డంపర్ ఆపరేటర్లుగా మహిళలు

– సింగరేణిలో నియామకానికి సన్నాహాలు
– హెచ్‌ఎంవీ శిక్షణను పూర్తి చేసిన 13మంది
– 13 దశాబ్దాల చరిత్రలో తొలిసారి అవ‌కాశం

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 14 : మహిళాభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థలో కూడా మహిళా శక్తిని ప్రోత్సహించాలని ఆదేశించడంతో సంస్థ చరిత్రలో తొలిసారిగా భారీ డంపర్ ఆపరేటర్లుగా మహిళలకు అవకాశం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ఓపెన్ కాస్ట్ (ఓసీ) గనుల్లో బొగ్గు, ఓవర్ బర్డెన్‌ను గని క్వారీ నుండి ఉపరితలానికి రవాణా చేయడానికి యాజమాన్యం 60 నుంచి 100 టన్నుల సామర్థ్యం గల భారీ డంపర్లను వినియోగిస్తున్నది. సింగరేణిలో యాభయ్యేళ్లుగా నిర్వహిస్తున్న ఓసీల్లో ఇప్పటివరకు పురుష ఆపరేటర్లు మాత్రమే ఈ భారీ డంపర్‌లను నడుపుతూ వస్తున్నారు. ఎందుకంటే ఈ డంపర్లను నడపడం కొంత కష్టంతోపాటు శారీరక దృఢత్వం, డ్రైవింగ్ నైపుణ్యం అవసరం. పైగా మండే ఎండలు, భారీ వర్షాలు, తీవ్రమైన చలి పరిస్థితులను తట్టుకుని మూడు షిఫ్టుల్లో పనిచేయాల్సి ఉంటుంది. అయితే సింగరేణి సంస్థలో ఇటీవల మహిళా ఉద్యోగుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తున్నది. మహిళా శక్తిని సద్వినియోగం చేసుకోవాలని, వారి నైపుణ్యాలను, శక్తి సామర్థ్యాలను కూడా వినియోగించడానికి తగు ప్రాధాన్యత కల్పించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్కలు  సింగరేణిని ఆదేశించారు. ఈ క్రమంలో సింగరేణి సంస్థ ఓసీల్లో డంపర్ ఆపరేటర్లుగా పనిచేయడానికి ఆసక్తి గల మహిళా ఉద్యోగుల నుంచి దరఖాస్తులు కోరింది. మొదట దాదాపు 35 మంది ముందుకు వచ్చారు. భారీ డంపర్లను నడపడానికి వారికి అంతకుముందే ఉన్న సాధారణ డ్రైవింగ్ లైసెన్స్‌తోపాటు భారీ వాహనాలను నడిపే లైసెన్స్ కూడా అవసరమై ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకున్న యాజమాన్యం సిరిసిల్లలో ఉన్న తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ (టైడ్స్) అనే సంస్థ ద్వారా ఆసక్తి గల మహిళలకు కంపెనీ ఖర్చులతో భారీ వాహనాల డ్రైవింగ్ శిక్షణను అందించింది. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న 13మంది మహిళా ఉద్యోగులు తాము డంపర్ ఆపరేటర్లుగా పనిచేయటానికి సంసిద్ధంగా ఉన్నామని కంపెనీకి తెలిపారు. వీరందరికీ త్వరలో విడుదలయ్యే డంపర్ ఆపరేటర్ల నోటిఫికేషన్‌లో అవకాశం కల్పించనున్నట్లు యాజమాన్యం తెలిపింది. పురుషులకు మాత్రమే పరిమితమైన కఠినమైన పనుల్లో 13 దశాబ్దాల సింగరేణి సంస్థ చరిత్రలో తొలిసారిగా డంపర్ ఆపరేటర్లుగా మహిళలకు కూడా అవకాశం కల్పించేందుకు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది.

తాము కూడా చేయగలమన్న ఆత్మవిశ్వాసం కలిగింది 

ఈ సందర్భంగా కొందరు మహిళా ఆపరేటర్లు మాట్లాడుతూ భారీ డంపర్లను నడపడం శారీరక కష్టం, నైపుణ్యంతో కూడుకున్న పని అని, తాము చేయగలమో లేదో అని కొంత భయపడినప్పటికీ స్వయంగా డంపర్లు నడుపుతున్నప్పుడు తాము కూడా ఇలాంటి పనులు చేయగమన్న ఆత్మవిశ్వాసం కలగిందన్నారు. నేటి ఆధునిక కాలంలో మహిళలు అన్ని రంగాలతోపాటు రోదసిలోకి వెళ్తున్నారని, గనిలోని డంపర్లను మహిళలు నడపడం అంత కష్టమేమీ కాదని, ఇలాంటి మంచి అవకాశాన్ని కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి, సింగరేణి యాజమాన్యానికి తాము ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వారు పేర్కొన్నారు. అధికారులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కల ఆదేశాల మేరకు సింగరేణిలో మహిళా శక్తికి తగిన అవకాశాలు కల్పిస్తూ వస్తున్నామని, బెల్లంపల్లి ఖైరీగూడ ఓపెన్ కాస్ట్ గనిలో అత్యంత క్లిష్టమైన బ్లాస్టింగ్ విభాగంలో కూడా మహిళలను నియమించగా వారు పురుష ఉద్యోగులతో సమానంగా బ్లాస్టింగ్ నిర్వహిస్తున్నారని, అలాగే ఇతర విభాగాల్లో కూడా వారు రాణిస్తున్నారని పేర్కొన్నారు. సంస్థ చరిత్రలో తొలిసారిగా మహిళా రెస్క్యూ జట్టును కూడా ఏర్పాటు చేశామన్నారు. ఇకపై కూడా వివిధ క్లిష్టతరమైన ఉద్యోగాలలో ఆసక్తి గల మహిళలకు పురుషులతో సమానంగా అవకాశాలు కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *