సంపదను అందరికీ సమానంగా పంచడమే లక్ష్యం
కులగణన సర్వే కుల వివాదాలను రగిలిస్తుందనడం అర్ధరహితం
రేషన్ కార్డులు, పింఛన్లలో కోతలు విధించబోం
కులగణనపై ఎన్నికల ముందే రాహుల్ గాంధీ ప్రచారం
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క
కులగణన సర్వే కుల వివాదాలను రగిలిస్తుందన్న ఆరోపణలు అర్థరహితమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర సంపద అందని వారందరికి సంపదను అందించే కార్యక్రమమే కులగణన అని పేర్కొన్నారు. తెలంగాణ కుల గణన దేశానికి దిక్సుచీ వంటిదని, రోల్ మోడల్ అని ఇప్పటికే రాహుల్ గాంధీ సైతం ప్రకటించారని గుర్తు చేశారు. కులగణనపై ఎన్నికలకు ముందే దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ప్రచారం చేశారన్నారు. ఈ మేరకు బుధవారం మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిప్యుటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మాట్లాడారు. కుల గణన ద్వారా సమగ్ర సమాచారం వస్తే, సంపద ఇంకా ఎంత మందికి అందలేదు అనేది తెలుస్తుందని చెప్పారు. రాజ్యంగ లక్ష్యాల అవకాశాలు అందరికి రాజకీయ, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించేందుకే తెలంగాణ ప్రభుత్వం కుల గణన ప్రక్రియ అని స్పష్టం చేశారు. కుల గణనతో వనరులు, ఆస్తులు సమానంగా అందాలన్నదేది తమ విధానమని, అయినప్పటికి కొద్ది మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గించుకునేందుకు రేషన్ కార్డులు, పింఛన్లలో కోత పెట్టడానికే కుల గణన సర్వే చేపట్టారన్న విపక్షాల విమర్శలు అవాస్తమని అన్నారు. వారికి మాత్రమే ఫలాలు అందాలని అనుకునే వారే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. బీహార్ లో కులగణన ప్రక్రియ సత్ఫలితాలిచ్చిందా లేదా అన్నది ఆ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారమన్నారు. బీఆర్‌ఎస్ సమగ్ర కుటుంబ సర్వే లెక్కలకు కాలం చెల్లిపోయిందని, అందులోని సర్వే అంశాలు కుల గణన సర్వే అంశాలు భిన్నమైనవని అన్నారు. రాజకీయ అవకాశాలు అందాయా, ఎలాంటి అవకాశాలు వచ్చాయి అనేది సర్వేలో తేలుతుందని స్పష్టం చేశారు. త్వరగానే కుల గణన సర్వే నివేదిక ఇస్తామని స్పష్టం చేశారు. సర్వేలో సేకరించబడిన సమాచారం గోప్యంగా ఉంచబడుతుందని ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అసవరం లేదన్నారు. డెడికేటెడ్ కమిషన్ పని స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించిందని, కుల గణన ప్రక్రయ సమగ్ర కుటుంబ సర్వే అని పేర్కొన్నారు. కుల గణన కార్యక్రమం విప్లవాత్మక కార్యక్రమం అన్నారు.
సమాజంలో అనేక అంశాలపై ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన సామాజిక న్యాయం కోసం ప్రయత్నంలో భాగంగా ఈ సర్వే జరుగుతుందన్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ, కుల, మత, విద్యా, వ్యవసాయం ఇలా అనేక అంశాలపై సమాచార సేకరణను భవిష్యత్తులో ఉపయోగపడేలా సమాచారం నిక్షిప్తంగా ఉంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం దేశానికి మార్గదర్శిగా ఉంటుందన్నారు. భవిష్యత్తు ప్రణాళికలకు దోహదం రాహుల్ గాంధీ సూచన మేరకు నిర్వహిస్తున్న ఈ సర్వే, భవిష్యత్తులో అనేక ప్రణాళికలకు దోహదపడుతుందన్నారు. సర్వేకు సహకరించాలని ప్రగతిశీల నాయకులకు విజ్ఞప్తి చేశారు. సమస్యలు లేకుండా 150 ఇళ్లు మాత్రమే ప్రతి 10 మంది ఎన్యుమారెటర్లకు అప్పగించామని పేర్కొన్నారు. అలాగే ఒక పర్యవేక్షణ అధికారికి బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు.





