విద్యా, వైద్య రంగాల్లో చర్యలపై దృష్టి సారించాలి!
ఎన్నికల్లో వాగ్దానాలు చేయడం ఎంత సులువో..వాటిని అమలు చేయడం అంత కష్టం అని సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది. రైతురుణమాఫీపై ఎంతగా విమర్శలు వస్తున్నాయో చెప్పలేం. దానిని సమర్థంగా తిప్పి కొట్టలేక పోతున్నారు. ఇకపోతే దుబారా ఖర్చులు తగ్గించుకుని అభివృద్దికి బాటలు వేయాలి. పేదల జోలికి వెళ్లకుండా చూసుకోవాలి. హైడ్రాను కేవలం ఉన్నత వర్గాల ఆక్రమణలకే పరిమితం చేయాలి. పేదలకు ప్రత్యామ్నాయం చూపి ముందుకు సాగాలి. అలాగే తొలుత అభివృద్ది పనులకు పెద్దపీట వేయాలి. రుణాల జోలికి వెళ్లకుండా, ప్రజలపై భారం మోపకుండా, గుదిబండ గా ఉన్న పథకాలను ముందు పక్కన పెట్టే ప్రయత్నం చేయాలి. విద్యా, వైద్య రంగాల్లో చర్యలను ఆహ్వానించాల్సిందే. అయితే నేటికీ వైద్యరంగం వెక్కిరిస్తోంది. ప్రైవేట్ వైద్యానికే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. అందువల్ల క్షేత్రస్థాయిలో దీనిని ప్రథమంగా సంస్కరించాలి. ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేయాలి. ఆస్పత్రులను బలోపేతం చేయాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్య రంగం బలోపేతం అవుతుంది. ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లేలా చేయాలి.అప్పుడే ప్రభుత్వంపై భారం తగ్గగలదు. తెలంగాణలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. గత ప్రభుత్వం 14లక్షల కోట్లు అప్పుల్లో ఉంచిందని ప్రభుత్వమే ఆరోపిస్తోంది. ఈ క్రమంలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన సిఎం రేవంత్ రెడ్డికి ఎన్నికల హావిరీలను అమలు చేయడం అంత సులభం కాదు.
ఎందుకంటే ఖజానా నిండుకుని ఉంటే ఇది పెద్ద సమస్య అయ్యేది కాదు. కొన్ని గ్యారెంటీ లను అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందున్నది ముసళ్ల పండగే అని చెప్పుకోవాలి. పదేళ్ల దరిద్రపు వారసత్వాన్ని అందించిన బిఆర్‌ఎస్ ఇప్పుడు తమ హయాంలో ఉన్న సమస్యలపైనే నిలదీయడం సిగ్గుచేటు. స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లు, ఆస్పత్రులల్లో సమస్యలు ఈనాటివి కాదు. ఇవన్నీ మరని బిఆర్‌ఎస్ నేతలు అప్పుడే డిమాండ్లు మొదలు పెట్టారు. ప్రధానంగా రైతుబంధుతో పాటు ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఇచ్చిన మాట ప్రకారం రైతుబంధు ఎప్పట్నుంచి ఇస్తారో అసలుసిసలు రైతులకు స్పష్టత ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతుబంధును ఎకరాకు రూ.15వేలు ఇస్తామని చెప్పారు. చిన్న,సన్నకారు రైతుల వివరాలను సేకరించి వారికే పట్టం కట్టాలి. అలాగే ఇలాంటి ఉదార పథకాలకు పాతర వేయాలి. రూపాయి కిలో బియ్యం పక్కన పెట్టాలి. హైడ్రా కారణంగా వస్తున్న విమర్శలను సమర్థంగా ఎదుర్కోవాలి. ఇదంతా ఒక ఎత్తయితే.. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక స్థితిని చక్కదిద్దుకుంటూనే.. పార్టీని సమన్వయం చేసుకుంటూ సాగాల్సిన అవసరం సిఎం రేవంత్ ముందుంది. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి పూర్తి అండగా ఉన్నప్పటికీ శాసనసభ్యులను విశ్వాసంలోకి తీసుకుని కదలాల్సి ఉంటుంది. గెలిచినా అధికారం కోల్పోయామన్న విపక్షంలో ఉన్న ఎమ్మెల్యేల బాధ మరో వైపు ఉన్న ప్రస్తుత తరుణంలో ఇప్పుడంతా ఎవరు ఎటువైపు దూకుతారన్న చర్చ తెలంగాణలో ప్రధాన అంశంగా ఉంది. గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన పలువురు బిఆర్‌ఎస్‌లో చేరారు. వారంతా ఇప్పుడు మళ్లీ ఎమ్మెల్యేలుగా గెలిచి విపక్షంలో ఉన్నారు.
ఎందుకంటే పార్టీ మారడం ఎంత సులువో గతంలో బిఆర్‌ఎస్ దారిచూపింది. అందుకే కాంగ్రెస్ ముందు జాగ్రత్తగా కొందరు ఎమ్మెల్యేలను చేర్చుకునే ప్రయత్నాలు చేసింది. అయితే మిగతా వారు అంతా కట్టగట్టుకుని వస్తారని భావించారు. కానీ అలాంటి అవకాశం లేకుండా బిఆర్‌ఎస్ జాగ్రత్తలు తీసుకుంది. ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసింది. కాంగ్రెస్ పార్టీలో అధిష్ఠానం మాటే శిరోధార్యం. అటు వారిని మెప్పించాలి. అధిష్టానానికి అందే ఫిర్యాదులకు సమాధానం ఇవ్వాలి. అలాగే ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ఇవన్నీ కనిపెట్టుకుని రేవంత్ రెడ్డి ముందుకు సాగాలి. అప్పుడే సమర్థుడ్కెన నేతగా సాగుతారు. ప్రజాదర్బార్ నిర్వహించడం, విద్యుత్ శాఖ పనితీరును సవిరీక్షించడం, చకచకా నిర్ణయాలు తీసుకోవడం వంటి చర్యల ద్వారా రేవంత్ రెడ్డి ప్రస్తుతానికి దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డికి తన పదవిని సుస్థిరం చేసుకోవడంతో పాటు హావిరీలు అమలు చేయడం ద్వారా ఎదురులేని నేతగా ఎదగడానికి కృషి చేయాలి. తక్కువ సమయంలో ఇచ్చిన హావిరీలను చకచకా అమలు చేయగలగాలి. తానేమిటో నిరూపించుకుని ప్రజలతో మంచి అనిపించుకోవాలి. కేసీఆర్‌ను మించిన నేతగా పేరు తెచ్చుకుంటేనే రాజకీయంగా రేవంత్ నిలదొక్కు కోగలడు. అందుకే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూనే.. తాను మరింత బలపడాల్సిన పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఉంది.
-మారుపాక గోవర్ధన్ రెడ్డి