మరో వెయ్యేళ్లు కాంగ్రెస్ మ‌నుగ‌డ‌

  • ప్రజల తరఫున పోరాడుతుంది
  • నా కథలో కేసీఆర్ రావణాసురుడు
  • కేటీఆర్‌ది మేనేజ్‌మెంట్ కోటా
  • అమిత్ షాకు ధైర్యముంటే హైదరాబాద్ నుంచి అసదుద్దీన్ పై గెల‌వాలి 
  • దేశ జీడీపీలో తెలంగాణ వాటా 10 శాతానికి చేర్చడమే లక్ష్యం 
  • అంతర్జాతీయ విద్యా సంస్థల క్యాంపస్‌లకు వేదిక‌ తెలంగాణ
  • స్కిల్స్ యూనివర్సిటీతో 100 శాతం ఉద్యోగాలు
  • ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర‌ నవంబర్ 20: దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని, ప్రజలు ఉన్నన్ని రోజులు, మరో వెయ్యేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ మనుగడలో ఉంటూ ప్రజల తరఫున పోరాడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్ర‌వారం విలేకరులతో జరిగిన చిట్‌చాట్ లో ఆయన జాతీయ, రాష్ట్ర రాజకీయాలు, ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళికలు, ప్రతిపక్షాల విమర్శలపై ఘాటుగా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వొచ్చాక ఈడీ, సీబీఐ, ఇన్‌కమ్ ట్యాక్స్ వంటి సంస్థలను ముందుకు తెచ్చారని, జాతి, మతం, భాష పేరుతో విభేదాలు సృష్టించారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. 12 ఏళ్లలో మోదీ సృష్టించిన భయాన్ని యువత 12 రోజుల్లోనే తొలగించిందని వ్యాఖ్యానించారు. పేదల ఓటు హక్కును తొలగించే ప్రయత్నం జరుగుతోందని, రాహుల్ గాంధీ చేపట్టిన ‘ఓట్ చోర్.. గద్దీ చోర్’ నినాదానికి అందరి మద్దతు లభిస్తోందని అన్నారు. మోదీకి ముందున్న ప్రధానమంత్రులందరూ కలిపి రూ. 53 లక్షల కోట్ల అప్పు చేస్తే, మోదీ ఒక్కరే ఈ 12 ఏళ్లలో రూ. 120 లక్షల కోట్ల అప్పు చేశారని సీఎం విమర్శించారు. మోదీ ప్రభుత్వ నిధులను అదానీ జేబులో వేస్తుంటే, తాను మాత్రం అదానీ జేబులో నుంచి నిధులను తీసుకొచ్చి తెలంగాణ అభివృద్ధికి, యువత ఉపాధికి ఖర్చు చేస్తున్నానని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ‘విజిటింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా’గా మారారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీజేపీ ఉనికి లేదని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్ కూడా దక్కలేదని గుర్తు చేశారు. అమిత్ షాకు ధైర్యం ఉంటే హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి అసదుద్దీన్ ఓవైసీని ఓడించాలని సవాల్ విసిరారు.

మోదీతో భేటీ, రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలు

ప్రభుత్వ ప్రయోజనాలే ముఖ్యం: రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినైనా కలుస్తానని, అవసరమైతే కేసీఆర్‌ను కూడా కలుస్తానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఎవరికీ చెప్పకుండా పాకిస్థాన్‌కు వెళ్లి బిర్యానీ తిని వచ్చారని, అలాంటిది తాను ఖేలో ఇండియా (8,000 మంది క్రీడాకారులు పాల్గొనే క్రీడలు), గ్లోబల్ సమ్మిట్ ఆహ్వానం కోసం ప్రధానిని కలిస్తే తప్పేమిటని ప్రశ్నించారు. తాను తన మర్యాద చూపించానని, సమ్మిట్‌కు రావాలా వద్దా అన్నది మోదీ ఇష్టమని అన్నారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు పెట్టుబడిదారులందరినీ ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
తమ ప్రభుత్వం మూడు ఏళ్లలో 65 శాతం హామీలను అమలు చేసిందని, వొచ్చే రెండేళ్లలో మిగిలిన వాటిని పూర్తి చేస్తామని చెప్పారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి చేర్చడమే లక్ష్యంగా ‘తెలంగాణ రైజింగ్ 2047’ పాలసీని తీసుకొచ్చామని వెల్లడించారు. ఇప్పటికే ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీని తీసుకొచ్చామని, త్వరలో రొనాల్డోను కూడా తెలంగాణకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

కేటీఆర్‌ది మేనేజ్‌మెంట్ కోటా

కేటీఆర్‌ను తాను సీరియస్‌గా తీసుకోనని, ఆయనది ‘మేనేజ్‌మెంట్ కోటా’ అని సీఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. తండ్రిని అడ్డం పెట్టుకుని నాయకుడైన కేటీఆర్ పేరు ఎత్తడం కూడా తనకు ఇష్టం లేదని, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను మాత్రమే తాను పోటీ నేతగా భావిస్తానని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు ‘ఫూల్స్ ప్యారడైజ్’లో ఉన్నారని, నిన్ననే సిద్దిపేటకు వెళ్లి కాంగ్రెస్ జెండా ఎగురవేశామని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలి కాబట్టే ఆ పార్టీని కొనసాగిస్తున్నామని, లేదంటే ఎప్పుడో ఖాలీ చేసేవాళ్లమని వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయింపులను ప్రారంభించిన కేసీఆర్‌ను ఇప్పుడు అదే అంశం చుట్టుకుందని అన్నారు. తన కథలో కేసీఆర్ రావణాసురుడని పేర్కొన్నారు. తాను ఏబీవీపీ నుంచే ప్రస్థానం ప్రారంభించానని, 17 ఏళ్లలోనే స్వయం శక్తితో ముఖ్యమంత్రి అయ్యానని, దేశానికి రాహుల్ గాంధీ అవసరం ఉన్నందునే కాంగ్రెస్‌లోకి వచ్చానని తెలిపారు.

నియోజకవర్గాల పునర్విభజనపై ఆందోళన

లోక్‌సభ సీట్లను 50 శాతం పెంచడం వల్ల కేవలం ఉత్తర భారతదేశ సీట్లతోనే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి వస్తుందని, దక్షిణ భారతదేశ అవసరమే లేకుండా పోతుందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. జనాభాతో పాటు రాష్ట్రాల జీడీపీ ప్రాతిపదికన సీట్ల పెంపు ఉండాలని తాను కోరానని తెలిపారు. మహాత్మా గాంధీ, నెహ్రూ పేదల అభ్యున్నతే అభివృద్ధిగా భావించారని, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ముందుకు నడిపించారని కొనియాడారు.

విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు..

ప్రైవేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ నాణ్యమైన విద్యను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని 27 లక్షల మంది విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందిస్తుండటంతో ప్రభుత్వ బడుల్లో హాజరు శాతం గణనీయంగా పెరిగింది. పదో తరగతి తర్వాత ఇంటర్ కాలేజీలు దూరంగా ఉండటం వల్ల పెరుగుతున్న డ్రాప్‌అవుట్స్‌ను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ బోర్డు ఛైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందే విద్యార్థులకు వంద శాతం ఉద్యోగాలు లభిస్తున్నాయని సీఎం తెలిపారు.

రూ. 4 వేల కోట్లతో ఐటీసీల ఆధునీకరణ

పాతకాలపు కోర్సులు కొనసాగుతున్న ఐటీఐలను రూ. 4,000 కోట్ల వ్యయంతో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా (ఐటీసీ) మారుస్తున్నారు. ఇందులో టాటా సంస్థ 86 శాతం నిధులను వెచ్చిస్తోంది. మా విద్యార్థులు కేవలం సంస్థల్లో పనిచేయడమే కాకుండా, కొత్త సంస్థలనే స్థాపించే స్థాయికి ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమ‌ని అన్నారు. రాష్ట్ర విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను చేరువ చేసే క్రమంలో భాగంగా, త్వరలోనే ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ వంటి ప్రపంచ ప్రఖ్యాత విద్యా సంస్థలు తెలంగాణలో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేయబోతున్నాయని ముఖ్యమంత్రి వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *