డ్రాపవుట్లు – అభ్యసనా సంక్షోభం

“దేశ వ్యాప్తంగా  కేవలం 5.4 శాతం పాఠశాలలే 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు నిరంతర విద్యా ప్రయాణాన్ని అందిస్తున్నాయి.రాజస్థాన్ మినహా  దేశం లో అన్నీ రాష్ట్రాలు జాతీయ సగటు కంటే తక్కువే ఉన్నాయి. వెస్ట్ బెంగాల్,,బీహార్,,ఉత్తర ప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రాలు అత్యయంత వెనుక బడి ఉన్నాయి.  తెలంగాణ లో ఇటు వంటి పాఠశాలలు కేవలం 974  (2.25 %) మాత్రమే ఉన్నాయి. ఈ గణాంకాలు విద్య పట్ల తల్లిదండ్రుల నుండి వస్తున్న డిమాండు గుర్తించని కారణంగా నిర్మాణాత్మక లోపాలను ఎత్తి చూపుతాయి..”

ఆందోళన కలిగించే నీతి ఆయోగ్ నివేదిక.

ఆర్. వెంకట రెడ్డి
సామాజిక కార్యకర్త

ఇటీవల నితి ఆయోగ్ విడుదల చేసిన “School Education System in India: Temporal Analysis and Policy Roadmap for Quality Enhancement” అనే  నివేదికలో  భారత పాఠశాల విద్యా వ్యవస్థలో గత దశాబ్దంలో చోటుచేసుకున్న మార్పులను గణాంకాలతో  విశ్లేషిచింది.  ఈ గణాంకాలను పరిశీలిస్తే కొన్ని విషయాలలో పురోగతి కనిపించినా  విద్యా వ్యవస్థలో రెండు ప్రమాదకర అంశాలైన సెకండరీ ,సేనియర్ సెకండరీ లో   డ్రాపవుట్లు మరియు అన్నీ తరగతుల  విద్యార్థులలో  అభ్యసన  సంక్షోభం ఒక  తీవ్రమైన నిర్మాణాత్మక సామాజిక అసమానతలు కొనసాగుతున్నాయని స్పష్టమవుతుంది.

విద్యా వ్యవస్థ నుండి నెట్టి వేయబడుతున్న బాలలు (డ్రాపవుట్స్)

దేశంలో సుమారు 7.3 (49%) లక్షల ప్రాథమిక పాఠశాలలు ఉన్నప్పటికీ, హయ్యర్ సెకండరీ స్థాయికి వచ్చే సరికి ఆ సంఖ్య కేవలం 1.64 (11.2%) లక్షలకు పడిపోతుంది. ఫలితంగా దేశ వ్యాప్తంగా చూస్తే   సీనియర్ సెకండరీ విద్య లో  (ఇంటర్ తో సమానం) GER( ఇంటర్ చదివే విద్యార్థుల జనాభాలో )  నూటికి కేవలం  58.4 విద్యార్థులు మాత్రమే నమోదు అయ్యారు. 36 రాష్ట్రాలు మరియు  కేంద్ర పాలిత ప్రాంతాలను  చూస్తే కేవలం 8 రాష్ట్రాలు మాత్రమే  (చండీగఢ్ ,పాండిచ్చేరి ,కేరళ. అందమాన నికోబార్ ఐలాండ్స్ ,హిమాచల్ ప్రదేశ్,తమిళనాడు ,దిల్లీ మరియు ఉత్తరఖండ్) 80.90% నుండి107.4%   తో అధిక   GER  నమోదు అయ్యాయి.   గుజరాత్,  బీహార్ , అస్సాం, , మధ్య ప్రదేశ్  ,జార్ఖండ్  లాంటి రాష్ట్రాలు  దేశం లో  50% కంటే  తక్కువ GER నమోదు తో దేశం లో చివరి స్థానం లో నిలిచాయి. తెలంగాణ 67.6% తో   మరియు ఇతర రాష్ట్రాలు  మద్య స్థానం లో ఉన్నాయి.

ప్రాథమిక స్థాయి నుండి  ఉన్నత విద్య వైపు వెళ్ళే కొద్ది  సగానికి ఎక్కువ మంది  పిల్లలు బడులు మానేస్తున్నారు. ఇది కేవలం “డ్రాప్‌అవుట్” అనే గణాంక సమస్య కాదు. ఇది వ్యవస్థాత్మక వెలివేతకు నిదర్శనం. దీనికి ప్రధాన కారణం పాఠశాలల  నిర్మాణాత్మక విభజన అని గణాంకాలతో వివరించింది.దేశ వ్యాప్తంగా కేవలం 5.4 శాతం పాఠశాలలే 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు నిరంతర విద్యా ప్రయాణాన్ని అందిస్తున్నాయి.రాజస్థాన్ మినహా  దేశం లో అన్నీ రాష్ట్రాలు జాతీయ సగటు కంటే తక్కువే ఉన్నాయి. వెస్ట్ బెంగాల్,,బీహార్,,ఉత్తర ప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రాలు అత్యయంత వెనుక బడి ఉన్నాయి.  తెలంగాణ లో ఇటు వంటి పాఠశాలలు కేవలం 974  (2.25 %) మాత్రమే ఉన్నాయి. ఈ గణాంకాలు విద్య పట్ల  తల్లిదండ్రుల నుండి వస్తున్న  డిమాండు గుర్తించని కారణంగా నిర్మాణాత్మక లోపాలను ఎత్తి చూపుతాయి.

  బడి మానిన  పిల్లలు  బాల కార్మికులుగా , వలస కూలీలుగా, అనాధలుగా వీధి బాలలుగా, బాల్య వివాహాల బంధిలో కోడళ్ళు గా,కూలీలుగా మారుతున్నారు.  “పాఠశాల మానేయడం” కాదు; విద్యా వ్యవస్థ లో ఉన్న లోపాలతో పాటు పలు ఇతర  కారణాలతో పాఠశాలల నుండి  ‘నెట్టి  వేయ బడుతున్నారు’. నీతి అయోగ్ దృష్టి పెట్టవసిన మరో ముఖ్యమైన అంశం  నిర్మాణాత్మక విభజన తో పాటు డిజిటల్ పరిపాలన కూడా ఒక ప్రధాన కారణం అని  క్షేత్ర స్థాయి పరిశీలనలు తెలుపుతున్నాయి.

ధృవీకరణ పత్రాలు లేక పాఠశాలల నుండి దూరం: డిజిటల్ పాలన ప్రభావం

డిజిటల్ పాలన పేరుతో ప్రతి అంశం ఆన్ లైన్ సేవలు ముందుకు వచ్చాయి. ఈ విధానం పరిపాలన సౌలభ్యం కావచ్చు కానీ పేదల(అత్యధిక శాతం ఏసీ ఎస్టీ ఓబీసీ )  పిల్లలను  పాఠశాలలో ప్రవేశాలకు దూరం చేస్తున్నాయి అని చెప్తే అంగీకరించే స్థాయిలో పాలన వ్యవస్థ (జెనజీ తరం  అధికారులు) లేదు. జనన ధృవీకరణ పత్రాలు( డేట్ ఆఫ్ బర్త్ ) ఆధార్ కార్డులు (డేట్ ఆఫ్ బర్త్ ఉంటేనే), కుల ,నివాస ,ఆదాయ  దృవీకరణ పత్రాలు,తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాలు ( నగదు బదిలీ కోసం ) వంటి తప్పనిసరి చేయడంతో అనేక మంది  సెకండరీ విద్యను అందుకోలేక పోతున్నారు.

తండ్రి పేరు తల్లి పేరు లేదా ఇంటి పేరు  తో పిల్లల పేర్లు అక్షర దోషాలతో  ఆధార్ లో మ్యాచ్ కావడం లేదని అందుకు  సిస్టమ్ అనుమతించడం లేదని పిల్లల పేర్లు నమోదు కావడం లేదు. ఈ పత్రాలు తేవడానికి గ్రామ స్థాయి నుండి బ్లాక్ దాకా తిరిగి తిరిగి అలసి పోయి తమ పిల్లలు బడి మానేయడమే మేలనుకునే కుటుంబాలు చాలానే ఉన్నాయి. ప్రైవేటు వదిలి ప్రభుత్వ బడికి లేదా మరో బడికి మారాలంటే ఆన్ లైన్ లో  డ్రాప్ బాక్స్ లో పిల్లల పేరు వేయక పోతే మరో పాఠశాల అంగీకరించాడు. విచిత్రమేమిటంటే ఉపాధ్యాయులు అంగీకరించినా కంప్యూటర్ అంగీకరించదు.

