క్రియేటివిటీ ఎకానమీపై భారత్ భవిష్యత్తు ఆధారం

– సినికథన్-2026లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 27 : సినికథన్ అంశానికి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత ఉందని, భారతదేశ భవిష్యత్తు క్రియేటివిటీ ఎకానమీపై ఆధారపడి ఉందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. యూసుఫ్‌గూడలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్(నిమ్స్‌మే)లో శనివారం జరిగిన సినికథన్-2026 కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దీనిని ఎంతవరకు ముందుకు తీసుకువెళ్తాం అనే విషయాన్ని ఆలోచించకుండా మనం ఎంచుకున్న ఈ సెక్టార్‌లో ఏ రకంగా కట్రిబ్యూషన్ చేస్తాను.. మన ఆర్గనైజేషన్, మన సెక్టార్, మన హైదరాబాద్‌కు, మన దేశానికి ఏవిధంగా మంచి పేరు తీసుకురాగలుతాను అనే ఆలోచన ఉండాలని యువతకు సూచించారు. ప్రొడక్షన్ అంటే కేవలం యంత్రాలతోనే కాదు.. అందులో స్టోరీలు ఉంటాయి.. క్రియేటివిటీ ఉంటుంది.. డిజిటల్ కంటెంట్ ఉంటుంది.. యానిమేషన్ ఉంటుంది.. మన దేశానికి వేల సంవత్సరాల గొప్ప చరిత్ర, సంస్కృతి, అపారమైన కథ సంపద ఉంది అని ఆయన వివరించారు. ఇండియాకు సంబంధించిన స్టోరీ టెల్లింగ్ ఒక అద్భుతమైన సెక్టార్ అని, దేశానికే కాదు ప్రపంచానికే చెప్పగలిగే గొప్ప విషయాలు మన దగ్గర ఉన్నాయని చెప్పారు. ఇవాళ గ్లోబల్ రెవల్యూషన్‌లో కేవలం టెక్నాలజీ ద్వారానే మనం ముందుకు వెళ్ళలేం.. దీనికి సృజనాత్మకత, డిజిటల్ కంటెంట్ అవసరం అన్నారు. రాబోయే రెవల్యూషన్స్‌లో ఇవి చాలా కీలక పాత్ర పోషించనున్నాయని, ఇలాంటి మార్పులను మనం ముందుగానే గమనించి వాటికి సహకారం అందించాలని పిలుపునిచ్చారు. మన ఆర్థిక వ్యవస్థ, మన మౌలిక వసతుల కల్పన, దేశవ్యాప్తంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ఈ పదేళ్లలో వంత కొత్త ఎయిర్‌పోర్టులను నిర్మించామని, ఇది చిన్న విషయం కాదని, జాతీయ రహదారులను 60 నుంచి 70% పెంచుకున్నామని, రోజూ 40 కొత్త కి.మీ జాతీయ రహదారుల్లో కలుస్తున్నాయని, బుల్లెట్ ట్రైన్‌లు వస్తున్నాయని, నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగిందని కిషన్‌రెడ్డి వివరించారు. రామోజీ ఫిలిం సిటీ పెట్టుకుంటే సరిపోదు.. దానికి తగ్గట్టు అద్భుతమైన క్రియేటివిటీ ఉండాలి.. ఇన్‌ఫ్రాÛస్ట్రక్చర్ ఉంటే సరిపోదు.. దాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించుకునే ఆలోచన విధానం ఉండాలి అన్నారు. గ్లోబల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ సృష్టించే సామర్థ్యం మనకు రావాలన్నారు. .ప్రపంచంలో చాలా దేశాలు కొత్త కొత్త ఆవిష్కరణలు చేసి వాటికి పేటెంట్ రైట్స్ తీసుకున్నాయి.. ఇవాళ ప్రపంచాన్ని శాసించే శక్తి మనకు ఉంది.. అలాంటి శక్తిని పెంచుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. గ్లోబల్ రెవల్యూషన్‌కు నాయకత్వం వహించే సామర్థ్యం భారత దేశానికి మాత్రమే ఉందన్నారు. ప్రస్తుతం మన దేశంలో ప్రపంచంలోనే అత్యున్నతమైన, సంపన్నమైన కథలు ఉన్నాయి.. ఏ దేశంలో కూడా ప్రత్యేకమైన చరిత్రలు లేవు.. ఏ దేశంలో కూడా మన దేశంలోలా వేలాది సంవత్సరాల