- ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు, హాస్పిటల్స్ సమన్వయంతో పనిచేయాలి
- ప్రభుత్వ దవాఖానల్లోనూ మెడికల్ టూరిజం సేవలు
- కేన్సర్ చికిత్స కోసం ప్రతి జిల్లాలో కీమోథెరపీ కేంద్రాలు
- మంత్రి దామోదర్ రాజనర్సింహ
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 20: ఆరోగ్య రంగంలో తెలంగాణను ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని, ఈ దిశగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు, హాస్పిటల్స్ యాజమాన్యాలు సమన్వయంతో పనిచేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పిలుపునిచ్చారు. గురువారం సచివాలయంలో నిర్వహించిన ‘గ్లోబల్ సమ్మిట్ హెల్త్‌కేర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్’ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మెడికల్ టూరిజం అభివృద్ధి, వైద్య సేవల విస్తరణ, వైద్య విద్య, నైపుణ్యాల పెంపుపై ప్రముఖ వైద్య నిపుణులతో మంత్రి విస్తృతంగా చర్చించారు.
ప్రైవేటు రంగంతో పాటు ప్రభుత్వ దవాఖానల్లోనూ మెడికల్ టూరిజం సేవలను విస్తరిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. సనత్‌నగర్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్, నిమ్స్, అల్వాల్ టిమ్స్, కొత్తపేట టిమ్స్ దవాఖానల్లో ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం వార్డులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మెడికల్ టూరిజం కోసం ఆరోగ్యశాఖలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలన్న వైద్యుల విజ్ఞప్తిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. విదేశీ రోగులకు ఒకే వేదికపై అన్ని సేవలు అందేలా వ్యవస్థను రూపొందిస్తామని చెప్పారు. గ్లోబల్ సమ్మిట్‌ను విజయవంతం చేయడంలో హెల్త్‌కేర్ రంగ ప్రతినిధులు భాగస్వాములు కావాలని కోరారు.
ప్రభుత్వ వైద్యులకు ప్రైవేటు నిపుణుల ఉచిత శిక్షణ
ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు తమ వంతు సహకారం అందిస్తామని ప్రైవేటు దవాఖానల వైద్యులు ముందుకొచ్చారు. జాయింట్ రీప్లేస్‌మెంట్, న్యూరో సర్జరీ, కార్డియో థొరాసిక్ సర్జరీ విభాగాల్లో కొత్తగా ప్రభుత్వ సర్వీసులో చేరే వైద్యులకు ఉచితంగా శిక్షణ ఇస్తామని కిమ్స్-సన్‌షైన్ ఎండీ డాక్టర్ గురువా రెడ్డి, ఇతర వైద్యులు ప్రకటించారు. అలాగే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో హానరరీ ప్రొఫెసర్లుగా సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రైవేటు రంగంలోని నిపుణుల సేవలను తప్పకుండా వినియోగించుకుంటామని మంత్రి పేర్కొన్నారు.
జిల్లా స్థాయిలోనే కేన్సర్ చికిత్స అందించేందుకు ప్రతి జిల్లాలో కీమోథెరపీ కేంద్రాలు, డయాలసిస్ నెట్‌వర్క్‌ను విస్తరించడంపై వైద్యులు ప్రభుత్వాన్ని అభినందించారు. ఈ సమావేశంలో తెలంగాణ ఫార్మా వైస్ ప్రెసిడెంట్, కౌన్సిల్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ కొండపల్లి సాహితి, ఫిక్కీ ప్రతినిధి డాక్టర్ విజయ్ కుమార్, రెయిన్‌బో హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంత్, యూఎన్ మాజీ అధికారి డాక్టర్ శివ దుబిశెట్టి, యశోద హాస్పిటల్ ప్రతినిధి డాక్టర్ దశరథ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.




