– వరంగల్, జహీరాబాద్‌లలో పరిశ్రమల విస్తరణ
– లక్షల మందికి ఉపాధికి అవకాశల కల్పన
– పలు ప్రాజెక్టులకు 10న ప్రధాని ప్రారంభోత్సవాలు
– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30 : ప్రధాని నరేంద్ర మోదీ మే 10వ తేదీన రాష్ట్ర పర్యటన సందర్భంగా సుమారు రూ.7,823 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతోపాటు, కొన్ని ప్రాజెక్టులను ప్రజలకు అంకితం చేయనున్నారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి,కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇది తెలంగాణ అభివృద్ధికి మరొక పెద్ద మైలురాయి అని అన్నారు. బీజేపీ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో ఆయన రాష్ట్రంలో కేంద్రం తరపున జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రధాని రాష్ట్ర పర్యటన గురించి మాట్లాడారు. తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ఇప్పటికే అనేక ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. రైల్వే రంగంలో తెలంగాణకు సుమారు రూ.85,000 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని, పలు ప్రాజెక్టులు 90% వరకు పూర్తి కాగా మిగతా పనులు పూర్తి చేయడానికి ట్రయల్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నుండి యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తయ్యిందని, భూసేకరణ పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్టుకు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. అదేవిధంగా సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి సుమారు రూ.1,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఆమోదం ఇచ్చిందని,. ప్రస్తుతం ఇది తాత్కాలిక క్యాంపస్‌లో నడుస్తోందని, ఇటీవలే భూమిని పూర్తిగా కేంద్ర విద్యాశాఖకు అప్పగించామని, డిజైన్లు సిద్ధంగా ఉన్నాయని, ప్రస్తుతం టెండర్ దశలో ఉందని, త్వరలోనే పూర్తిస్థాయి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని వివరించారు. తార్నాక ప్రాంతంలో సుమారు రూ.400 కోట్లతో నేషనల్ సైన్స్ సెంటర్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, ఈ సెంటర్ ఏర్పడిన తర్వాత డిఫెన్స్, ఫార్మా, మెడికల్ రీసెర్చ్‌తోపాటు ఐటీ రంగం, విశ్వవిద్యాలయాల పరిశోధనలకు కూడా ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ముఖ్యంగా విద్యారంగానికి ఇది కీలక కేంద్రంగా మారుతుందన్నారు. ఇంకా కొన్ని కీలక ప్రాజెక్టులు కేబినెట్ ఆమోద దశలో ఉన్నాయని వెల్లడించారు. రీజినల్ రింగ్ రోడ్ దక్షిణ భాగానికి సంబంధించిన డీపీఆర్ పనులు కొనసాగుతున్నాయని, భూసేకరణను వేగవంతం చేస్తున్నామని, అది పూర్తయిన తర్వాత కేంద్ర కేబినెట్ ఆమోదం తీసుకుని ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా ప్రారంభించాలనే ప్రణాళికలో ఉన్నామని చెప్పారు. ఇదేకాక కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో లార్జ్ స్కేల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్స్ కింద ఇండస్ట్రియల్ కారిడార్ నెట్‌వర్క్‌లో స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీలను ప్లగ్ అండ్ ప్లే మోడల్‌లో అభివృద్ధి చేస్తున్నామని, తెలంగాణలోని జహీరాబాద్‌కు ఒకటి కేటాయించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టును తీసుకురావడంలో తాను ప్రత్యేకంగా కృషి చేశానని, దీని ద్వారా జహీరాబాద్ ప్రాంతంలో సుమారు 10 లక్షల మందికి పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పించాలనే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఇప్పటివరకు ఇండస్ట్రీస్, ఐటీ, ఉపాధి అవకాశాలు ప్రధానంగా హైదరాబాద్‌కే పరిమితమయ్యాయని, అందుకే ఇప్పుడు వరంగల్, జహీరాబాద్ వంటి ప్రాంతాల్లో కూడా పరిశ్రమలను విస్తరిస్తున్నామని పేర్కొన్నారు..వరంగల్‌లో రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్, అలాగే కాకతీయ పీఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నామని, జహీరాబాద్‌లో ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సుమారు రూ.2,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయి. దీని ద్వారా తెలంగాణలో భారీగా పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. రాష్ట్రంలో పత్తి ఉత్పత్తి అధికంగా ఉండటంతో టెక్స్‌టైల్ పార్కుకు మంచి అవకాశాలు ఉన్నాయని, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, కేంద్రం దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసే ఏడు మెగా టెక్స్‌టైల్ పార్కులల్లో ఒకటి తెలంగాణకు రావడం గర్వకారణమన్నారు. అదే ప్రకారం ఈరోజు పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్క్ అమలు అవుతోందని, కాకతీయుల వారసత్వాన్ని ప్రతిబింబించేలా కాకతీయ అనే పేరు పెట్టినట్లు తెలిపారు. 2030 నాటికి సుమారు రూ.9 లక్షల కోట్ల విలువైన టెక్స్‌టైల్ ఎగుమతులను సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. ఈ ప్రాజెక్టుల అమలులో డిజైనింగ్, మాస్టర్ ప్లానింగ్, నిర్మాణం, ఆపరేషన్స్, మెయింటెనెన్స్ వంటి బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగిస్తున్నాం. మహబూబ్‌నగర్ ప్రాంతంలో సుమారు రూ.3,175 కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారన్నారు. ఇంకా హైదరాబాద్‌లో మల్కాపూర్ వద్ద సుమారు రూ.611 కోట్లతో నిర్మించిన పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించిన ఒక పెద్ద టెర్మినల్‌ను ప్రారంభించనున్నామని, ఇందులో పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ ఫ్యూయల్, లూబ్రికెంట్స్ నిల్వ, సరఫరా సదుపాయాలు ఉంటాయని తెలిపారు. తెలంగాణ అంతటా ఇక్కడి నుండి సరఫరా చేసే విధంగా ఏర్పాట్లు చేశామని, దీనిని ప్రధానమంత్రి వర్చువల్‌గా ప్రారంభిస్తారని తెలిపారు. కాజీపేట నుండి విజయవాడ వరకు మూడో రైల్వే లైన్ నిర్మాణం పూర్తయింది. సుమారు రూ.1,243 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును పూర్తిచేశామని, దీనిని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని చెప్పారు. కాజీపేట వద్ద ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు బైపాస్ రైల్వే లైన్ నిర్మాణం పూర్తయిందని, దీని ద్వారా ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఇబ్బందులు తగ్గుతాయని, పెద్దపల్లి వద్ద కూడా ఇదేవిధంగా బైపాస్ లైన్ నిర్మాణం పూర్తయిందని, ఇవన్నీ కూడా త్వరలోనే ప్రారంభానికి నోచుకోనున్నాయని వివరించారు. కేంద్రంలో మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఇనాగరేషన్స్ ఈనెల 10న జరగనున్నాయన్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ప్రధాని భారీ బహిరంగ సభ కూడా నిర్వహింనున్నట్లు తెలిపారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఏ మంచి కార్యక్రమం చేసినా, కొన్ని ప్రతిపక్ష పార్టీలు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఈ విధమైన వ్యవహారం కొనసాగుతోందని విమర్శించారు.
మహిళల రిజర్వేషన్ అంశాన్ని తీసుకుంటే..ఇది స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి చర్చలో ఉన్న విషయం. 30 సంవత్సరాల క్రితమే బిల్లులు ప్రవేశపెట్టినా పూర్తిగా అమలు కాలేదు. మహిళల రిజర్వేషన్ అమలు చేయాలంటే డీలిమిటేషన్ కూడా అవసరం. 1971లో దేశ జనాభా సుమారు 55 కోట్లుగా ఉండగా 543 లోక్‌సభ స్థానాలు నిర్ణయించారు. ప్రస్తుతం జనాభా 140 కోట్లకు పైగా పెరిగింది. కాబట్టి సీట్ల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది. దీనిపై విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. పార్లమెంట్ సమావేశాలకు ముందు చాలామంది సూత్రప్రాయంగా అంగీకరించారు. కానీ కాంగ్రెస్, ఇండీ కూటమి లోక్‌సభలో బిల్లును అడ్డుకున్నాయని, అయితే వారు ప్రధాని నరేంద్ర మోదీని ఓడించామని భావిస్తున్నాయని, కానీ వారు ఓడించింది దేశంలోని మహిళలను, దళితులను, గిరిజనులను అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు క్షమించరరన్నారు. కాంగ్రెస్ కుట్రలను ఎండగట్టేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు, పరేడ్ గ్రౌండ్స్ లో జన ఆగ్రహ సభకు విచ్చేస్తున్నారు. అందుకే ప్రధానమంత్రి కార్యక్రమానికి పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని కిషన్‌రెడ్డి ప్రజలను కోరారు. రాజకీయాల్లో పరస్పర విమర్శలు సహజం. కానీ అభివృద్ధి విషయంలో అందరూ ఒకే దిశలో పనిచేయాలి. ఇప్పటికైనా ఈ అంశాలపై అన్ని పార్టీలు పునరాలోచించి, ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తూ ముందుకెళ్లాలని కోరుతున్నానన్నారు. సమావేశంలో బిజెపి ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, సీనియర్ నాయకులు డా.ఎస్.ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధులు పోరెడ్డి కిషోర్, పుల్లారావు యాదవ్, సమత, సీనియర్ నాయకురాలు సుభాషిణి , తదితర నాయకులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




