– నాగార్జున సాగర్ పై ఏపీ అక్రమ ప్రాజెక్టును వారం రోజుల్లో నిలిపివేయించాలి
– లేదంటే సాగర్ డ్యామ్ ను ముట్టడిస్తాం
– తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 21 : సీఎం రేవంత్ రెడ్డి తీరుతోనే ఏపీ జలదోపిడీకి పాల్పడుతోందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఈమేరకు శనివారం వీడియో సందేశం విడుదల చేశారు. ఏపీ సీఎం చంద్రబాబును పిలిచి ప్రజాభవన్ లో కాళ్లు కడిగి గురుదక్షిణగా మన నీళ్లను అప్పగించారని తెలిపారు. రేవంత్ రెడ్డి ఆమోదంతోనే చంద్రబాబు పోలవరం – బనకచర్ల లింక్ ప్రాజెక్టును చేపట్టారని తెలిపారు. రేవంత్ రెడ్డి అన్ని రకాల ప్రొటోకాల్స్ ను విస్మరించి పని చేస్తున్నారని, ఫలితంగా రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. జలవివాదాలపై అపెక్స్ కౌన్సిల్ సమావేశం కోసం డిమాండ్ చేయకుండా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో అనధికార సమావేశానికి వెళ్లి పోలవరం- బనకచర్లకు ఒప్పుకొని వచ్చారని తెలిపారు. రేవంత్ రెడ్డి అడ్డుకోలేడనే ధైర్యంతోనే ఏపీ ప్రభుత్వం తాగు నీటి పేరుతో నాగార్జున సాగర్ నీళ్లకు గండికొడుతోందన్నారు. తాగునీరు పేరుతో శ్రీశైలం ప్రాజెక్టుపై పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నిర్మించి ఇప్పుడు మొత్తం రిజర్వాయర్ నే మళ్లించుకునే స్థాయిలో పనులు చేసుకున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు నాగార్జున సాగర్ పై ఏపీ కన్ను పడిందని, ఇప్పటికే తాగునీటి కోసం 2.8 టీఎంసీలను తీసుకుంటున్న ఏపీ లిఫ్ట్ పేరుతో మరో 1.8 టీఎంసీలను తరలించేందుకు రంగం సిద్ధం చేసిందని అన్నారు. ఏపీ ప్రభుత్వం తొమ్మిది నెలలుగా అక్రమ ప్రాజెక్టు నిర్మిస్తుంటే తెలంగాణ ప్రభుత్వానికి కనీస సమాచారం లేదనే వాదనను ఎలా నమ్మాలని ప్రశ్నించారు. ఎక్కడ ఏం జరిగినా ఇంటెలిజెన్స్ ముఖ్యమంత్రిని అలర్ట్ చేస్తుందని, దురదృష్టవశాత్తు రాష్ట్ర హోం శాఖ బాధ్యతలు కూడా చూస్తున్న రేవంత్ రెడ్డికి ఏపీ అక్రమ ప్రాజెక్టు గురించి తెలియకపోవడం సందేహాలకు తావిస్తోందని అన్నారు. నిజంగానే సమాచారం తెలియదా? తెలిసినా తన సమ్మతితోనే ప్రాజెక్టు చేపట్టింది కాబట్టి మౌనంగా ఉన్నారా అనే విషయంలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీకి తెలంగాణ ఓట్లు.. సీట్లు కావాలి తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా అని ప్రశ్నించారు. అన్ని అంశాలపై స్పందించే ఎంపీ రఘునందన్ రావు, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఏపీ అక్రమ ప్రాజెక్టుపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు వెంటనే ప్రధాని వద్దకు వెళ్లి ఏపీ అక్రమ ప్రాజెక్టును నిలిపివేయించాలని, ఆ ప్రాజెక్టుకు కేంద్రం 50 శాతం నిధులు జల్ జీవన్ మిషన్ నుంచి ఇవ్వకుండా అడ్డుకోవాలని సూచించారు. వారం రోజుల్లో ఈ ప్రాజెక్టును నిలిపి వేయించకుంటే వేలాదిమంది ప్రజలతో నాగార్జున సాగర్ డ్యాంను ముట్టడిస్తామని, అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





