నియోజవర్గ అభివృద్ధికి సహకరించాలని వినతి
రాజకీయాల కతీతంగా నిధులు మంజూరు చేస్తామని మంత్రి హామీ
భేటీపై సర్వత్రా చర్చ…కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 6 : రంగారెడ్డి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి శ్రీధర్‌బాబును శనివారం భారాస ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, వివేకానందగౌడ, అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, లక్ష్మారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి కలిశారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలను ఎమ్మెల్యేలు మంత్రికి అందజేశారు. జీహెచ్‌ఎంసీకి నిధులు విడుదల చేయాలని కోరారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి జీహెచ్‌ఎంసీకి నిధులు ఇవ్వలేదని మంత్రి దృష్టికి తెచ్చారు. శనివారం సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబును ఈ ఆరుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కలిసి అభివృద్ధి పనులు ప్రతిపాదనలను మంత్రి శ్రీధర్ బాబుకు అందించారు.
జీహెచ్‌ఎంసీకి నిధులు విడుదల చేయాలని మంత్రిని కోరారు. కూకట్ పల్లి నియోజకర్గంలోని చెరువులు, కుంటల్లో పెరిగిపోయిన గుర్రపు డెక్క తొలగించాలని.. దోమలను నివారించాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు. నియోజకర్గంలోని అన్ని డివిజన్ లలో ఎలక్టిక్రల్ పోల్స్, వీధి దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. కూకట్ పల్లి, మూసాపేట్ సర్కిళ్ళ పరిధిలో నెలకొన్న శానిటేషన్ సమస్యలు పరిష్కరించాలని, అలాగే కూకట్ పల్లి నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు.
ఎమ్మెల్యేల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు రాజకీయాలకు అతీతంగా పనులు చేయడం జరుగుతుందన్నారు. తప్పకుండా వారి సమస్యలను తీరుస్తామని హావి• ఇచ్చారు. ఇదిలావుంటే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మంత్రిని కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఏడుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరిన క్రమంలో ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా రేపో మాపో బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరుగుతుంది. బీఆర్‌ఎస్‌కు చెందిన 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారని ఇప్పటికే పలువురు మంత్రులు చెప్పిన సంగతి తెలిసిందే..