భద్రాద్రి వద్ద గోదావరి పరవళ్ళు

రెండవ ప్రమాద హెచ్చరిక జారీ..మరింత పెరిగే అవకాశం
కొన్ని ప్రాంతాల్లో పంటపొలాల్లోకి నీరు..భయాందోళనలో లోతట్టు ప్రాంత ప్రజలు
వరద ప్రాంతాన్ని పరిశీలించిన రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి

భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై  22 : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, ఉప నదులు పొంగి ప్రవహించడంతో ఎగువ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. ప్రాజెక్టుల్లోకి ప్రమాద స్థాయిని మించి ఉండటంతో అధికారులు నీటిని క్రింది భాగానికి విడుదల చేస్తున్నారు. దీని కారణంగా భద్రాచలం వద్ద నీటి మట్టం వేగంగా పెరుగుతుంది. ఆదివారం సాయంత్రానికి 43 అడుగులకు చేరింది. దీనితో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసారు. సోమవారం మధ్యాహ్నానానికి 48 అడుగులకు చేరుకోడంతో రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేసారు. ఇది మరింత పెరిగి సోమవారం సాయంత్రానికి 49 అడుగులకు చేరింది. మంగళవారం నాటికి మరింత పెరిగే అశకాశం ఉన్నట్లు అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఇప్పటికే అనేక గ్రామాలు వరద నీటిలో ఉన్నాయి. 53 అడుగులు చేరుకుంటే అధికారులు మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. దీనితో పూర్తి స్థాయిలో ప్రమాద సూచికలను వెల్లడిస్తారు. ఇప్పటికే అన్ని మండలాల సెక్టోరియల్‌ అధికారులకు జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేసారు. ఎప్పటికప్పుడు మండలాల్లో ఉన్న గ్రామాలను పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేసారు. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ కాగా దుమ్ముగూడెం మండలం వద్ద రోడ్డుపైకి నీరు చేరుకుంది. అలాగే ఎటపాక ప్రాంతం వద్ద కూడ గోదావరి వరద నీరు చేరుకునే అవకాశం ఉంది.

దీనితో రాకపోకలు నిలిచిపోనున్నాయి. ఇప్పటికే భద్రాచలం నుండి చింతూరు, విఆర్‌ పురం, కూనవరం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శబరి నది వేగంగా ప్రవహిస్తుంది. దీని కారణంగా భద్రాచలం వద్ద ఉన్న గోదావరి నీటి ప్రవాహం నెమ్మదిగా వెళ్ళడం వలన ఎగువ ప్రాంతం నుండి భారీగా వరద చేరుకుంటుంది. దీనితో నీటిమట్టం పెరుగుతుంది. మణుగూరు, పినపాక, అశ్వాపురం, బూర్గంపాడు మండలాల్లో ఉన్న లోతట్టు గ్రామాలు వరద తాకిడికి గురి అవుతున్నాయి. ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం పునరావాస కేంద్రాలను సిద్ధం చేసింది. మరింత వరద పెరిగితే లోతట్టు ప్రాంత ప్రజలను పునారావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. చర్ల, దుమ్ముగూడెం, అశ్వాపురం ప్రాంతాల్లో పంట పొలాల్లోకి వరద నీరు చేరుకుంది. ఇప్పుడిప్పుడే నారుమళ్ళు వేస్తున్న రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారు. మూడవ ప్రమాద హెచ్చరికకు దగ్గరగా గోదావరి ప్రవహించటంతో లోతట్టు ప్రాంత ప్రజలు తీవ్ర భయాంధోళన చెందుతున్నారు.

గోదావరి వరద ప్రాంతాన్ని పరశీలించిన పొంగులేటి
గత మూడు రోజులుగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతూ సోమవారం సాయంత్రానికి రెండవ ప్రమాద హెచ్చరిక ప్రవహిస్తుండటంతో రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం నాడు గోదావరి పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు. లోతట్టు ప్రాంతం ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. ప్రాణనష్టం ఆస్తినష్టం ఏమాత్రం జరుగకుండా ముందుగానే ప్రజలకు సమాచారం ఇవ్వాలని కోరారు. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. అంతేకాకుండా పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులకు ఎటువంటి లోటుపాట్లు జరుగకుండా చూడాలని చెప్పారు. శ్రీసీతారామ చంద్రస్వామి దేవాలయం వద్ద ఉన్న స్లూయీస్‌లను జాగ్రత్తగా పరిశీలించాలని గోదావరిలో నీరు స్లూయీస్‌ ద్వారా వచ్చే అవకాశం ఉన్నందున ముందుగానే మోటార్లు ఏర్పాటు చేసి ప్రత్యేక శ్రద్ద చూపాలని అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page