సమాచార హక్కు చట్టానికి సవరణలతో ప్రయోజనం కలిగిందా?

ఆర్థిక సంస్కరణలు సత్ఫలితాలిచ్చాయా?

సమాచార హక్కు చట్టం సహకారంతో అవినీతి లోతుల వివరాలు తెలుసుకుని  ప్రభుత్వాలు ఎలా మారిపోయాయో అందరికీ తెలిసిందే. అధికారంలోకి వచ్చేందుకు సహకరించిన పటిష్టమైన సమాచార హక్కు చట్టం ఇపుడు అధికార పార్టీకి మింగుడుపడని ఎలక్కాయిలా మారింది. ఒక సామాన్యుడు ప్రభుత్వంలోని కీలక అంశాలను ప్రశ్నించడం ఏమిటనేది ప్రభుత్వ భావన. వాస్తవానికి ఆ సామాన్యుడే ఆ పార్టీలకూ, వ్యక్తులకూ అధికారాన్ని కట్టబెట్టారనేది మర్చిపోవడం విచిత్రం.
నిజానికి కేంద్ర ప్రభుత్వం ఏదో కనికరించి దేశ ప్రజలకు సమాచార హక్కు చట్టాన్ని ప్రసాదించలేదనేది ముందు అర్థం చేసుకోవాలి. రాజ్యాంగంలోని మూడో విభాగంలో ప్రాథమిక హక్కుల్లో భాగంగా అధికరణం 19లో భావప్రకటనా స్వేచ్ఛ హక్కును కల్పించింది. అధికరణం 19లోని క్లాజు 1 (ఎ)లో భావప్రకటనా స్వేచ్ఛను పేర్కొంది. సమాచార హక్కు చట్టం దాని వారసత్వమే అని చెప్పాలి. సమాచార హక్కు చట్టాన్ని  2005లో అప్పటి యుపీఏ ప్రభుత్వం తీసుకువచ్చినపుడు లోక్‌సభలోనూ, రాజ్యసభలోనూ పెద్ద దుమారమే చెలరేగింది. చట్టంలో బలం లేదని, ఇలాంటి చట్టం వల్ల ఎవరికీ ప్రయోజనం కలగదని, చట్టంలో డొల్లతనం కనిపిస్తోందని గగ్గోలు పెడితే దానిని అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ బిల్లును సెలక్ట్‌ కమిటీకి పంపించింది.   సెలెక్ట్‌ కమిటీ సూచనతో సమాచార హక్కు 2005 జూన్‌ 15న చట్టంగా మారింది. దానిని జూన్‌ 22న ఉభయ సభలూ  ఆమోదించాయి. అదే ఏడాది అక్టోబర్‌ 12 నుండి అమలులోకి వచ్చింది. ఈ చట్టం అనేక సంచలనాలకు కేంద్ర బిందువు అయ్యింది. ఉద్యోగ ఎంపికల్లో జరిగిన అవినీతి అక్రమాలు మొదలు ప్రభుత్వ టెండర్లు, నిర్ణయాలు, ఆర్థిక  వృథా, దుబారా ఖర్చులపైనా దేశ ప్రజల కళ్లు తెరిపించింది.

 

తక్కువ కాలంలో ఎక్కువ ప్రభావితం చేసిన ఇలాంటి మరో చట్టం లేదంటే అతిశయోక్తి కాదు. ఈ చట్టం అమలు ఎవరికీ మింగుడుపడకపోవడంతో అనేక వివాదాలే చెలరేగాయి. చట్టంలో నిర్వచనాలు మొదలు, సమాచార హక్కు కమిషనర్ల అధికారాలు, నిర్ణయాలపైనా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సమాచార హక్కు చట్టం సెక్షన్‌ 2 (ఎఫ్‌)లో సమాచారం అంటే ఏమిటో సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ వర్సెస్‌ ఆదిత్య బందోపాధ్యాయ అండ్‌ అదర్స్‌ కేసులో సుప్రీంకోర్టు వివరణ ఇచ్చింది. ఖానాపురం గండయ్య వెర్సస్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్స్‌ అండ్‌ అదర్స్‌ కేసులోనూ, తాపప్పలం కోఆపరేటివ్‌ బ్యాంకు వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసులో మరింత వివరణ ఇచ్చింది. సెక్షన్‌ 2 (హెచ్‌)లో పబ్లిక్‌ అథారిటీ అంటే ఎవరో తాపప్పలం కేసులో పేర్కొంది. అలాగే సెక్షన్‌ 8 (1) (ఎ)లో భద్రత, వ్యూహాత్మక నిర్ణయాలు, శాస్త్రీయ  విజ్ఞాన అంశాలు, ఆర్ధిక వ్యూహాలకు సంబంధించి సమాచారం వెల్లడిరచకుండా నిరోధించుకునే హక్కును ప్రభుత్వానికి కల్పించిన అంశంపై రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా వెర్సస్‌ ఎస్‌ జయంతిలాల్‌ ఎన్‌ మిస్త్రి కేసులో సుప్రీంకోర్టు వివరణ ఇచ్చింది. సెక్షన్‌ 8 (1) (ఎ)లో వాణిజ్య గోప్యతపైనా, 8 (1) (ఈ)లో వ్యక్తిగత ప్రయోజన అంశంపైనా, 8 (1) (జీ)లో ప్రాణాలకే ప్రమాదం అయినపుడు, భౌతిక భద్రత అవసరమైనపుడు, సెక్షన్‌ 8 (1) (ఐ)లో వ్యక్తిగత సమాచారం వెల్లడిరచాల్సి వస్తే, మూడో వ్యక్తికి సంబంధించిన సమాచారం ఇవ్వాల్సి వచ్చినపుడు , జరిమానాలు విధించాల్సి వస్తే ఏం చేయాలో కూడా సుప్రీంకోర్టు పలు కేసుల్లో సుదీర్ఘమైన వివరణలే ఇచ్చింది. దాంతో పాటు అనేక హైకోర్టులు సైతం వివిధ కేసుల్లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. వీటన్నింటినీ క్రోడీకరించి సమాచార హక్కు చట్టాన్ని పూర్తి పటిష్టత స్థాయికి తెచ్చిన దశలో కేంద్రప్రభుత్వం సవరణలకు పూనుకోవడం అందరికీ అనుమానాలు రేకెత్తిస్తోంది. కేంద్ర, రాష్ట్రాల్లో సమాచార కమిషనర్ల నియామకాలు, వారి జీత భత్యాలు, హోదాకు సంబంధించి ఒక్క సవరణతో అధికారాలన్నీ కేంద్రం తన గుప్పిట్లోకి తెచ్చింది. ఇదంతా దేశ ప్రజల భాగ్యం కోసమే చేస్తున్నామని కేంద్రం వాదిస్తోంది. పారదర్ళకత విషయంలో నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నించజాలలేరని, గరిష్ట పాలన- కనిష్ట ప్రభుత్వం అనే సూత్రం అధారంగానే తాము పనిచేస్తున్నామని బిల్లును ప్రవేశపెడుతూ ప్రధాని కార్యాలయ వ్యవహారాల సహాయ మంత్రి  చెప్పారు. సమాచార హక్కు చట్టం ద్వారా సేవలను సరళీకరించేందుకు, క్రమబద్ధీకరించేందుకు సంస్థాగతం చేసేందుకు ఈ బిల్లును ప్రవేశపెడుతున్నట్టు ఆయన సభకు తెలిపారు. తాము చేపట్టిన సవరణలతో సహ చట్టం నిర్మాణాన్ని మరింత బలోపేతం చేస్తుందనేది మంత్రిగారి వాదన. అయితే విపక్షాలు మాత్రం మండిపడ్డాయి.

 

సమాచార హక్కు నిర్మూలన బిల్లుగా విపక్షాలు దుమ్మెత్తి పోశాయి. జస్టిస్‌ బీఎన్‌ శ్రీకృష్ణ కమిటీ ఆర్టీఐ చట్టాన్ని సవరించాలని అనేక ప్రతిపాదనలు చేసింది. దీని ఆధారంగానే నరేంద్రమోదీ ప్రభుత్వం చట్టసవరణకు పూనుకుంది. ఆర్టీఐ చట్టం ద్వారా నాయకులు, అధికారుల సమాచారం అడిగితే అదంతా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తుందని ఆ సమాచారాన్ని నిరాకరించే సందర్భంలో సామాన్యుల సమాచారానికి మాత్రం ఎలాంటి అడ్డుకట్ట లేకపోవడం విడ్డూరం. మొత్తం మీద సమాచార హక్కు చట్టానికి సవరణలకు ఉభయ సభలూ ఆమోద ముద్ర వేశాయి. సవరణల్లో కీలకమైనవి ప్రధానంగా సమాచార హక్కు కమిషనర్ల పదవీకాలం, జీత భత్యాలు, ఇతర సౌకర్యాలను సవరించారు. ఇక రెండో అంశం రాష్ట్రాల సమాచార హక్కు కమిషన్‌లలోని సభ్యులను సైతం నియమించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి దక్కుతుంది. ఇక మూడో ప్రధాన సవరణ కేంద్ర సమాచార హక్కు ప్రధాన కమిషనర్‌, ఇతర కమిషనర్లు, రాష్ట్రాల ప్రధాన కమిషనర్‌, ఇతర రాష్ట్ర కమిషనర్ల పదవీకాలం గరిష్టంగా ఐదేళ్లు లేదా వారి వయస్సు 65 ఏళ్ల వరకూ ఉంటుంది. అయితే రాష్ట్రాల్లో నియమితులైన వారు కేంద్రం కమిషన్‌లో నియమితులైతే వారికి పదేళ్ల కాల పరిమితి దక్కే అవకాశం ఉంది. అంతే తప్ప సొంత రాష్ట్రంలో వారు రెండో మారు పదవిలో కొనసాగే అవకాశం తాజా సవరణతో లేకుండా పోయింది. ఇక నాలుగో ప్రధాన సవరణ ప్రధాన కమిషనర్‌ లేదా కమిషనర్లను తొలగించే హక్కు కేంద్రం చేతిలో ఉంటుంది. అంటే పదవిలో కొనసాగించడం, వారి జీత భత్యాలు నిర్ణయించడం, తొలగించడం మూడు కీలక అధికారాలు కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లాయి.

 

కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉందనేది పక్కన పెడితే ఇలాంటి సవరణలు ఏ ప్రస్థానానికి దారితీస్తాయో చాలా స్పష్టంగా తెలుస్తూనే ఉంది. కమిషనర్ల పదవీకాలం, జీత భత్యాలు, ఇతర సౌకర్యాలూ ఎన్నికల కమిషనర్‌కూ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకూ సమానంగా ఉండేవి. వాటిని అకస్మాత్తుగా కోత విధించడమేగాక, నిర్దిష్టత లేకుండా కొత్త సవరణలు తీసుకురావడం అంటే కేంద్రం చేతుల్లో సహచట్టం బందీ అవుతుందనేది అందరి భయం. తాజా సవరణలతో సమాచార హక్కు కమిషనర్లు స్వతంత్రంగా ఎలా వ్యవహరించగలుగుతారనేది ప్రశ్నగా మారింది. సామాన్య పౌరుడు అడిగే సమాచారాన్ని ప్రధాని కార్యాలయం వెల్లడిరచాల్సిందే అని గట్టిగా చెప్పగలిగే అధికారానికి ముకుతాడు వేసిన తర్వాత సమాచార కమిషనర్ల వ్యవహారం మిగిలిన అన్ని వ్యవస్థల మాదిరే నీరుగారుతుందనే ఆందోళన, కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ కత్తికి మరో స్వతంత్ర సంస్థ బలైపోతోందనే బాధ అందరిలో వ్యక్తమవుతోంది. పూర్తిస్థాయి సీఐసీని నియమించకుండా కేంద్ర ప్రభుత్వం ఇంతకాలంగా మీనమేషాలు లెక్కించడం చూస్తుంటే సమాచార హక్కు చట్టం అమలుపై ఉన్న దీక్ష ఎంతో ఇట్టే అర్థమవుతుంది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశిస్తే తప్ప ఆ సంస్థ గురించి ఇంతకాలంగా కేంద్రానికి పట్టింపే లేదు. ఇన్నాళ్లకు తన అసలు స్వరూపాన్ని ప్రదర్శించి కొత్త సవరణలను తీసుకురావడం ద్వారా స్వతంత్ర సంస్థను ఒక ప్రభుత్వ విభాగంగా మార్చేసే ప్రయత్నం చేసింది.

-నవీన్‌ కుమార్‌
చెన్నం శెట్టి
సీనియర్‌ జర్నలిస్ట్‌
సెల్‌: 8886311116

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page