– యంగ్ ఇండియా స్పోర్ట్సు సమ్మిట్‌లో జయేష్‌రంజన్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30 : యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో గురువారం నిర్వహించిన యంగ్ ఇండియా స్పోర్ట్స్ సమ్మిట్-2026 విజయవంతం అయింది. దేశంలోని క్రీడా విధానాలు విద్య పరిశోధన, సాంకేతిక ఉపాధి అవకాశాలపై చర్చించారు. సమ్మిట్‌ను ప్రారంభించిన ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ రాష్ట్రంలో బలమైన, స్థిరమైన క్రీడా వ్యవస్థను నిర్మించేందుకు, క్రీడారంగంలో ఉన్నతస్థాయి విద్య, శిక్షణ అందించేందుకు యువ క్రీడ నైపుణ్యాన్ని మెరుగుదిద్దేందుకు ఏర్పాటు చేసిన ఈ యూనివర్సిటీ చేపడుతున్న మొట్టమొదటి కార్యక్రమంలో క్రీడారంగ నిష్ణాతులు, పాలసీ మేకర్స్ మేధావులు పాల్గొనడం సంతోషకరమని, తెలంగాణలో అద్భుతమైన క్రీడాభివృద్ధి అవకాశాలు ఉన్నాయని అన్నారు. రాష్ట్ర క్రీడాభివృద్ధిలో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ దిక్సూచిలా పనిచేస్తుందన్నారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ క్రీడల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ దేశంలోనే కాదు విశ్వవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందుతుందంటూ ఈ యూనివర్సిటీ ఆధ్వర్యంలో మరిన్ని క్రీడా కార్యక్రమాలు జరగాలని ఆకాంక్షించారు. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన, ఆశయం మేరకు చేపడుతున్న అనేక క్రీడాభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు జరిగిందని, ఈ విశ్వవిద్యాలయం ద్వారా మేధోవంతమైన చర్చలకు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని, యువ క్రీడాకారులకు భవిష్యత్తును అందించే విధంగా యూనివర్సిటీ కార్యక్రమాలు విస్తృతం కావాలని అన్నారు. స్పోర్ట్స్ అథారిటీ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సోని బాలాదేవి మాట్లాడుతూ రాష్ట్ర క్రీడా శాఖ ఆధ్వర్యంలో గత రెండేళ్లుగా క్రీడల అభివృద్ధికి వివిధ క్రీడా సంస్థలను నెలకొల్పడం, అకాడమీల సంఖ్య పెంచడం, మట్టిలో మాణిక్యాలను గుర్తించేలా గ్రామీణ స్థాయి నుంచి క్రీడా పోటీలను నిర్వహించడం దిగ్విజయంగా కొనసాగుతున్నదని చెప్పారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ కిషోర్ గోపీనాథన్ మాట్లాడుతూ క్రీడా విద్యా పరిశోధన సాంకేతిక ఉపాధి అవకాశాలపై ప్రపంచంలో ఉన్న మెరుగైన విధానాలన్నిటిని సమకూర్చి సమగ్ర కోర్సులను అందించే విధంగా యూనివర్సిటీ కృషి చేస్తుందని తెలిపారు. ఈ సమ్మిట్‌లో ఐదు అంశాలపై చర్చ జరిగింది. తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ, గవర్నెన్స్ అండ్ ఒలింపిక్ విజన్ అంశంపై ప్రసాద్ మంగిపూడి ఆధ్వర్యంలో చర్చ జరగగా స్పోర్ట్స్ ఎడ్యుకేషన్, కెరీర్ అవకాశాలు, మార్కెట్ డిమాండ్ సృష్టి ‘జైన’ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. ఒలింపిక్ విలువలు అండ్ ఫిజికల్ లిటరసి అంశంపై అభినవ్ బింద్రా ఫౌండేషన్ ట్రస్ట్ ప్రతినిధి అమిత్ మాలిక్, స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడిసిన్ – విద్య అండ్ అవకాశాలు నరేష్ కుమార్ పగిడిమర్రి ప్రసంగించారు. స్పోర్ట్స్ లీగ్స్, టెక్నాలజీ అండ్ ఈ-స్పోర్ట్స్ అంశంపై కార్తిక్ యనమండ్ర (360 డి స్పోర్ట్సు) ప్రసంగించగా పారా స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ డాక్టర్ శ్రీపద్మిని చెన్నప్రగడ (అడాప్టెడ్ స్పోర్ట్సు ఇండియా ఫౌండేషన్) చర్చించారు. ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ మాజీ క్రీడల సలహాదారు డాక్టర్ చిన్నపరెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ అధికారులు రవీందర్ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమ్మిట్‌లో గౌరవ అతిథులుగా పద్మశ్రీ పుల్లెల గోపీచంద్, ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు ఇస్మాయిల్ బేగ్, నాగపురి రమేష్, అర్జున అవార్డు గ్రహీత జెజె శోభ, ఒలంపియన్ నేహా అగర్వాల్, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, క్రీడారంగ నిష్ణాతులు, క్రీడాకారులు, క్రీడారంగ ప్రముఖులు పాల్గొన్నారు
——————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





