రైతు పక్షపాతిగా మరోసారి నిరూపించుకున్న వేళ..
ఇంత త్వరగా అమలుపై రైతాంగం, మేధావి వర్గం ఆశ్చర్యం…ఆనందం
హామీని నిలబెట్టుకోవడంతో తన జన్మ ధన్యమైందన్న సిఎం రేవంత్
మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్, జూలై 30 : రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన హామీ మేరకు మంగళవారం రెండవ విడుత రుణమాఫీని అందజేయడం ద్వారా కాంగ్రెస్ మరోసారి రైతు పక్షపాతిగా నిరూపించుకుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పద్దెనిమిది లక్షల మంది రైతాంగం రుణ విముక్తి పొందినట్లైంది. దీంతో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిన అతిపెద్ద వాగ్ధానాన్ని నెరవేర్చినట్లైంది. 2022 మే 6న ‘వరంగల్ రైతు డిక్లరేషన్’ పేరున రాష్ట్రంలోని రైతాంగానికి సంబంధించి రెండు లక్షల రూపాయల వరకున్న బ్యాంకు రుణాలన్నిటినీ మాఫీ చేస్తామని చారిత్రాత్మక ఓరుగల్లులోని ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో, ఆ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ ్‌గాంధీ సమక్షంలో నేటి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కుంటున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇది సాధ్యం కాదని అధికార బిఆర్‌ఎస్‌తోపాటు ఇతర పక్షాలు పెదవి విరిచాయి. కాని, కాంగ్రెస్ మాట ఇచ్చిందంటే అది శిలాసాసనమేనని ఆనాడు నొక్కి వక్కాణించిన రేవంత్‌రెడ్డి నేడు ముఖ్యమంత్రి హోదాలో తన మాటను నిలుపుకోవడం నిజంగా సంతోషించాల్సిన విషయం.
రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రైతులు ఎదుర్కుంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం ఇంత త్వరగా అమలవుతున్న తీరుకు రైతాంగాన్నే కాదు, రాష్ట్రంలోని మేధావి వర్గాలను కూడా ఆశ్చర్యపరుస్తున్నది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు ధనిక రాష్ట్రంగా ఉండిరది. కాని, బిఆర్‌ఎస్ పదేళ్ళ పాలనలో తలకు మించిన అప్పుల భారాన్ని మోస్తున్న దిశలో రైతు రుణమాఫీ మాటను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవడం నిజంగా అభినందించాల్సిన విషయం. వాస్తవంగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అనేక వాగ్ధానాలు చేసింది. వాటన్నిటినీ వందరోజుల్లోగా అమలు చేస్తామని ప్రజాముఖంగానే ప్రకటించింది. అయితే కోట్లాది రూపాయల రుణమాఫీ విషయంలో నిధులు సమకూర్చుకోవడానికి ఈ ప్రభుత్వానికి దాదాపు ఎనిమిది నెలల సమయం పట్టినప్పటికీ కేవలం పన్నెండు రోజుల వ్యవధిలోనే దాదాపు పన్నెండు వేలకోట్ల రూపాయలతో వేలాది రైతులను రుణ విముక్తులను చేసింది. ఈ సంవత్సరం జూలై 18న మొదటిసారిగా 6,098 కోట్ల రూపాయలతో పదకొండున్నర లక్షల మంది అప్పులను తీర్చగా, తాజాగా ఇదే నెల చివరన అంటే జూలై 30న 6,198 కోట్ల రూపాయలతో మరో ఆరున్నర లక్షల మంది రైతులను రుణ విముక్తి చేయడంతో రాష్ట్రంలోని రైతుల్లో పండగ వాతావరణం చోటుచేసుకుంది.
మొదటి విడుతలో కేవలం లక్షలోపు రుణాలున్న వారి అప్పులను తీర్చగా, రెండవ విడుతలో లక్ష నుండి లక్షన్నర అప్పులున్నవారిని రుణవిముక్తులను చేసిందీ ప్రభుత్వం. కాగా మూడవ (చివరి) విడుతలో రెండు లక్షల వరకు అప్పులున్న వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగస్టు 15వ తేదీని డెడ్‌లైన్‌గా పేర్కొనడం గమనార్హం. వాస్తవంగా ఇంత పెద్దఎత్తున రైతుల రుణమాఫీని స్వాతంత్య్రం తర్వాత బహుషా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసి ఉండదు. ఈ మూడు విడుతల రుణ మాఫీ కోసం రాష్ట్ర ప్రభుత్వం 31వేల కోట్ల రూపాయలను బ్యాంకులకు చెల్లించడం చారిత్రకాంశం కూడా. అది కూడా ఒకేసారి బ్యాంకులకు ఏకమొత్తంలో ప్రభుత్వం చెల్లించడం కూడా బ్యాంకుల చరిత్రలో కూడా బహుషా ఇదే మొదటి సారి అయివుంటుంది. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ ప్రకటించినప్పటికీ విడుతలవారీగా నిధులు విడుదల చేయడంవల్ల రైతాంగానికి పెద్దగా ఉపకరించలేదు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో రుణమాఫీ చేయడం ద్వారా రైతులకు ఎలాంటి నష్టం, కష్టం ఉండదని భావించింది. కాంగ్రెస్ అధికారం చేపట్టేనాటికీ రాష్ట్రం ఏడు లక్షలకోట్ల రూపాయల అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉంది. అయినప్పటికీ రైతులకు ఇచ్చిన హామీ మేరకు కేవలం 12 రోజుల్లోనే 12వేల కోట్ల రూపాయలతో సుమారు పన్నెండు లక్షల రైతుకుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడం ద్వారా వారి కళ్ళలో ఆనందాన్ని చూస్తున్నామంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.
రాజకీయ ప్రయోజనం కన్నా, తమకు రైతు ప్రయోజనమే ప్రధానమని భావించడం వల్లే రాజకీయ పార్టీలకు అతీతంగా రైతులందరికీ ఏకకాలంలో రుణమాఫీ వర్తించేలా చర్యలు తీసుకున్నామని రెండవ విడుత రుణమాఫీ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్‌రెడ్డి పేర్కొనడం గమనార్హం. ఇటీవల కాలంలో ఎలాంటి ఎన్నికలు లేకున్నా తామిచ్చిన హామీని నిలబెట్టుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, దీని ద్వారా తమ జన్మ ధన్యమైందని, ఇది భారతదేశ చరిత్రలో రికార్డుగా నిలిచిపోతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుండీ వ్యవసాయ రంగానికి ప్రాధాన్యమిస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. స్వాతంత్య్రానంతరం మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఈ రంగానికే ప్రాధాన్యత నివ్వగా, లాల్ బహద్దూర్ శాస్త్రి జై జవాన్, జై కిసాన్ అన్న నినాదం తీసుకున్నారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ సామాన్య రైతాంగానికికూడా బ్యాంకుల సహకారం అందేందుకు బ్యాంకుల జాతీయ కరణచేయగా, మన్‌మోహన్‌సింగ్ ఆహార భద్రత, వ్యవసాయరంగంతో ముడివడి ఉన్న వాటన్నిటికి సబ్సీడీలను కల్పించడం, బీమా సదుపాయం, మద్దతు ధర చట్టబద్ధత చేయడం లాంటి చర్యలతో కాంగ్రెస్ అంటేనే రైతాంగ ప్రభుత్వం అన్న నానుడి కల్పించిన విషయాన్ని రేవంత్‌రెడ్డి గుర్తుచేస్తున్నారు.