- మినీ స్టాఫ్ ఆఫీసర్స్ భేటీలో డీజీపీ సీవీ ఆనంద్ దిశానిర్దేశం
- 2,000 హోంగార్డుల నియామకం, వార్షిక శిక్షణ క్యాలెండర్‌పై చర్చ
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 20 : నిర్ణీత సమయంలో లక్ష్యాలను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని డీజీపీ సీవీ ఆనంద్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పోలీస్ శాఖలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, అభివృద్ధి ప్రణాళికలు, సిబ్బంది సంక్షేమంపై డిజిపి సి.వి. ఆనంద్ శుక్రవారం మినీ స్టాఫ్ ఆఫీసర్స్ సమావేశం నిర్వహించి పలు కీలక అంశాలపై చర్చించారు. వొచ్చే నెలలో నిర్వహించనున్న పోలీస్ రిట్రీట్, మహిళా పోలీస్ అధికారుల సదస్సు, నూతన తెలంగాణ పోలీస్ మాన్యువల్ రూపకల్పన పూర్తి చేసి విడుదల చేయడం, పోలీస్ బ్రాస్, పైప్ బ్యాండ్లను పునరుద్ధరించడం వంటి అంశాలపై చర్చించారు.
రాష్ట్ర స్థాయి డ్యూటీ మీట్ నిర్వహణ, ఆల్ ఇండియా పోలీస్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణపైనా సమీక్షించారు. రాష్ట్ర పోలీస్ శాఖకు సంబంధించి వార్షిక శిక్షణ క్యాలెండర్ సిద్ధం చేయడం, 2,000 మంది హోంగార్డుల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్, ఇతర వివరాలు, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా తెలంగాణ పోలీస్ శాఖ మంజూరైన సిబ్బంది సంఖ్యను పునఃసమీక్షించడం వంటి అంశాలను పరిశీలించారు. రిటైర్డ్ పోలీస్ అధికారుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించారు. సమావేశంలో చర్చించిన ప్రతి అంశానికి సంబంధించి అధికారులకు నిర్దిష్ట బాధ్యతలు అప్పగించడంతోపాటు, పనుల పూర్తికి గడువులు కూడా నిర్ణయించారు. నిర్ణీత సమయంలో లక్ష్యాలను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని డిజిపి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిజి విమెన్ సేఫ్టీ వింగ్ డా. సౌమ్య మిశ్రా, టీజీపీఏ డైరెక్టర్ అభిలాష బిస్తు, డిజి,ఎసిబి & సిఐడి చారు సిన్హా, టీజీఎస్‌పీ ఎడిజి సంజయ్ కుమార్ జైన్, ఎడిజి (లా & ఆర్డర్) డా. అకున్ సబర్వాల్, ఐజి, పి&ఎల్ డా. గజరావ్ భూపాల్‌తో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.





