- న్యాయవ్యవస్థలోనూ కృత్రిమ మేధ అమలు
- నల్సార్ విద్యార్థులకు డిగ్రీలు, బంగారు పతకాల ప్రదానం
- యూనివర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముర్ము
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 28 : ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం సాంకేతికంగా ఎన్నో మార్పులు వొస్తున్నాయని, న్యాయ వ్యవస్థ కూడా కృత్రిమమేధను మరింత ఉపయోగించుకొని బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని రాష్ట్రపతి ద్రౌపదిముర్ము అన్నారు. కృత్రిమ మేధ పేదలకు అందుబాటులోకి రావాలని, వారికి అండగా నిలవాలని ఆకాంక్షించారు. ధనికులతో పోలిస్తే పేదలు న్యాయం పొందలేక పోతున్నారని.. మెరుగైన సమాజం కోసం ఈ విధానంలో మార్పు రావాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు.
స్వాతంత్య్ర పోరాటంలో గాంధీజీ న్యాయబద్ధంగా సత్యాగ్రహ దీక్ష చేసి ఆదర్శంగా నిలిచారని ముర్ము అన్నారు. నిబద్ధత, పారదర్శకంగా పనిచేస్తే న్యాయవాద వృత్తిలో ఎంతో ఎత్తుకు ఎదగొచ్చని తెలిపారు. నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన 21వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పీహెచ్డీ, ఎల్ఎల్ఎంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకాలు అందించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, స్నాతకోత్సవ ప్రసంగంలో చట్టంలోని వివిధ రంగాలలో నల్సార్ కృషిని ప్రశంసించారు. ప్రధానంగా నల్సార్ జంతు సంరక్షణ చటాల గురించి చేస్తున్న కృషిని ప్రస్తావించారు. ఒడిశా ప్రభుత్వంలో తాము మత్స్యశాఖ, జంతు వనరుల అభివృద్ధి మంత్రిగా ఆమె గతంలో పనిచేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ, జంతువుల రక్షణ, సంక్షేమం గురించి ప్రజలను చైతన్యం చేయడంలో ఈ జంతు సంరక్షణ చట్టాల అవగహన అత్యవసరమని అన్నారు.
భారతదేశంలోని ప్రాచీన భారత పరిపాలన, న్యాయ సంప్రదాయాలను గురించి మాట్లాడారు. కౌటిల్యుని అర్థశాస్త్రంలో, ప్రాచీన భారత్ దేశంలో చట్టపరమైన పరిపాలనా వివరణ ఉన్నదని తెలిపారు. దక్కన్ ప్రాంతంలో రచించిన అపస్తంభధర్మసూత్రాలను ఆమె ప్రస్తావించారు. దేశం ఉన్నత న్యాయ సంప్రదాయాన్ని పట్టభద్రులు గుర్తు ఉంచుకోవాలని ఆమె ఉద్బోధించారు. విజయవంతమైన వృత్తి జీవితాన్ని పొందాలనుకునే న్యాయ నిపుణుల కోసం విలువలను పాటించాలని సూచించారు. మన రాజ్యాంగ విలువలో కీలకమైన సామాజిక న్యాయం అనే భావనను లోతుగా అర్థం చేసుకోవాలన్నారు.
నిజాయితీ, ధైర్యం విలువలకు కట్టుబడి సానుకూల సామాజిక మార్పులకు సారథులుగా నూతన స్నాతకులు ఉండాలని ఆమె కోరారు. బంగారు పతకాల విజేతలలో బాలిక విద్యార్థులు పతకాలు బాలురు కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నారని అధ్యక్షుడు ముర్ము తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ రోజుల్లో అనేక ఉన్నత విద్యాసంస్థల్లో బాలికా విద్యార్థులు మంచి ప్రతిభను చూపుతున్నారు అనిఆమె అన్నారు. అనేక పరిమితులు ఉన్నప్పటికీ కుమార్తెలు తమ ఉన్నత ప్రదర్శన తో మనల్ని గర్వపడేలా చేస్తున్నారని ఆమె అన్నారు. ఇక్కడ ప్రతిభ చూపిన అమ్మాయిలు ఇతర మహిళలు, తక్కువ ప్రాధాన్యత కలిగిన బాలికలకు సహాయం,సాధికారత కల్పించాలని ఆమె ఉద్బోధించారు. నల్సార్ విశ్వవిద్యాలయం మహిళా న్యాయవాదులు,న్యాయ విద్యార్థులతో కూడిన దేశవ్యాప్త నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకోవాలని సలహా ఇచ్చారు.
ఈ నెట్వర్క్ మహిళలపై అఘాయిత్యాలను అరికట్టడానికి, అలాంటి అఘాయిత్యాల కేసులను ఎదుర్కోవడానికి సంఘటిత ప్రయత్నాలు చేయడానికి ఎంతో పని చేయగలదు అన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తంచేశారు. నల్సార్ గ్రాడ్యుయేట్లు సామాజిక న్యాయం అభివృద్ధికి సమర్థవంతమైన సాధనంగా ఉండాలని ,మన జాతీయ లక్ష్యాలను సాకారం చేసుకునేందుకు విలువైన సహకారం అందించాలని కోరుతూ ఆమె తన ప్రసంగాన్ని ముగించారు. నల్సార్ యూనివర్శిటీ ఆఫ్ లా వైస్ ఛాన్సలర్ ప్రొ.కృష్ణదేవరావు తన సంక్షిప్త స్వాగత ప్రసంగంలో వికలగుల హక్కుల చట్టాలు,
బాలల హక్కులు, ఖైదీల హక్కులు సంస్కరణల రంగాలలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో నల్సార్స్ సాధించిన విజయాలను గురించి పేర్కొన్నారు. విశ్వవిద్యాలయానికి ఆర్థిక సహాయం అందించినందుకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అంతర్విభాగ అధ్యయనాలు చేయడం ఆధునిక విద్యారంగంలో చాలా ప్రధానం అని, నల్సార్ బోధనా అభ్యసన పరిశోధన కార్యక్రమాన్ని విస్తరించడానికి, యూనివర్శిటీ విద్య విభాగాలను వైవిధ్యపరచడానికి ఉదారంగా సహాయం అందించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా 57 బాగారు పతకాలను రాష్ట్రపతి బహూకరించారు.
బీ ఏ ఎల్ ఎల్బఈ కి చెందిన భవ్య జోహారి డి పది బంగారు పతకాలతో బంగారు పతకాల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా, అదే తరగతికి చెందిన కుమారి అషి ఏడు పతకాలతో రెండవ స్థానంలో నిలిచారు. నల్సార్ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ జస్టిస్ అలోక్ ఆరాధే, గౌరవ అతిథి, గౌరవనీయులైన జస్టిస్ పి.ఎస్. నరసింహ, భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి పట్టభద్రులైన విద్యార్థులకు అందజేశారు. కార్యక్రమంలో మొత్తం 582 డిగ్రీలను ప్రదానం చేశారు. వాటిలో ఎనిమిది పీహెచ్‌డీలు, లా మరియు బిజినెస్ అడ్మినిస్టేష్రన్లో వరుసగా 68 మరియు 48 మాస్టర్స్ డిగ్రీలు ఉన్నాయి, 115 మరియు 28బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా మరియు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ల లో , ప్రదానం చేయబడ్డాయి.
ఆనంద ఉత్సాహలతో స్నాతకోత్సవం ముగిసింది.తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్. నరసింహులు పాల్గొన్నారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా ఛాన్సలర్ అలోక్ ఆరాధే ఈ స్నాతకోత్సవానికి అధ్యక్షత వహించారు. స్నాతకోత్సవ ఊరేగింపునకు ప్రొఫెసర్.ఎన్.వాసంతి రిజిస్ట్రా నల్సార్ విశ్వవిద్యాలయం నేతృత్వం వహించారు.అంతకు ముందు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి.. గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, సీఎస్ శాంతి కుమారి, డీజీపీ జితేందర్ స్వాగతం పలికారు. రాష్ట్రపతి రాకతో నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.