 అలాగే పదవ తరగతి రిజల్ట్స్ వంద శాతం రావలనే ఉపాధ్యాయుల పై  విద్యా శాఖ వత్తిడి తో చదువులో నెమ్మదిగా నేర్చుకునే వారిని నిరుత్సాహ పరిచి టి సి లు ఇచ్చి  బడి నుండి పంపి వేయడం . ఇలాంటి పరిస్థితులు అనేక రాష్ట్రాలలో ఉంది. ముఖ్యంగా తక్కువ స్థూల నమోదు నిష్పత్తి (GER) ఉన్న అన్నీ రాష్ట్రాలలో నీతి అయోగ్ ఒక పరిశోధన  చేయవలసి ఉంది.

ధృవ పత్రాలను అందచేసే బాధ్యత   ప్రభుత్వ యంత్రాంగమే తీసుకోవాలి. ఆ బాధ్యత పిల్లల పై వేయొద్దు. పిల్లల విద్య పట్ల రాజకీయ సంకల్పం ఉంటే ఇది పెద్ద విషయం కాదు. లేదా ధృవీకరణ పత్రాల కు పిల్లల చదువులకు లింక్ తీసివేసి ప్రవేశాలను సులభం చేయాలి.

అభ్యాసనా  సంక్షోభమా! బోధన సంక్షోభమా!!

ఈ నివేదిక లోని  మరో  అత్యంత ఆందోళన కలిగించే అంశం. , చాలా మంది పిల్లలు ఇంకా సరైన పఠన సామర్థ్యం, గణిత అవగాహన, భావనాత్మక నేర్చుకోవడం వంటి ప్రాథమిక నైపుణ్యాలను పొందలేకపోతున్నారని నివేదిక పేర్కొంటోంది. అనేక సంవత్సరాలు పాఠశాలకు వెళ్లిన తర్వాత కూడా పిల్లలు తమ తరగతికి తగిన స్థాయిలో చదవలేకపోవడం  విద్యా వ్యవస్థ ముందున్న అత్యంత పెద్ద సవాలు. అయితే ఈ అభ్యాస లోపాలను కేవలం బోధనా సమస్యగా మాత్రమే చూడకూడదు.అలాగే పిల్లలను బాధ్యులను చేయకూడదు.  పేద కుటుంబాలకు చెందిన పిల్లలు పాఠశాలకు వచ్చే సమయానికే అనేక అసమానతలకు గురి అవుతూ  వస్తారని గమనించాలి. పిల్లలు ‘నేర్వగలరని’ ఉపాధ్యాయులు ‘నేర్ప గలరనే’  రాజీ లేని సూత్రం తో విధానాలను రూపొందించాలి. అప్పుడే ఈ సంక్షోభాన్ని పరిష్కరించగలము.

అందుబాటులో లేని ప్రీ ప్రైమరీ విద్య:

ప్రీ ప్రైమరీ విద్య ప్రాముఖ్యత గురుంచి నివేదికలో ప్రస్తావించింది. దేశంలో ప్రీ -ప్రైమరీ  విద్య ఇంకా అసమానంగా అందుబాటులో ఉంది. పట్టణ మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు ప్రైవేట్ ప్రీ-స్కూల్స్, ప్రాథమిక అభ్యాస కేంద్రాలు లభిస్తున్నప్పటికీ, కోట్లాది పేద పిల్లలు పూర్తిగా అంగన్‌వాడీ వ్యవస్థపై ఆధారపడుతున్నారు. అయితే అనేక అంగన్‌వాడీలు తగిన వనరులు, శిక్షణ, మౌలిక సదుపాయాలు లేకుండా పనిచేస్తున్నాయి. దీనివల్ల పిల్లలు మొదటి తరగతిలో అడుగు పెట్టే సమయానికే అసమాన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రతి పాఠశాలలో 3 నుండి 5 సంవత్సరాల బాలలకు  నర్సరీ ,ఎలకేజీ ,యూకేజీ లుగా ప్రతి తరగతికి శిక్షణ పొందిన టీచర్లు  మరియు బోధనేత సిబ్బంది ఉండాలి. దీనికి బడ్జెట్ లో తగిన నిధులను కేటాయించాలి.

మొత్తంగా దేశంలో విద్యా అసమానతను కేవలం జాతీయ సగటుల ద్వారా అర్థం చేసుకోవడం సాధ్యం కాదు.  గిరిజన బాలికలు , ఉత్తర భారతం నుండి దక్షిణాది రాష్ట్రాలకు వస్తున్న   వలస కుటుంబానికి చెందిన బాలలు, పట్టణ బస్తీలో నివసించే పేద పిల్లలు, గిరిజన గ్రామాలలో నివసించే పిల్లలు, లేదా  ప్రత్యేక సామర్ధ్యాలు గల బాలలు   అనుభవించే  విద్యా వివక్షత  పూర్తిగా భిన్నంగా ఉంటుందని గమనించాలి.

 మౌలిక వసతుల కల్పనలో  తీవ్ర అసమానతలు:

మౌలిక సదుపాయాలపై  ఇచ్చిన సమాచారం  రాష్ట్రాల మధ్య, గ్రామీణ-పట్టణ ప్రాంతాల మధ్య, ప్రభుత్వ-ప్రైవేట్ పాఠశాలల మధ్య తీవ్రమైన అసమానతలు కొనసాగుతున్నాయి.డిజిటల్ మౌలిక సదుపాయాల విషయంలో  కొత్త విద్యా అసమానతను సృష్టించే ప్రమాదం ఉంది. విద్యపై ప్రభుత్వ వ్యయం గురించి కూడా ఆందోళన కలిగించేదిగా ఉంది. సరిపడిన ప్రజా పెట్టుబడి లేకుండా విద్యా సంస్కరణలు కేవలం విధాన పత్రాలకే పరిమితమయ్యే ప్రమాదం ఉంది.

నీతి అయోగ్ నివేదిక లో లేవనెత్తిన అనేక  సవాళ్లను ఎదురుకోవాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఈ క్రింది చర్యలు చేపట్టాలి.

  • బాలలకు రాజ్యాంగం కల్పించిన విద్యా హక్కు చట్టాన్ని 3 నుండి 18 సంవత్సరాలకు పెంచి  రాజ్యాంగ  సవరణ చేయాలి.
  • 1 నుండి  12 వ తరగతి వరకు ఒకే ప్రాంగణం లోనడిచే పాఠశాలలను   అందుబాటులోకి  తేవాలి. అలాగే  ఎక్కువ ప్రాంతాలకు విస్తరించాలి.
  • దేశ వ్యాప్తంగా సిలబస్ ను పాఠ్య పుస్తకాలను పక్కన పెట్టి అన్నీ తరగతుల విద్యార్థులకు కనీస విద్యా సామర్ధ్యాలు అందించిన తరువాతనే  తరగతి వారి సామర్ధ్యాల(సిలబస్ ) పై దృష్టి పెట్టాలి.
  • పిల్లలు నేర్వ గలరు ఉపాధ్యాయులు నేర్పగలరు అని   విద్యార్థుల పై ఉపాధ్యాయుల పై నమ్మకం తో విధానాలు రూపొందించాలి.
  • దేశ వ్యాప్తంగా అన్నీ పాఠశాలలో ప్రీ  ప్రైమరీ విద్యను ప్రారంభించాలి.
  • ప్రత్యేక అవసరాల పిల్లల విద్యను కొనసాగడానికి అన్నీ వసతులు ఏర్పాటు చేయాలి.
  • దేశ వ్యాప్తంగా నమోదు ఎక్కువగా ఉన్న పాఠశాలలో అన్నీ మౌలిక వసతులు మరియు బోధన బోధనేతర సిబ్బందిని అత్యవసరంగా ఏర్పాట్లు చేయాలి.
  •  పలు కమిటీలు ,విద్యా కమిషన్లు సూచించి నట్లుగా విద్యా బడ్జెట్  జీడీపీ లో 6% శాతానికి పెంచాలి.

చివరగా సమానమైన విద్య అంటే ఆయా నివాస ప్రాంతాలలో నివసిస్తున్న  అన్నీసామాజిక  వర్గాల పిల్లలు ఒకే  పాఠశాలకు వెళ్ళి   సమానత్వం,  స్వేచ్ఛ,  గౌరవం,  అనుభవిస్తున్నారా అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. అదే భారత విద్యా వ్యవస్థ ముందు నిలిచిన అసలు సవాలు.వచ్చే తరాలకైనా ఇలాంటి విద్య అందుతుందని ఆశిద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *