– తెలంగాణ రైజింగ్‌లో ప్రతీ విద్యార్థి భాగం కావాలి
– క్రీడలు, యువజన సంక్షేమ శాఖ మంత్రి వాకిటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 14 : విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం అంటే విద్య వినయాన్ని ఇస్తుంది.. వినయం వ్యక్తిని గొప్పవాడిని చేస్తుందని ప్రతి ఒక్కరూ గ్రహించాలి అని క్రీడలు, యువజన సంక్షేమ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. బంజారాహిల్స్ కొమురంభీం భవన్‌లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు గురువారం ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ముఖ్య అతిథులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి మాట్లాడుతూ బానిసత్వం నుంచి విద్య బయటకు తీసుకు వస్తుందని నెల్సన్ మండేలా, మహాత్మా జ్యోతిరావు పూలేలు చెప్పారన్నారు. గురుకులాల్లో అన్ని వసతులు కల్పిస్తున్నందున 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని, అన్ని రంగాల్లో బీసీలు ముందుండాలని పిలుపునిచ్చారు. వంద సంవత్సరాలుగా చేయని కుల గణనను ప్రజా ప్రభుత్వం చేసిందని చెప్పారు. విద్యలో ఒత్తిడి ఉండొద్దని 25 వేల మంది టీచర్లకు బదిలీలు, ప్రమోషన్లు ఇచ్చామని, అవకాశాన్ని సృష్టించుకున్నవాళ్లే సమర్ధులు అవుతారని అన్నారు. తెలంగాణ రైజింగ్‌లో ప్రతీ విద్యార్థి భాగం కావాలన్నారు. సరస్వతి దేవికి రంగు, రూపు తేడా ఉండదు.. విద్యపై మనం చూపే ఏకాగ్రతే మనల్ని ముందుకు నడిపిస్తుంది అని అన్నారు. రాజకీయాలు అనగానే వ్యతిరేక ధోరణిని విడనాడాలని, భవిష్యత్తులో అసెంబ్లీ, పార్లమెంటుకు ఎన్నికై చట్టాలు చేయాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రజా ప్రభుత్వం విద్యార్ధుల కోసం ఇస్తున్న ప్రాధాన్యతను గుర్తించి విద్యార్ధులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, బీసీ డెడికేషన్ కమిషన్ చైర్మన్ బి.వెంకటేశ్వర్లు, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ బాలమయాదేవి, ఎంజేపి సెక్రటరీ సైదులు, బీసీ కమిషన్ సభ్యులు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


