– బీజేపీలో అంతర్మథనం!
– పశ్చిమ బెంగాల్ విజయ ఫార్ములాతో తెలంగాణలో ఒంటరి పోరు
– ఎన్డీయే మిత్రపక్షాల పొత్తుపై సందిగ్ధం
– నేతల మధ్య అంతర్గత విభేదాలకు చెక్
– కాంగ్రెస్ వైఫల్యాలే ఎజెండాగా ఆరు నెలల కార్యాచరణకు దిల్లీ పెద్దల ఆదేశం
(మండువ రవీందర్‌రావు )
పార్టీ ఉనికి పెద్దగా లేని పశ్చిమ బెంగాల్‌లో అఖండ విజయం సాధించినప్పుడు తెలంగాణలో ఎందుకు ఎదగలేకపోతున్నామన్న అంతర్మథనం బీజేపీ వర్గాల్లో మొదలైంది. పశ్చిమ బెంగాల్‌లో సుదీర్ఘకాలం లెఫ్ట్ ఫ్రంట్, తృణముల్ కాంగ్రెస్ హవా కొనసాగుతున్న క్రమంలో తాజాగా 2026 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ సీట్లను సాధించుకుని అధికారం చేపట్టింది. బెంగాల్‌లో బీజేపీ అధికారం చేపడుతుందని ఎవరూ ఊహించలేకపోయారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ (డబుల్ ఇంజన్ సర్కార్) ఉండాలని బీజేపీ చేసిన విస్తృత ప్రచారం ఇక్కడ ఫలించిందనే చెప్పా. అంతేగాక ఇక్కడ ఎన్డీయే కూటమికి చెందిన ఏ ఒక్క పార్టీతో పొత్తులేకుండా ఒంటరిగా పోటీ చేసి గెలువడమన్నది ఆ పార్టీకి లాభించిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు అదే ఫార్ములా తెలంగాణలోనూ అమలుపర్చాలన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తున్నది. తాజాగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అదే విషయాన్ని స్పష్టం చేశారు. రాష్ట్రంలో త్వరలో జీహెచ్‌ఎంసీ, రెండు ఎంఎల్సీ ఎన్నికలు రానున్నాయి. ఈ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ఆయన అనడంతో పలువురి ఊహాగానాలకు బ్రేకులు పడినట్లైంది. దీంతో ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలోని జనసేన, టిడిపి పరిస్థితేమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మిగిలింది. కాగా, తెలంగాణలో జరిగే ప్రతీ ఎన్నికలో పాల్గొననున్నట్లు ఇప్పటికే జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ప్రకటించి తెలంగాణ మీ అబ్బ సొత్తా అని ఆయన వివాదస్పద ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దాన్నిబట్టి ఆయన తెలంగాణలో తప్పకుండా పోటీ చేస్తారన్నది స్పష్టమైంది. కాని, జనసేన విషయం తమ అధిష్టానం చూసుకుంటుందని రాచందర్‌రావు విస్పష్ట సమాధానం సందిగ్దాన్ని కలిగించేదిగా ఉంది. దక్షిణాధిన తమ పార్టీని విస్తరించాలని బిజెపి చాలాకాలంగా ప్రయత్నిస్తున్నది. అందుకు ప్రత్యేకంగా తెలంగాణనే ఎంచుకుంది. పక్కనున్న ఆంధప్రదేశ్ రాష్ట్రంకన్నా తెలంగాణలోనే అంతోఇంతో బీజేపీకి బలముంది. పెద్దగా బలం లేని పశ్చిమ బెంగాల్‌లో అధికారంలోకి రాగాలేనిది తెలంగాణలో ఎందుకు రాలేకపోతున్నామన్న ఆత్మవిమర్శలో పడింది ఆ పార్టీ. అదే విషయంపై తాజాగా ఢిల్లీలో తెలంగాణ నేతలతో అధిష్టానం తీవ్రంగా చర్చించింది. ఎట్టి పరిస్థితిలోనూ ఈసారి తెలంగాణపై కాషాయ జండాను ఎగురవేయాల్సిందేనని అధిష్టానం గట్టిగా చెప్పింది. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులుగా చలామణి అవుతుండగా మొత్తం ఆరుగురు ఎంపిలు ,మరో ఆరుగురు ఎంఎల్యేల బలం కలిగిన పార్టీ మరింతగా ఎందుకు బలపడడం లేదని అధిష్టానం నిలదీసింది. అందుకు అంతర్గత విభేదాలే కారణమని తెలుసుకున్న పార్టీ అధినాయకత్వం విభేదాలు మరిచి సంఘటితంగా కృషిచేయాలని సూచించింది. తెలంగాణకు చెందిన ఆరుగురు ఎంపిలకు ఒకరితో ఒకరికి సరిపడకపోవడమన్నది కొంతకాలంగా జరుగుతున్నది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కి, మరో సీనియర్ నాయకుడు, మల్కాజిగిరి ఎంపి ఈటెల రాజేందర్‌కు కొంతకాలంగా పొసగటంలేదు. ఇలానే పార్టీలోని పాత, కొత్త నాయకులమధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడిగా రాంచందర్‌రావు వచ్చిన తర్వాత వాటికి పులిస్టాఫ్ పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ నాయకులంతా ఇంకా ఒక తాటిపైకి రాలేకపోతున్నారు. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ వీరిద్దరిని తమ ఇంట్లో సమావేశ పరిచి సమన్వయం కూర్చినట్లు తెలుస్తున్నది. అలాగే తాజాగా ఈ నెల 5, 6 తేదీల్లో బండి సంజయ్ ఢిల్లీలోని తన నివాసంలో తోటి మంత్రి కిషన్‌రెడ్డితోపాటు ఆ పార్టీకి చెందిన ఎంపీలు, ఎంఎల్‌ఏలకు వింధు ఏర్పాటు చేయడంకూడా అందులో భాగమే. వీటితోపాటు ఇటీవల భాజపా జిల్లా అధ్యక్షుల నియామకం విషయంలోకూడా కొంత విభేదాలు పొడసూపాయి. ప్రధానంగా కరీంనగర్, మేడ్చల్ అర్బన్, వికారాబాద్ జిల్లాలకు సంబందించి బండి సంజయ్, ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలు సూచించిన వారికి ఇవ్వడంతో ఆ సమస్య సద్దుమణిగింది. పార్టీలో నెలకొన్న ఇలాంటి అనేక సమస్యలపై రాష్ట్ర నాయకులతో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితీన్ నబీన్ శుక్రవారం సుదీర్ఘంగా చర్చించి ఇక ముందు అందరూ కలిసి పనిచేసి రాష్ట్రంపై కాషాయ జెండాను ఎగురవేసేందుకు కార్యాచరణను రూపొందించుకోవాలని సూచించారు. ప్రధానంగా ప్రభుత్వంపై ప్రజలకున్న వ్యతిరేకతను అను కూలంగా మలచుకోవాలని సూచించినట్లు తెలుస్తున్నది. అలాగే గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ చేసిన వాగ్ధానాలు, అమలు చేయలేకపోయిన పథకాలను తీసుకుని ప్రజల మధ్యకు వెళ్ళేవిధంగా ప్రణాళిక తయారు చేసుకోవాలని అధిష్టానం ఆదేశించింది. ఇందుకోసం త్వరలో ఒక కోర్ కమిటీని ఏర్పాటు చేసుకుని రానున్న ఆరునెలల ప్రణాళికలను రూపొందించుకోవాలని కూడా సూచించింది. ప్రధానంగా గ్రామీణ స్థాయినుంచి పార్టీని బలోపేతం చేయడం, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలే ఎజండాగా ప్రచార కార్యక్రమాలను విస్తృతం చేసే దిశగా పార్టీ సన్నద్దమవుతున్నది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





