ఐఐటీ పదాన్ని పరిచయం చేసిన చుక్కారామయ్య

  • తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న గొప్ప మనీషి
  • ఆయనకు సమకాలీనుడు లేడు
  • చుక్కా రామయ్యకు వందో జన్మదిన శుభాకాంక్షలు
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 20: చుక్కా రామయ్య (Chukka Ramaiah) వందవ జన్మదినోత్సవం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, విద్యా వ్యవస్థకు గొప్ప పర్వదినమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విద్యావేత్త చుక్కారామయ్య వందవ జన్మదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన మాట్లాడారు. స్వాతంత్య్ర ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో,  పాల్గొన్న చరిత్ర చుక్కా రామయ్యది. ఐఐటీ అనే ప‌దాన్ని రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు, విద్యార్థుల‌కు ప‌రిచ‌యం చేసిన‌ గొప్ప విద్యావేత్త. గొప్ప విద్యావేత్తగా, సామాజిక పరివర్తన తీసుకువచ్చిన చుక్కా రామయ్య వందేళ్లు పూర్తి చేసుకోవడం గర్వంగా భావించాల్సిన సందర్భం. విద్యావేత్తగానే కాకుండా శాసనమండలి సభ్యుడిగా తనదైన ముద్రను ఈ ప్రాంతంపైన‌ వేశారు.
ఎమ్మెల్సీగా చుక్కా రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి వారితో పనిచేశాను.. ఈ విషయాన్ని నేను గొప్పగా చెప్పుకుంటానన్నారు. సామాజిక సమస్యలతో పాటు ప్రజల సమస్యలపై ప‌దునైన ప్ర‌శ్న‌ల ద్వారా  ప్రభుత్వాన్ని నిలదీసి, పరిష్కారం ఏ విధంగా ఉండాలో కూడా సూచించేవారు. రాజకీయ నాయకులు ఉకదంపుడు ఉపన్యాసాలు కాకుండా సమస్య పరిష్కారం కోసం మాట్లాడాలి.సమస్యలను ప్రస్తావించడంతో పాటు వాటి పరిష్కార మార్గాలు చెప్పేవారు కొంతమందే ఉన్నారు. వారిలో చుక్కా రామయ్య ఒకరు. చట్టసభల్లో పార్టీ బలంతో నిమిత్తం లేకుండా చుక్కా రామయ్య, నాగేశ్వర్ లాంటి వారికి మాట్లాడటానికి సమయం ఇచ్చేవారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో డిగ్రీ కాలేజీలు లేని విషయాన్ని అప్పట్లో వారు మండలిలో ప్రస్తావించేంత వరకు ఎవరికీ తెలియదు.వాళ్ల ప్ర‌స్తావ‌న త‌ర్వాతే ప్ర‌భుత్వం ఒక నిర్ణ‌యం తీసుకున్న‌ది. చుక్కా రామయ్య మరింత ఆరోగ్యంతో ఉండి మా అందరికీ స్ఫూర్తి ఇవ్వాలని కోరుకుంటున్నాను.
పీవీ నరసింహారావు, జైపాల్ రెడ్డి, రావి నారాయణరెడ్డి, చుక్కా రామయ్య వంటి గొప్ప వ్య‌క్తులు ఉన్నారని తెలంగాణ ప్ర‌జ‌లు చెప్పుకుంటారు.కాలం, రాజకీయాలకు వీరు అతీతులు. ప్రజల పట్ల వారికున్న అంకితభావం, చిత్తశుద్ధి వల్ల కొంతమంది విషయంలో రాజకీయ నాయకులు ఏకాభిప్రాయంతో ఉంటారు. చుక్కా రామ‌య్య స‌మ‌కాలీకులు తెలంగాణ లేరు.. ఆయ‌న అతీతుడు. చుక్కా రామయ్యతో కలిసి చట్టసభల్లో పనిచేయడం నా అదృష్టం.వారి ఆలోచ‌న‌లు, సూచనలు, సలహాల మేరకు ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *