిండ ప్రదానాలు జరుగుతాయని తెలిపారు. మొదటి రోజు గవర్నర్ కూడా పుణ్య స్నానాలకు హాజరవుతారన్నారు. ఈసారి మ్యూజియం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు మాట్లాడుతూ అతిథి గృహాలు, వంద గదుల సత్రం, ఘాట్ వద్ద టెంట్ హౌస్‌ల ఏర్పాటు, ప్రముఖులకు ఆహ్వానాలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ ఏర్పాటు, నిరంతర విద్యుత్ సరఫరా ఏర్పాట్లకు రెవెన్యూ శాఖ సమన్వయంతో చేపడుతున్నామ న్నారు. సమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, జెన్‌కో ఎండీ హరీష్, భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి, భూపాలపల్లి ఎస్పీ, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, మహిళా, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ ముకుంద్ రెడ్డి, ఐ.జి. చంద్రశేఖర్ రెడ్డి తదితరులు కూడా హాజరయ్యారు.
——————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




