- హైడ్రా.. హైడ్రోజన్ బాంబులా మారింది.
- సీఎం రేవంత్ అనాలోచిత నిర్ణయాలతో పాలన
- బాధితులకు బీఆర్‌ఎస లీగల్ సెల్ అండ
- మాజీమంత్రి హరీష్ రావు విమర్శలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 28 : మూసీలో గోదావరి నీళ్లు పారిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి.. పేద, మధ్య తరగతి ప్రజల కన్నీళ్లు పారిస్తున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ప్రభుత్వానికి పేదల ఆశీర్వాదాలు ఉండాలని, వారి గోసలు కాదని చెప్పారు. పేదల కన్నీళ్లపై అభివృద్ధి చేయడం ఏంటని ప్రశ్నించారు. సోదరుడికి నోటీసులు ఇచ్చి, పేదల ఇంటికి బుల్డోజర్లు పంపుతారా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ లీగల్ సెల్ ప్రతినిధులు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో హైడ్రా బాధితులతో హరీష్ రావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైడ్రా.. హైడ్రోజన్ బాంబులా మారిందని, ఎవరికీ కంటిమీద కునుకులేకుండా పోయిందన్నారు. రాహుల్ గాంధీ.. తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోంది.మీరు దేశమంతా తిరిగి బుల్డోజర్ ఉపన్యాసాలు ఇవ్వడం కాదు. ముందు తెలంగాణలో బుడ్జోజర్ రాజ్‌ను ఆపండి. 24 గంటలు బిఆర్ఎస్ న్యాయవాదుల బృందం బాధితుల సహాయం కోసం తెలంగాణ భవన్‌లో ఉంటుంది.మీకు మేమంతా రక్షణ కవచంగా నిలబడతాం. మీరు ఫోన్ చేస్తే.. మేం మీకు అండగా నిలబడతాం. మీరు ధైర్యాన్ని కోల్పోవద్దని హరీష్ రావు అన్నారు.
రేవంత్‌రెడ్డి సోదరునికి నోటీసులిచ్చి 45 రోజులు టైం ఇచ్చారు.? పేదోడికైతే రాత్రిరాత్రికే వొచ్చి బుల్డోజర్లతో కూలగొడతారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలోనే బాధితులంతా ఇండ్లకు పర్మిషన్ ఇచ్చారు. కష్ట పడి డబ్బులు కూడబెట్టుకొని భూములు కొనుక్కున్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మున్సిపాలిటీల కెళ్లి పర్మిషన్ తీసుకున్నారు. ఇళ్ల నిర్మాణాలకు బ్యాంకు నుంచి లోన్‌లు తీసుకున్నారు. ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టారు.. 1993 కాంగ్రెస్ ప్రభుత్వమే వీరికి పర్మిష్మన్లు ఇచ్చింది. ఇప్పుడు వాటిని కూల్చడం అన్యాయమని అన్నారు. కేసీఆర్ మిషన్ భగీరథ పెడితే.. ప్రతీ ఇంటికి నీరందింది. కాళేశ్వరం కడితే లక్షాలాది మంది రైతులకు సాగు,తాగు నీరందింది కానీ రేవంత్‌రెడ్డి మూసీలో గోదావరి నీళ్లు పారిస్తానంటున్నాడు. కానీ పేద మధ్య తరగతి ప్రజల రక్తం, కన్నీళ్లు పారించే యత్నం చేస్తున్నావ్ అని హరీష్ మండిపడ్డారు. సోషల్ మీడియాలో వీడియోలు చూస్తే పేదల గుండెలు ఆగిపోతున్నాయని, రేవంత్ అధికారంలోకి వచ్చినప్పటి ఒక్క మంచి పనిచేశాడాని అన్నారు.
ఆయనకు కూల్చడం తప్ప.. కట్టడం తెలీదా? పేదలకు పనికొచ్చే పనిచేయ్.. రాహుల్ గాంధీ.. తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోంది. మీరు దేశమంతా తిరిగి బుల్డోజర్ ఉపన్యాసాలు ఇవ్వడం కాదు. ముందు తెలంగాణలో బుడ్జోజర్ రాజ్‌ను ఆపండి. అంటూ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి.. అఖిలపక్ష మీటింగ్ పెట్టి అందరి అభిప్రాయాలు తీసుకోవాలని, ఆ తర్వాతే మూసీ విషయంలో ముందుకెళ్లాలని, మొదట ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా.. హైడ్రా పేరుతో నాటకాలు ఆడుతున్నాడని అ్లన్నారు. మూడు విషయాలు బాధితులకు హామీ ఇస్తామని, 24 గంటలు తమ న్యాయవాదుల బృందం తెలంగాణ భవన్‌లో ఉంటుందని, వారి నెంబర్ తీసుకొని ఏ అవసరమొచ్చినా.. అందుబాటులో ఉంటారని తెలిపారు. 10వేల ఇండ్లు ఉన్నాయని ప్రభుత్వం బయలుదేరింది.. కానీ 25వేల ఇండ్లను కూల్చేందుకు సిద్ధమవుతున్నారని ఆరోపించారు.
గోడును వెల్లబోసుకున్న బాధితులు
పైసా పైసా కూడబెట్టి కట్టుకున్న ఇల్లు కూలిపోతే తట్టుకునే శక్తి మాకు లేదని, మా గుండే ఆగిపోతుందని, కొన్ని రోజులుగా కంటిమీద కునుకు ఉండట్లేదని బాధితులు హరీష్ రావు ఎదుట తమ గోడును వెల్లబోసుకున్నారు. తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్దం కావట్లేదని, దయచేసి మాకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందనే ఆందోళనతో క్షణక్షణం భయంతో గడపాల్సి వొస్తుంది. గొంతులో అన్నం దిగట్లేదు.. అసలు మేము కొన్నప్పుడు ఇలాంటివి ఏవీ మాకు తెలియదు లక్షల కొద్ది బ్యాంకు లోన్లు తెచ్చి, ఇళ్లు కట్టుకున్నాం ఇప్పుడు కూల్చేస్తే తమ పిల్లలు రోడ్డున పడతారు. తెల్లారితే అసలు ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. టీవీ చూస్తుంటే భయమవుతోంది. ప్రభుత్వమే తమను మోసం చేస్తే మా బాధ ఎవరికి చెప్పుకోవాలి. ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడితే, మా సొంత జీతాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం.. ఇలా అక్రమంగా ఇళ్లు కూల్చేయడం సరికాదు అని బాధితులు వెల్లడించారు.