హైదరాబాద్, సెప్టెంబర్ 18: గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నగరంలో అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జనం ప్రశాంతంగా జరిగిందని, అందుకు వారి సేవలు అభినందనీయం అని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. నెల రోజుల నుండి జిహెచ్‌ఎంసి అధికారులు, శానిటేషన్ కార్మికులు, సిబ్బంది, ముఖ్యంగా కమిషనర్ ఆమ్రపాలి కాట పర్యవేక్షణలో ఉద్యోగులు, కార్మికులు అహర్నిశలు రాత్రింబవళ్లు తేడా లేకుండా అందరి సమష్టి కృషితో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిమజ్జనం ప్రశాంతంగా ముగిసిందని, అందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ మేయర్ అభినందనలు తెలియజే శారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఇంఛార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్, డి శ్రీధర్ బాబు సూచనలు, సలహాలు, ఎమ్మెల్యే లు, కార్పొరేటర్లు, పోలీస్, హెచ్‌ఎండిఏ, వాటర్ వర్కస్ శాఖల సమన్వయంతో ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరిగాయని మేయర్ పేర్కొన్నారు. జిహెచ్‌ఎంసి అధికారులు సేవలు అందించడంలో ముందు వరసలో ఉంటారన్న అభిప్రాయం నగర ప్రజల మనస్సులో నిలిచి ఉండేలా సేవలు అందించినందుకు అభినందనలు తెలియజేశారు. ముఖ్యంగా శానిటేషన్ కార్మికులు షిఫ్ట్ సిస్టమ్ లో 24 గంటల పాటు పనిచేశారని, వారి సేవలు మరువలేనివని మేయర్ కొనియాడారు.గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు కూడా సహరించారని అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి ధన్యవాదాలు తెలిపారు.