“ముస్లిం దేశాలైన సౌదీ అరేబియా, అరబ్ ఎమిరేట్స్, ఇరాక్, కువైత్, ఖతార్, ఒమాన్ ల నుంచి; క్రిస్టియన్ దేశాలైన రష్యా, అమెరికా నుంచి దిగుమతి అవుతున్న పెట్రోలియం ఉత్పత్తులను కూడా కొనవద్దని; విధర్మీయులైన చైనా నుంచి దిగుమతి అవుతున్న భారీ ఇంజనీరింగ్, యంత్ర పరికరాల దగ్గర నుంచి పతంగుల మాంజ దాకా.. అన్ని రకాలైన ఉత్పత్తుల మీద నిషేధం విధించమని భారత ప్రభుత్వానికి సంఘ్ పరివారీయులు సూచన చేయగలరా?..”

తెలంగాణా అస్తిత్వ వేదిక కో-ఆర్డినేటర్
2025 లో సంఘ్ పరివారీయులు ఒక సర్క్యులర్ ప్రచారంలో పెట్టారు. అందులో ‘ఒకప్పుడు హిందువుల అధీనంలో ఉన్న చుడ్వాలు, కారప్పూసలు ఇతర భారతీయ స్నాక్స్ తయారు చేసే కంపనీ హల్దీరాం ఇప్పుడు విధర్మీయులైన ముస్లింల అధీనంలోకి వెళ్ళిపోయింది. శుభ్రతను పాటించని విధర్మీయులైన ముస్లింల అధీనంలో ఉన్న హల్దీరామ్ ఉత్పత్తులను కొనవద్దని, జాగరూకులైన హిందువులుగా మారండి’ అని బోధిస్తున్నది ఈ సర్క్యులర్. ఇక్కడ మతాన్ని పేర్కొనకుండా ‘విధర్మీయులు’ అనే ముసుగును తగిలించారు. ఏడాది గడచిందో లేదో ఆ ముసుగును కూడా వదిలించుకున్నారు.
ఇప్పుడు 2026 లో సంఘ్ పరివారీయులు ప్రచారంలో పెట్టిన సర్క్యులర్ లో ముసుగు లేకుండానే బాజాప్తా ముల్లాల (ముస్లింల) వద్ద సరుకులు కొనకండి, ముల్లాల అధీనంలో ఉన్న కంపెనీలు తయారు చేస్తున్న వస్తువులను కొనకండి, ముల్లాల నుండి సేవలు పొందకండి .. ఇట్లా ప్రచారం మొదలయ్యింది. అందులో ముల్లాల వ్యాపార సంస్థలు ఏమిటో కూడా పేర్కొన్నారు. ఎంత కష్టమైనా సరే ముల్లాల నుండి ఎటువంటి సేవలు పొందకూడదో పేర్కొన్నారు. ఇవన్ని పాటిస్తే నెల రోజుల్లోనే దేశం హిందూ దేశంగా మారిపోతుందట. ఇదంతా హిందూ ధర్మ పరిరక్షణ కోసమేనట. వాట్సాప్ గ్రూపుల్లో మహారాష్ట్రాలో ఇటీవల సంఘ్ పరివారీయుల ద్వారా ప్రచారంలో ఉన్న ఒక సర్క్యులర్ వాట్సాప్ గ్రూపుల ద్వారా నాకూ చేరింది. అ వాక్యాలను యధాతథంగా ఉటంకిస్తున్నాను. హిందీలో రాసిన సర్క్యులర్ లో ఉన్న ఈ వాక్యాలు అన్ని వారివే తప్ప కల్పించి రాసినవి కావని పాఠకులకు మనవి చేస్తున్నాను.
ముల్లాలపై ఆర్థిక బహిష్కరణ…
జాబితా సిద్ధంగా ఉంది. హిందువులందరూ, దయచేసి దీనిని కనీసం 10 గ్రూపులకు పంపండి!
ఈ ఆర్థిక బహిష్కరణ ఎంత తీవ్రంగా ఉండాలంటే, వచ్చే నెల నాటికి వారి బ్యాలెన్స్ షీట్లు సగానికి తగ్గాలి. అప్పుడు వారి షేర్లు కుప్పకూలిపోతాయి. మీరు వారిని తుపాకితో కాల్చలేకపోతే, కనీసం వేలెత్తి కొట్టండి. జిహాదీలను నాశనం చేయండి. వారు మీ సొంత డబ్బుతోనే మిమ్మల్ని చంపుతున్నారు. కనీసం ఇంత చేసే ధైర్యం మీకు లేకపోతే, మీరు చనిపోతారు. మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. మీకు మరిన్ని పేర్లు దొరికితే, వాటిని ఈ జాబితాలో చేరుస్తూ ఉండండి.
- ఏ దర్గాను సందర్శించవద్దు,2.నెమలి ఈకలతో వచ్చే బాబాలకు దానం చేయవద్దు,3. ముల్లాల వద్ద పండ్లు, కూరగాయలు కొనవద్దు,4. ముల్లా దర్జీలతో బట్టలు కుట్టించుకోవద్దు, 5. ముల్లా మంగళి వద్ద జుట్టు కత్తిరించుకోవద్దు,6. ముల్లా టాక్సీలు/రిక్షాలలో ప్రయాణించవద్దు.7. ముల్లా మహిల చేత హెన్నా/బొటిక్ చేయించుకోవద్దు.8. ముల్లాల హోటళ్లలో భోజనం చేయవద్దు. 9. ముల్లా ప్లంబర్లు/ఎలక్ట్రీషియన్లు/వెల్డర్లను మార్చండి.
ముల్లాల ఉత్పత్తి లేదా కంపెనీ పేరు – యజమాని లేదా బ్రాండ్ అంబాసిడర్.
- అన్ని హమ్దర్ద్ ఉత్పత్తులు-హకీమ్ అబ్దుల్ హమీద్, 02.జరా-పాకిస్తానీ బ్రాండ్,03. మెట్రో షూస్-ఫరా మాలిక్ మేనకోడలు,04. రెడ్ టేప్-ఇర్షాద్ మీర్జా, రషీద్ మీర్జా,05. డా మిలానో-సాహిల్ మాలిక్,06. అలాన్ కూపర్-ముక్తరుల్ అమీన్,07. Acme బ్రాండ్-షాహిద్ అమీన్ ఖాన్,08. ఢిల్లీ దర్బార్ (హోటల్ చైన్)-హాజీ షఫీ మన్సూరి,09. హైవే ధాబాస్-చిలియా ముస్లిం,10. ఫరీదా పాదరక్షలు-రఫీక్ అహ్మద్,11. అల్లానా గ్రూప్ (ఆహార ఉత్పత్తులు)-అబ్దుల్ రజాక్,12. కరెన్ సాఫ్ట్‌వేర్-ఆసిఫ్ ఖాదర్, ముక్రం జాన్,13. రెడ్ చిల్లీస్-షారుక్ ఖాన్,14. డేటా స్మార్ట్ ESPL-జాకీర్ వహాబ్,15. ప్రొఫెషనల్ కొరియర్- అహ్మద్ మీరాన్,16. షహనాజ్ హుస్సేన్ గ్రూప్-షహనాజ్ హుస్సేన్,17. ఎస్టీ కొరియర్-కె నవాస్ కనీ,18. లిబర్టీ గ్రూప్-పర్వేజ్ ఖాదిర్,19. సిప్లా బ్రాండ్-యూసుఫ్ ఖ్వాజా హమీద్,20. వోక్‌హార్డ్-హబిల్ ఖోర్కివాలా,21. హిమాలయా హెర్బల్ హెల్త్‌కేర్-మెరాజ్ మనల్,22. క్వీన్‌బీ టెలికాం-మహ్మద్ అలీ ఇస్మాయిల్,23. స్పోర్ట్స్ వీక్-ఖాలిద్ అన్సారీ,24. జావేద్ హబీబ్ జీన్స్ పార్లర్ చైన్-జావేద్ హబీబ్,25. ముల్లాలు నటించిన/రచించిన/సంగీతం అందించిన/ఆర్థిక సహాయం చేసిన/పంపిణీ చేసిన అన్ని చిత్రాలను బహిష్కరించండి!
జాబితాను పొడిగించడానికి మిగిలిన పేర్లు లేదా ఉత్పత్తులను జోడించండి…!
- మీ టైరు పంక్చర్ లేదా వాహనానికి మరమ్మతులు ఏ ముస్లిం వద్ద చేయించుకోవద్దు!! ఇది పేద హిందువులను పంక్చర్ దుకాణాలు తెరవడానికి ప్రోత్సహిస్తుంది!,2.ముస్లింల నుండి పండ్లు, కూరగాయలు కొనవద్దు; వారిని నమ్మలేము; వారు వాటిపై ఉమ్మివేయవచ్చు లేదా వాటిలో ఏమైనా కలపవచ్చు!,3. ముస్లిం బేకరీ నుండి కేకులు, పేస్ట్రీలు లేదా మరే ఇతర వస్తువునూ కొనవద్దు. వారి మతం ప్రకారం, వారు అన్నింటిపైనా ఉమ్మివేస్తారు; వారి మతం ప్రకారం, ఇది సోదరభావాన్ని పెంపొందిస్తుంది.,4. వేసవిలో హమ్జా అనే ముస్లిం కంపెనీ తయారుచేసిన రూహ్‌ఫజా షర్బత్‌ను కొంటాము… మీరు పతంజలి త్రాగునీటిని కొంటే మంచిది.,5. మీరు ఇల్లు, దుకాణం, ఫ్లాట్ మొదలైనవి కట్టించుకున్నప్పుడల్లా, ఆ పని కోసం పేద హిందూ మజ్దూర్ సంఘ్‌ను నియమించుకోండి, ముస్లిం కాంట్రాక్టర్లను లేదా కూలీలను కాదు!,6. హబీబ్స్, ఐకానిక్ వంటి ముస్లిం సెలూన్‌లో జుట్టు కత్తిరించుకోవద్దు!,7. ముస్లిం నటులు నటించిన సినిమాలు చూడవద్దు, లేదా సినిమాలు చూడటానికి ముస్లిం సినిమా హాళ్లకు వెళ్లవద్దు!,8. ఏ ముస్లిం పెట్రోల్ పంపులోనూ పెట్రోల్ నింపవద్దు!!!
ఈ విధంగా, మనం మన హిందూ మతాన్ని ప్రోత్సహించవచ్చు మరియు మన హిందూ సోదరులకు మద్దతు ఇవ్వవచ్చు. ఈ ఆర్థిక బహిష్కరణ భారతదేశంలో ముస్లింలచే ప్రోత్సహించబడుతున్న అరాచకం, ఉగ్రవాదం, మత మార్పిడి, ఇస్లామీకరణ మరియు హిందువుల హత్యల వంటి కార్యకలాపాలను గణనీయంగా అరికట్టగలదు.
జై శ్రీ రామ్!
వందే మాతరం…! హిందూ సోదర సోదరీమణులందరూ తమ కుటుంబాలలో సమావేశం నిర్వహించి, తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ క్రింది వాటిని తప్పక చేయాలని వివరించాలని కోరడమైనది:
1) ఒక హిందూ నాయకుడిని ఎన్నుకోండి.,2) ఒక హిందూ న్యాయవాదిని ఎన్నుకోండి.,3) ఒక హిందూ ఇంజనీర్‌ను ఎన్నుకోండి.,4) ఒక హిందూ చార్టర్డ్ అకౌంటెంట్‌ను (CA) ఎన్నుకోండి.,5) ఒక హిందూ కూరగాయల వ్యాపారిని ఎన్నుకోండి.,6) ఒక హిందూ మొబైల్ రీఛార్జ్ ప్రొవైడర్‌ను ఎన్నుకోండి.,7) ఒక హిందూ మెడికల్ స్టోర్‌ను ఎన్నుకోండి.,8) ఒక హిందూ పాల డెయిరీని ఎన్నుకోండి.,9) ఒక హిందూ ప్రింటింగ్ ప్రెస్‌ను ఎన్నుకోండి.,10) ఒక హిందూ పాలవాడిని ఎన్నుకోండి.,11) హిందూ స్టేషనరీ దుకాణాలను ఎన్నుకోండి.,12) హిందూ బట్టల షోరూమ్‌లు మరియు దుకాణాలను ఎన్నుకోండి.,13) హిందూ ఎలక్ట్రానిక్ మరియు ఎలక్ట్రికల్ దుకాణాలను ఎంచుకోండి.,14) హిందూ వ్యవసాయ సేవా కేంద్రాలను ఎంచుకోండి.,15)హిందూ ప్రయాణ బుకింగ్ ఏజెంట్ లను ఎంచుకోండి.,16) హిందూ పిండి మిల్లులను ఎంచుకోండి.,17) హిందూ కిరాణా దుకాణాలను ఎంచుకోండి.,18) హిందూ హార్డ్‌వేర్ దుకాణాలను ఎంచుకోండి.,19) హిందూ జిరాక్స్ కేంద్రాలను ఎంచుకోండి.,20) హిందూ హోటళ్లను ఎంచుకోండి.,21) హిందూ కూరగాయలు మరియు పండ్ల వ్యాపారులను ఎంచుకోండి.,22) హిందూ తాపీ పనివారిని ఎంచుకోండి.,23) హిందూ మిఠాయి దుకాణాలను ఎంచుకోండి.,24) మరియు ప్రతిదానికీ, హిందూ వ్యాపారులనే ఎంచుకోండి..వారు కొంచెం ఎక్కువ వసూలు చేసినా సరే.
కేవలం ఒక నెలలో, మీ దేశం హిందూ దేశంగా మారుతుంది.ప్రతి హిందువుకు ఇలాంటి ఆలోచనా విధానం ఉండాలి, ఎందుకంటే ఒక చిన్న ఆలోచన చివరికి మీ ఉనికిని కాపాడే పెద్ద ఆలోచనగా మారుతుంది.
ఒక్కసారి ఈ విషయాలను కలిపి చూడండి, అప్పుడు జిహాదీలందరూ తలవంచకుండా ఉంటారా చెప్పండి.
|జై శ్రీ రామ్|| వందే మాతరం||
***
రెండు అంశాలు ఇమిడి ఉన్నాయి. ఒకటి ఆర్థికం. రెండవది సాంస్కృతికం. చల్లకు వచ్చి ముంత దాచడం ఎందుకు? అనుకున్నారేమో.. గత ఏడాది ప్రచారంలో పెట్టిన ‘విధర్మీయులు’ ఎవరో ఈ కొత్త సర్క్యులర్ లో స్పష్టత ఇచ్చేసారు. ఇందులో క్రిస్టియన్ల ప్రస్తావన లేకకపోయినా సంఘ్ పరివార్ దృష్టిలో క్రిస్టియన్లు కూడా విధర్మీయులే.
విధర్మీయులైన ముస్లింల వస్తువులు, సేవలను బహిష్కరించండి అని నిస్సిగ్గుగా హిందువులకు పిలుపునిస్తున్నారు. ఇదంతా హిందూ ధర్మ పరిరక్షణ కోసమని బుకాయిస్తున్నారు. ముస్లింల వస్తు, సేవలను బహిష్కరిస్తే హిందూ ధర్మం ఎట్లా రక్షించబడుతుందో! హిందూ ధర్మంలో అంతర్గతంగా ఉన్న వర్ణ, కుల అసమానతలను, దళితుల పట్ల అంటరానితనాన్ని, వివక్షతను పరిష్కరించకుండా హిందూ ధర్మ పరిరక్షణ ఎట్లా సాధ్యం? ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో దళితులకు ఆలయ ప్రవేశం నిషిద్దం. పెండ్లి బారాత్ లో దళితులు గుర్రం మీద ఊరేగితే శిక్షలకు గురి అవుతున్నారు. ఇప్పటికీ చాలా స్కూళ్ళలో దళితులు వండిన అన్నాన్ని తమ పిల్లలు తినడానికి తల్లిదండ్రులు నిరాకరిస్తున్నారు. తమది సనాతన ధర్మం అంటారు? సనాతన ధర్మం అంటే శూద్రులకు, అంటరానివారికి అమానుషమైన శిక్షలు ప్రవచించిన మనుధర్మ శాస్త్రమా? బ్రాహ్మణీయ వైదిక ధర్మమా? మరి బ్రాహ్మణీయ వైదిక ధర్మంలో వేళ్ళూనుకొని ఉన్న వర్ణ వివక్షను, యజ్ఞాలు, యాగాలలో జంతు బలిని, హింసను వ్యతిరేకించిన, పజల మధ్య సమానత్వాన్ని ప్రబోధించిన, వైదిక ధర్మాన్ని వ్యతిరేకిస్తూ తిరుగుబాటు జెండా ఎగరేసిన ‘బౌద్ధ ధర్మం ’ కూడా ఈ దేశంలో వైదిక ధర్మం అంత సనాతనమైనది. మరి బౌద్ధ ధర్మాన్ని సనాతన ధర్మంగా సంఘ్ పరివారీయులు అంగీకరిస్తారా?
ముస్లిం దేశాలైన సౌదీ అరేబియా, అరబ్ ఎమిరేట్స్, ఇరాక్, కువైత్, ఖతార్, ఒమాన్ ల నుంచి; క్రిస్టియన్ దేశాలైన రష్యా, అమెరికా నుంచి దిగుమతి అవుతున్న పెట్రోలియం ఉత్పత్తులను కూడా కొనవద్దని; విధర్మీయులైన చైనా నుంచి దిగుమతి అవుతున్న భారీ ఇంజనీరింగ్, యంత్ర పరికరాల దగ్గర నుంచి పతంగుల మాంజ దాకా.. అన్ని రకాలైన ఉత్పత్తుల మీద నిషేధం విధించమని భారత ప్రభుత్వానికి సంఘ్ పరివారీయులు సూచన చేయగలరా? ఒక దేశం మరొక దేశం ఉత్పత్తుల మీద ఆధారపడిన గ్లోబలీకరణ చెందిన ఈ ప్రపంచంలో ఇది అసాధ్యమని వారికి తెలియనిది కాదు. అయితే ప్రజల మధ్య వైషమ్యాలను పెంచి పోషించి, సామరస్యతను ధ్వంసం చేసి అధికారాన్ని సుస్థిరం చేసుకోవడం, ఫాసిస్టు మతతత్వ పునాదుల మీద దేశాన్ని నిలబెట్టాలన్న వారి ఆకాంక్ష ఈ సర్క్యులర్ లో స్పష్టంగా కనిపిస్తున్నది.
ముస్లిం కళాకారులు నటించిన /రచించిన /నిర్మించిన సినిమాలు చూడవద్దట. ముస్లింలు సమకూర్చిన సంగీతాన్ని వినవద్దట. మనం ఎంతో ఇష్టంగా, గౌరవంతో, గర్వంతో నేర్చుకునే, పాడుకునే, వినే హిందూస్తానీ సంగీతాన్ని కాపాడింది, అభివృద్ది చేసింది ముస్లిం ఉస్తాదులే. వారు మత భేదాలకు అతీతంగా తరం నుంచి తరానికి ఆ మహోన్నత సంగీత వారసత్వాన్ని అందిస్తున్నారు. భారత రత్న అందుకున్న పండిట్ భీంసేన్ జోషి గురువు గారు సవై గంధర్వ, అతని గురువు కిరాణా ఘరానా వ్యవస్థాపకుడు ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్. మరో భారత రత్నం సితార్ వాద్య విద్వాంసుడు పండిట్ రవిశంకర్ గురువు గారు ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్. రవిశంకర్ అతని అల్లుడు కూడా. కిరాణా, పాటియాలా, ఆగ్రా, గ్వాలియర్, భేండి బజార్, రాంపూర్, జైపూర్ తదితర హిందుస్తానీ సంగీత ఘరానాల వ్యవస్థాపకులు అందరూ ముస్లిం ఉస్తాదులే. మరి విధర్మీయులైన ముస్లిం ఉస్తాదులు అభివృద్ది చేసిన హిందుస్తానీ సంగీతాన్ని ఈ దేశంలో నిషేధించమని, వారి వద్ద శిష్యరికం చేసి, హిందుస్తానీ సంగీత శిరోమణులుగా ఎదిగిన ఇద్దరు పండిట్ లకు ప్రధానం చేసిన భారత రత్నాలను వాపస్ తీసుకోమని, కాశీలో గంగా నదిలో తన షెహనాయని సంప్రోక్షణ చేయకుండా దిన చర్య ప్రారంభించని షహనాయి వాద్య విద్వాంసుడు ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ కు ప్రధానం చేసిన భారత రత్నను రద్దు చేయమని భారత ప్రభుత్వానికి సంఘ్ పరివారీయులు సూచన చేయగలరా? హిందుస్తానీ సంగీత శిఖరాలైన ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్, ఉస్తాద్ అమీర్ ఖాన్, ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్.. మరెందరో ముస్లిం ఉస్తాదుల రాగాలు, టుమ్రీలను, వాద్య సంగీతాన్ని; నౌషాద్, ఖయ్యాం సినిమా సంగీతాన్ని వినవద్దని, రఫీ పాడిన పాటలను వినవద్దని, సాహిర్ లూద్వియాన్వి , కైఫీ ఆజ్మి, షకీల్ బదాయుని రచించిన సీనీ గేయాలను వినవద్దని, భారతీయ సినిమా రంగంలో అద్భుత కళాఖండాలుగా నిలిచిపోయిన మొఘల్ ఎ ఆజం, పాకీజా, మదర్ ఇండియా సినిమాలను చూడవద్దని వీరు భారత ప్రజలకు చెప్పగలరా?
నా అనుభవంలో మహారాష్ట్రా నుంచి ఇటువంటి సర్క్యులర్లు రావడం ఏడాది కాలంలో ఇది రెండవసారి. 2002 గుజరాత్ లో సంఘ్ పరివారీయులు ముస్లింల మీద జరిపిన జాతి హననానికి ముందు సరిగ్గా ఇటువంటి ప్రయోగమే జరిగిందని ఇవ్వాళ్ళ గుర్తుకు వస్తున్నది. మహారాష్ట్రా మరొక గుజరాత్ ప్రయోగ వేదిక కానున్నదా? అన్న అనుమానం కలుగుతున్నది.
శ్రీధర్ రావు దేశ్పాండే,
తెలంగాణా అస్తిత్వ వేదిక కో-ఆర్డినేటర్





