ప్రగతి గతికి ఒక ప్రతీక..!

బ్రిటన్‌ భౌతిక దురాక్రమణ నుండి మన భారతదేశం  విముక్తమైన తరువాత  దశాబ్దాలు  గడిచాయి,   శతాబ్దాల పాటు భరతజాతి విదేశీయ బీభత్సకాండకు, దమనకాండకు గురికా వడం ఈ భౌతిక విముక్తికి సుదీర్ఘ నేపథ్యం.  భారతజాతి దాదాపు మూడువేల మూడు వందల ఏళ్లపాటు విదేశీయ బర్బర జాతుల దురాక్రమణలను తిప్పికొట్టడానికి సంఘర్షణ జరుపవలసి వచ్చింది. సహస్రాబ్దుల ఈ సతత సంఘర్షణలో భారతజాతికి విజయాలు లభించాయి, పరాజయాలు ఎదురయ్యాయి. భారతజాతి గెలిచినప్పుడు దురాక్రమణదారులను క్షమించి వదలిపెట్టింది, దురాక్రమణదారులు గెల్చినప్పుడు భారతదేశాన్ని దోచుకున్నారు, ధ్వంసం చేశారు.

మందిరాలను పడగొట్టారు, మహిళల మానప్రాణాలను హరించారు, గ్రంథాలను తగులబెట్టారు, గోవులను హత్యచేశారు, మానవతను మంటగలిపారు, మతం మార్చారు, మనుజులను హతం చేశారు! విశ్వహితం సాధించడానికి అనాదిగా కృషిచేస్తున్న భరతజాతికీ, విదేశీయ బీభత్సజాతుల వికృత విధ్వంసక ప్రవృత్తికీ మధ్య ఇలా సంఘర్షణ జరగడం మూడువేల మూడు వందల ఏళ్ల చరిత్ర. కలియుగం పంతొమ్మిదవ శతాబ్ది క్రీస్తునకు పూర్వం పదమూడవ శతాబ్దిలో మన దేశంలోకి చొరబడిన విదేశీయ బీభత్సపు తండాలను భారత సమ్రాట్‌ శుంగ వంశపు పుష్యమిత్రుడు తిప్పికొట్టడంతో ఈ ‘సంఘర్షణ’ ఆరంభమైంది.

 

భౌతిక దురాక్రమణ నుండి భారతజాతి విముక్తమైంది. కాని ఈ సంఘర్షణ సమయంలో ‘అఖండ భారతదేశం’ అనేక భూభాగాలను కోల్పోయింది. పుష్యమిత్రుడు విదేశీయ దురాక్రమణను నిరోధించిన నాటికి ‘అఖండ భారత’ భూభాగపు వైశాల్యం దాదాపు డెబ్బయి ఒక్క లక్షల చదరపు కిలోమీటర్లు. ఇది ముప్పయి మూడు శతాబ్దుల క్రితం నాటి వాస్తవం. బ్రిటన్‌ దురాక్రమణదారులు మన దేశం నుంచి నిష్క్రమించే నాటికి ‘అవశేష భారత్‌’ విస్తీర్ణం దాదాపు ముప్పయి మూడు లక్షల చదరపు కిలోమీటర్లు మాత్రమే. ఇలా ‘భౌతిక క్షతి’కి గురైనప్పటికీ అవశేష భారత్‌ తన సనాతన ‘మౌలిక స్వభావద్యుతి’ని కోల్పోలేదు. ఈ ‘స్వభావం’ నిరంతర శ్రమజీవనం, ఈ ‘స్వభావం’ సర్వమత సమభావం, సకల వైవిధ్య పరిరక్షక తత్త్వం. ఈ ‘స్వభావం’ మానవీయ సంస్కారాల సమాహారం. ఈ ‘స్వభావం’ విశ్వహితం! ఈ డెబ్బయి ఒక్క ఏళ్లలో స్వతంత్ర భారత ప్రజల సమష్టి శ్రమ ఫలితంగా అవశేష భారత్‌ ఆర్థిక ప్రగతిని సాధించగలిగింది. ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకున్న దేశం, పుచ్చిపోయిన గోధుమల కోసం, మక్కిపోయిన పాలపొడి కోసం ఇతర దేశాలను బిచ్చమెత్తవలసిన మనం, దశాబ్దుల తరువాత ఆహార స్వయం సమృద్ధిని సాధించగలగడం ప్రగతి గతికి ఒక ప్రతీక మాత్రమే!

ఆహార ధాన్యాలను ఎగుమతి చేయడం మాత్రమే కాదు. అనేక దేశాలకు ఉచితంగా ఆహార ధాన్యాలను పంపించగలగడం మన భౌతిక ప్రగతికి నిదర్శనం. అణ్వస్త్రాలను తయారు చేయడం, అంతరిక్షంలో వందల చందమామలను, ఉపగ్రహాలను, భూమి చుట్టూ ప్రదక్షిణం చేయించడం మన ప్రగతికి విజయ కేతనం! మొదటిసారి  నలబయి నాలుగేళ్ల క్రితం మనం అవని గర్భంలో అణుపాటవ పరీక్షలు జరిపినప్పుడు అమెరికాకు చెందిన ఒక పత్రిక ‘ఆకలితో అల్లాడుతున్న దేశానికి అణ్వస్త్రాలు కావలసి వొచ్చాయి..’ అని యద్దేవా చేసింది. ‘బిచ్చమెత్తుకుంటున్న దేశానికి బాంబులు కావలసి వొచ్చాయి..’ ఇరవై ఏళ్ల క్రితం మనం రెండవసారి అణుపాటవ పరీక్షలు జరిగేనాటికి మన దేశం మళ్లీ ప్రపంచానికి బిచ్చము పెట్టే స్థితికి ఎదిగింది. ఇలా బిచ్చము పెట్టడం భారతజాతి అనాది స్వభావం. ఇదే భారతీయుల ‘వసుంధరా పరివార’ తత్త్వం, వసుధైవ కుటుంబం. భారతదేశం వివిధ ప్రపంచ దేశాల ప్రజలకు అన్నం పెట్టింది. ఆశ్రయం కల్పించింది. ఇది భౌతికం. భారత్‌ వివిధ దేశాలకు సంస్కారాలను ప్రదానం చేసింది, నడవడిని దిద్దింది.. ఇది బౌద్ధికం! తమ దేశాలలో నిర్మూలనకు గురైన యూదులకు, పారశీకులకు మనదేశం మరో ‘అమ్మఒడి’ కావడం చరిత్ర. బ్రిటన్‌ విముక్త భారతదేశం బంగ్లాదేశ్‌ అవతరణ సమయంలో కోటి మంది బంగ్లాదేశీయులను పద్దెనిమిది నెలలు పోషించింది.

‘అంతర్జాతీయ యోగ దినోత్సవం’ మళ్లీ ప్రస్ఫుటిస్తున్న భారత విశ్వగురుత్వాని’కి మరో చిహ్నం.. భారత జాతీయుల ఈ బౌద్ధిక పటిమ భావదాస్యం నుండి మాత్రం విముక్తం కాకపోవడం డెబ్బయి ఒక్క సంవత్సరాలుగా కొనసాగుతున్న వైపరీత్యం. ‘భారత్‌’  ‘హిందూస్థానం’ అన్న పేర్లను ‘ఇండియా’ దిగమింగి ఉండడం మౌలికమైన భావదాస్యం. ప్రపంచంలో అనేక దేశాలు ఇతర దేశాల దురాక్రమణకు గురికావడం శతాబ్దుల చరిత్ర. దురాక్రమణ నుంచి విముక్తమైన దాదాపు అన్ని దేశాలు తమ జాతీయతను సంస్కృతిని పునరుద్ధరిం చుకొంటున్నాయి. చిన్నచిన్న దేశాలు సైతం తమ జాతీయ భాషలను సంప్రదాయాలను ఆచారాలను ఆలోచనలను దాస్యం నుంచి విముక్తం చేసుకున్నాయి, భౌతిక స్వాతంత్య్రం తోపాటు బౌద్ధిక స్వాతంత్య్రాన్ని కూడ పునరుద్ధరించుకున్నాయి. ‘రొడీషియా’ అన్న దేశం తమ ప్రాచీన నామమైన ‘జింబాబ్వే’ను పునరుద్ధరించుకొనడం ఒక ఉదాహరణ మాత్రమే. కానీ ‘ఇండియా’ మాత్రం తొలగలేదు, ‘భారత్‌’ వెలగడం లేదు. బ్రిటన్‌ దురాక్రమణదారులు మన దేశంలో తిష్ఠవేయడానికి పూర్వం మనదేశంలో ఉన్నత విద్యాబోధన సంస్కృత భాష మాధ్యమంగా జరిగేది, వివిధ ప్రాంతీయ భాషలను మాట్లాడే ప్రజలకు అనుసంధాన భాష సంస్కృతం.

రాజ్యాంగ వ్యవహారాలను సంస్కృత భాషలో నిర్వహించడం చరిత్ర. సంస్కృతం వైద్యభాష, న్యాయ స్థానాల భాష, శాస్త్ర సాంకేతిక భాష! బ్రిటన్‌ దురాక్రమణదారులు దశలవారీ ఈ అన్ని మాధ్యమాల నుంచి సంస్కృత భాషను తొలగించారు, ఆంగ్ల భాషను ఈ అన్ని కార్యకలాపాలలోను మాధ్యమంగా వ్యవస్థీకరించారు. బ్రిటన్‌ విముక్త భారతదేశం బ్రిటన్‌ దురాక్రమణకు పూర్వం నాటి సంస్కృత భాషా ప్రాధాన్యాన్ని ఎందుకని పునరుద్ధరించలేదు? సమాధానం భావదాస్యం..! ‘ఆంగ్లం’ దేశభాషలను కూడ దిగమింగుతుండడం మన ప్రాథమిక పాఠశాలలలో నెలకొన్న దృశ్యం.

ఇలా మనకు ఇప్పటికీ బౌద్ధిక స్వాతంత్య్రం లభించకపోవడం కఠోర వాస్తవం. మన ఆర్థిక స్వాతంత్య్రాన్ని వందల వేల విదేశీయ వాణిజ్య సంస్థలు హరించి వేస్తున్నాయి. ఆర్థిక స్వాతంత్య్ర హననం రాజకీయ స్వాతంత్య్ర హరణానికి పూర్వరంగం. గతంలో ‘ఈస్టిండియా కంపెనీ’ ఇలా హరించింది. ఇప్పుడు వందలాది ‘ఈస్టిండియా కంపెనీ’లు దేశంలోకి చొరబడి ఉన్నాయి. మన ఆర్థిక స్వాతంత్య్రాన్ని వందల వేల విదేశీయ వాణిజ్య సంస్థలు హరించి వేస్తున్నాయి. ఆర్థిక స్వాతంత్య్ర హననం రాజకీయ స్వాతంత్య్ర హరణానికి పూర్వరంగం. గతంలో ‘ఈస్టిండియా కంపెనీ’ ఇలా హరించింది. ఇప్పుడు వందలాది ‘ఈస్టిండియా కంపెనీ’లు దేశంలోకి చొరబడి ఉన్నాయి.
-రతన్‌ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page