సాంస్కృతిక, చారిత్రక నేపథ్యం లేదు.. మన కథలను ప్రపంచానికి ఎలా చెప్పాలి అన్నదే మన చేతిలో ఉంది అని అన్నారు. ప్రస్తుతం ఏ రంగంలో చూసినా, ఏ దేశంలో చూసినా భారతీయులు రాణిస్తున్నారన్నారు. ప్రస్తుతం డిజిటల్ ఎకో సిస్టంలో మనం ముందున్నాం.. డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌లో అభివృద్ధి చెందిన అమెరికా, జర్మనీ, జపాన్, చివరికి చైనాను కూడా భారత్ దాటిపోయామన్నారు. క్రియేటివ్ ఎకానమీ అనేది వినోదానికే మాత్రమే కాదు.. ఉద్యోగ కల్పన, పెట్టుబడులు ఆకర్షణ, మన సంస్కృతి తెలియజేసేలా ఉండాలి అని ఆయన అన్నారు. 21వ శతాబ్దంలో కొత్త ఆవిష్కరణలు ప్రోత్సహించే దేశాలే ప్రపంచానికి నాయకత్వం వహిస్తాయన్నారు. చిన్న దేశమైనా పెద్ద దేశమైనా కొత్త ఆవిష్కరణలు ఎవరు చేస్తారో.. ఎవరైతే సృజనాత్మకతను ప్రోత్సహిస్తారో ఆ దేశాలు మాత్రమే ప్రపంచానికి నాయకత్వం వహిస్తాయి అని కిషన్‌రెడ్డి తెలిపారు. మన దేశంలో స్టార్టప్ ఇండియా, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్, వంటివి ఏర్పాటు చేస్తున్నారు.. మన చేతుల్లో ఉన్న సెల్‌ఫోన్స్ ద్వారా వండర్స్ క్రియేట్ చేయవచ్చు.. అది మన టాలెంట్ ద్వారా వస్తుంది.. మనం ప్రయత్నం చేస్తే అనేక రకాలుగా ముందుకు వెళ్ళవచ్చు.. కేంద్రం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చింది.. నేటి యువతను టెక్స్ట్ బుక్స్‌కు మాత్రమే పరిమితం చేయకుండా వారిని ఇన్నోవేటర్స్‌గా, డిజైనర్స్‌గా, పరిశోధకులుగా అనేక రకాలుగా తయారు చేయడం దీని లక్ష్యం అని చెప్పారు. 2025 ఆర్థిక సంవత్సరంలో 1,43,727 పేటెంట్ అప్లికేషన్స్ వచ్చాయంటే ఎంత ముందుకు వెళుతున్నామో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇవాళ కావాల్సింది జాబ్ సీకర్స్ కాదు.. జాబ్ క్రియేటర్స్.. ఆ విధంగా పోటీ పెరుగుతూ ఉండాలి.. రెండుమూడేళ్లు ఉద్యోగాలు చేసి ఆ తర్వాత స్టార్టప్ కంపెనీలను ప్రారంభిస్తున్నారు.. ప్రస్తుతం ఇలాంటి ఆలోచన మనకు ఎంతో అవసరం.. పేటెంట్ కోసం అప్లికేషన్లు పెట్టుకోవడంలో భారత్ ఇప్పుడు ఆరవ స్థానంలో ఉన్నదన్నారు. భవిష్యత్తులో అద్భుతమైన ఫలితాలు మన దేశంలో వస్తాయి.. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేది ప్రధాని మోదీ ప్రారంభించారు.. ఇది స్టార్ట్ అప్ లకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది.. రీసెర్చ్ లకు తోడ్పాటు అందించేలా దీనిని రూపొందించారు.. రీసెర్చ్ డెవలప్‌మెంట్ కోసం రూ.లక్ష కోట్లు ఏర్పాటు చేశారు.. సృజనాత్మకత, సాంస్కృతి, సాంకేతికత, మేథో సంపత్తి ప్రతి రంగంలో ఎంతో కీలకం అన్నారు. ఆస్కార్ అవార్డులు మాకు ఇవ్వండి మాకు ఇవ్వండి అని అడగడం కాదు.. ఆస్కార్ అవార్డులను తలదన్నే అవార్డులు మనమే ఇవ్వాలి.. రాబోయే పదేళ్లలో మన యువత తీసే సినిమాలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే ఏమాత్రం తీసీపోవు.. ఇలాంటి వారికి వేవ్స్ లాంటి వేదికలు ఎంతో ఉపయోగపడతాయి అని చెప్పారు. మీరు చేసే ప్రతి క్రియేటివిటీకి ప్రధాని మోదీ నాయకత్వంలో మేము అండగా ఉంటాం అని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *