ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కోర్టు సమన్లు

  • వోటుకు నోటు కేసు చిక్కులు
  • 16న హాజరు కావాలంటూ ఈడీ కోర్టు తాఖీదు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డికి వోటుకు నోటు కేసులు చిక్కులు తప్పేలా లేవు. ఈ  కేసులో పెద్ద ఎత్తున అక్రమ నగదు చెలామణి జరిగిందని ఈడీ నమోదు చేసిన కేసులో ఆయనకు సమన్లు జారీ అయ్యాయి.వొచ్చే నెల 16వ తేదీన కోర్టు ఎదుట హాజరుకావాలని రేవంత్‌ ‌రెడ్డి సహా నిందితులందరికీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో విచారణకు నిందితులు అందరూ డుమ్మా కొడుతున్నారు. మంగళవారం జరిగిన వాయిదాకు కేవలం మత్తయ్య మాత్రమే  హాజరయ్యారు. దీంతో కోర్టు నిందితులందరూ విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి వోటు వేయాలని కోరుతూ  టీడీపీలో ఉన్నప్పుడు నామినేటెడ్‌ ఎమ్మెల్సీగా ఉన్న స్టీఫెన్‌సన్‌కు  డబ్బులు ఎర చూపారని తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది.

ఆ కేసులో ఆయన చాలా రోజు పాటు జైలులో ఉండి బెయిల్‌ ‌తెచ్చుకున్నారు. అలా డబ్బులు ఎర చూపిన సమయంలో రూ.యాభై లక్షలు రేవంత్‌ ‌దగ్గర బ్యాగులో ఉన్నాయి.దీంతో నగదు అక్రమ చెలామణి చేశారని ఏసీబీ ఈడీకి కేసు రిఫర్‌ ‌చేసింది.ఈ అంశంపై ఈడీ కూడా కేసు నమోదు చేసింది.ఏసీబీ నోదు చేసిన కేసులో విచారణ జరుగుతోంది.రేవంత్‌ ‌రెడ్డి సీఎం అయినందున ఆ కేసును ఇతర రాష్ట్రాలకు  బదిలీ చేయాలని బీఆర్‌ఎస్‌ ‌నేత జగదీష్‌ ‌రెడ్డి వేసిన పిటిషన్‌ను ఇటీవల సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయితే ఈ కేసు దర్యాప్తు, విచారణ విషయంలో రేవంత్‌ ‌రెడ్డి జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసింది. ఇదే కేసులలో ఈడీ దాఖలు చేసిన కేసులో విచారణ నెమ్మదిగా సాగుతోంది. కోర్టుకు నిందితులు సరిగ్గా హాజరు కావడం లేదు.

ఈ కేసులో మధ్యవర్తిగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కైస్త్రవ మత ప్రచారకర్త జెరూసలేం మత్తయ్య మాత్రం అటు ఏసీబీ కేసులోనూ.. ఇటు ఈడీ కేసులోనూ రెగ్యులర్‌ ‌కోర్టుకు హాజరవుతున్నారు. ఇతరులు ఎవరూ హాజరు కాకుండా..హాజరు మినహాయింపు పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. దీంతో కోర్టు వొచ్చే నెల పదహారో తేదీన నిందితులు అందరూ కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ప్రస్తుతం రేవంత్‌ ‌రెడ్డి సీఎం పొజిషన్‌లో ఉన్నందున కోర్టుకు  హాజరవుతారా లేదా అన్న దానిపై సస్పెన్స్ ‌నెలకొంది. ఆయన తరపున లాయర్‌ ‌హాజరయ్యేలా ఈడీ కోర్టులోనో లేకపోతే హైకోర్టులోనే పిటిషన్‌ ‌వేసే ఆలోచన చేస్తున్నట్లుగా ఉంది. గతంలో ఏపీ సీఎంగా జగన్మోహన్‌ ‌రెడ్డి ఉన్నప్పుడు ఆయనపై నమోదైన సీబీఐ, ఈడీ కేసుల్లో కూడా కోర్టుకు హాజరు కాలేదు. సీఎం బాధ్యతల కారణంగా ఆయన మినహాయింపు కోరుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page