అభివృద్ధిలో అస‌లైన భాగ‌స్వాములు

– కార్మికవర్గానికి సీఎం మేడే శుభాకాంక్షలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30 : తమ ప్రభుత్వంలో కార్మికులకు సముచిత గౌరవం లభిస్తున్నదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మే డే(మే 1వ తేదీ) సందర్భంగా కార్మికవర్గానికి ఆయన అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. శ్రామికులే తమ ప్రభుత్వ అభివృద్ధిలో అసలైన భాగస్వామ్యులని, ప్రభుత్వం అమలు చేసే నూతన పారిశ్రామిక విధానం శ్రామికుల అభ్యున్నతికి దోహదపడుతుందని చెప్పారు. కార్మికుల శ్రేయస్సు, సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్నదన్నారు. మే డే స్ఫూర్తితో ం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని, ప్రజా ప్రభుత్వం వచ్చిన చేపట్టిన వెంటనే అసంఘటిత రంగంలో పనిచేస్తున్న గిగ్ వర్కర్ల కోసం రూ.5 లక్షల ప్రమాద బీమా అమలు చేశామని, తెలంగాణ గిగ్, ప్లాట్‌ఫాం వర్కర్స్ సంక్షేమ బిల్లు తీసుకొచ్చామని తెలిపారు. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల ద్వారా లక్షలాదిమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తున్నదని సీఎం పేర్కొన్నారు. ఏళ్లతరబడి ప్రభుత్వ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలను భర్తీ చేశామని, రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ దేశానికే తలమానికంగా ఉన్న సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి పండుగలకు ముందే బోనస్ చెల్లించామని, సింగరేణి చరిత్రలో తొలిసారిగా కాంట్రాక్టు కార్మికులకు రూ.5 వేల చొప్పున బోనస్ ఇచ్చినట్టు వివరించారు. దాంతోపాటు పలు బ్యాంకుల సహకారంతో కార్మికులకు రూ.కోటి బీమా సౌకర్యాన్ని కల్పించినట్టు వెల్లడించారు. గల్ఫ్ దేశాల్లో పనిచేసే తెలంగాణ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆయా దేశాల్లో మన కార్మికులు ఏ కారణంతో మరణించినా వారి కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు సీఎం తెలిపారు.
మే డే స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వ పాలన : ఉప ముఖ్యమంత్రి భట్టి   
కార్మిక లోకానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ‘మే డే’ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందిరమ్మ రాజ్యంలో కార్మికుల శ్రేయస్సుకే ప్రథమ ప్రాధాన్యత ఉంటుందని, ప్రజా ప్రభుత్వం వచ్చిన తక్కువ కాలంలోనే శ్రామికవర్గం కోసం చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. ముఖ్యంగా సింగరేణి చరిత్రలో నిలిచిపోయేలా కార్మికులకు రూ.కోటి ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించామని, అలాగే సహజ మరణం పొందిన కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందజేస్తూ కొండంత అండగా నిలుస్తున్నామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గనుల్లో ప్రాణాలకు తెగించి పనిచేసే కాంట్రాక్టు కార్మికుల కష్టాన్ని గుర్తించి సంస్థ చరిత్రలోనే తొలిసారిగా వారికి రూ.5 వేల బోనస్ అందించడమే కాక పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలను భర్తీ చేసి కార్మిక బిడ్డలకు ఉపాధి కల్పించామని వివరించారు. ఇంధన శాఖ పరిధిలోని ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంలలో పనిచేసే ఉద్యోగులకు సైతం రూ.కోటి ప్రమాద బీమాను వర్తింపజేస్తూ ప్రభుత్వం భరోసా ఇచ్చిందన్నారు. ఆర్టీసీలో గత ప్రభుత్వ అణచివేత ధోరణిని పక్కనపెట్టి కార్మికుల హక్కులను కాపాడేందుకు యూనియన్లను పునరుద్ధరించడంతోపాటు, త్వరలోనే ఎన్నికలు నిర్వహించడానికి సన్నద్ధమవుతున్నామని, వారి 32 ప్రధాన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్పారు. ఆధునిక కాలంలో పెరుగుతున్న గిగ్ వర్కర్ల రక్షణ కోసం రూ.5 లక్షల ప్రమాద బీమాతో కూడిన ప్రత్యేక సంక్షేమ బిల్లును తీసుకొచ్చామని, అలాగే గల్ఫ్ దేశాలకు వలస వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. మే డే స్ఫూర్తితో రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములైన ప్రతి కార్మికుడికీ సామాజిక భద్రత కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని డిప్యూటీ సీఎం పునరుద్ఘాటించారు.
—————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *