‘నైరుతి’కి అల్పపీడనం తోడు..పలు జిల్లాలకు ఆరేంజ్…ఎల్లో అలర్ట్
మరో ఐదు రోజులపాటు భారీ వర్ష హెచ్చరిక
ఉప్పొంగుతున్న హుస్సేన్‌సాగర్..అధికారుల అప్రమత్తం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 15 : తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలో ప్రధానంగా పశ్చిమ, నైరుతి దిశల నుండి ఎక్కువ స్థాయిలో గాలులు వీచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా..మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బలమైన నైరుతి రుతుపవనాలకు తోడు.. సముద్ర మట్టానికి 3.1కి.వి•. నుంచి 7.6 కి.వి•. మధ్యలో ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణశాఖ చెప్పింది.
రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. నైరుతి రుతుపవనాల కారణంగా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. నేటి నుంచి ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నైరుతి రుతుపవనాలు బలపడటానికి తోడు..అల్ప పీడన ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ వర్షాలు ఈ రోజు నుంచి ఐదు రోజుల పాటు అంటే జులై 18 వరకు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని కొన్ని జిల్లాలకు వర్ష సూచన చేసింది.
ఉప్పొంగుతున్న హుస్సేన్‌సాగర్..అధికారుల అప్రమత్తం
ఆదివారం కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ నిండుకుండలా మారింది. జలాశయంలోకి ఎగువ నుంచి భారీగా వరద నీరు వొచ్చి చేరుతుంది. దానికితోడు మరి అయిదు రోజుల పాటు వాతావరణ శాఖ భారీ హెచ్చరికలతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. హుస్సేన్‌సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 514 అడుగులు. ప్రస్తుతానికి నీటి మట్టం 513 అడుగులు దాటింది.
ఎగువన కురుస్తున్న వర్షాలకు వరద నీరు మొత్తం హుస్సేన్‌సాగర్‌లో చేరుతుంది. కూకట్‌పల్లి, బంజార, బుల్కాపూర్ నాలాల నుంచి భారీగా వరద వస్తోంది. హుస్సేన్ సాగర్ 2 గేట్లు ఎత్తి వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నీటిమట్టం పెరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై జీహెచ్‌ఎంసీ అధికారులు పరిశీలన చేశారు. మళ్లీ రానున్న 24 గంటల్లో వర్షాలు కురిసే నేపథ్యంలో ముంపునకు గురయ్యే కవాడిగూడ, మిగిలిన ప్రాంతాల ప్రజలనూ జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు.