- ఈనెల చివరినాటికి ప్రతీ నియోజకవర్గానికి 4 వేల ఇళ్లు
- కాళ్లలో కట్టెలు పెట్టినా అభివృద్ది సంక్షేమం ఆగదు
- మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19 : ఈనెల చివరి నాటికి రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గానికి తొలివిడతగా 3,500 నుంచి 4 వేల ఇళ్లను మంజూరు చేయబోతున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. వొచ్చే నాలుగేళ్లలో రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. వొచ్చే నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లకు తగ్గకుండా నిర్మిస్తామని తెలిపారు. కులమతాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పారు. ఎలాంటి భేషజాలకు పోకుండా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన వాటా, నిధులు అడిగి తీసుకుంటామని, పెద్ద ఎత్తున రాష్ట్రానికి ఇండ్లను మంజూరు చేయాలని హైదరాబాద్‌కు వొచ్చిన కేంద్ర హౌసింగ్ జాయింట్ సెక్రటరీని కోరామని తెలిపారు. గత ప్రభుత్వం పేదల గురించి కనీస ఆలోచన చేయలేదని విమర్శించారు. గోషామహల్ నియోజకవర్గానికి చెందిన 144 మంది లబ్దిదారులకు శనివారం హైదరాబాద్ కలెక్టరేట్ లో హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఎన్ని ఆర్ధిక ఇబ్బందుల ఎదురైనా ప్రతిపక్షాలు కాళ్లల్లో కట్టెలు పెడుతూ అభివృద్ది సంక్షేమాన్ని అడ్డుకోవాలని యత్నించినా ఏదీ ఆగదని స్పష్టం చేశారు. పేదవాడి కన్నీరు తుడవడమే ఈ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రధాన ప్రతిపక్షం బిఆర్ఎస్ కాకి గోలతో తమ ప్రభుత్వానికి వొచ్చే నష్టమేమీ లేదని, ఏడాది కూడా పూర్తికాకముందే తమ ప్రభుత్వంపై రోడ్డు ఎక్కడం వల్ల బిఆర్ఎస్ కే నష్టమన్నారు. పదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేయలేనిది, తమ ప్రభుత్వం చేసి చూపిస్తుంటే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయని విమర్శించారు. మూసీ పరీవాహక ప్రాంత ప్రజలకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలని తమ ప్రభుత్వం వారికి ఇండ్లు, ఉద్యోగం, ఉపాధి, కల్పిస్తే బిఆర్ఎస్ ఓర్చుకోలేక పోతోందని ఆరోపించారు. ప్రభుత్వం ఏదో తప్పు చేస్తున్నట్లుగా గోబెల్ ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజల జీవనోపాధి కోసం వారి జీవితాలను మెరుగుపరచడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందన్నారు. మూసీ ప్రాంతాల ప్రజలు తమ జీవితాంతం అదే మురికికుప్పలో బతకాలని బిఆర్ఎస్ కోరుకుంటుందా అని మంత్రి ప్రశ్నించారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా ఇబ్బంది పెట్టే కుట్ర జరుగుతోందన్నారు. మూసీ ప్రక్షాళనపై అనేక అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించి మెప్మా ద్వారా వారికి ఉపాధి అవకాశాలు, పిల్లలకు చదువులు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుంటే ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పు చేసి 40 వేల కోట్ల బిల్లులు పెండింగ్ బకాయిలు పెట్టారన్నారు. మీరు బాధ్యత గల ప్రతిపక్షమైతే నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని, కాంగ్రెస్ పార్టీకి పరిపాలన ఎలా చేయాలో ప్రతిపక్షాలకు ఎలా గౌరవం ఇవ్వాలో తెలుసని మంత్ర పొన్నం అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాజా సింగ్, శ్రీగణేష్ ఎమ్మెల్సీలు బలమూరి వెంకట్, రహమత్ బేగ్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురషెట్టి తదితరులు పాల్గొన్నారు.