మహిళా భద్రత చట్టాలపై అవగాహన అవసరం

– ప్రొబేషనరీ డీఎస్పీలకు ‘పోష్’పై అవగాహన సదస్సు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 27 : మహిళలు ఉద్యోగ స్థలాల్లో ఎదుర్కొనే అనేక రకాల లైంగిక వేధింపులు ప్రత్యక్షంగానే కాక మాటలు, ప్రవర్తన, సంకేతాలు లేదా ఇతర అనుచిత వ్యవహారాల రూపంలో కూడా ఉండొచ్చని సీఐడీ డీజీ చారు సిన్హా తెలిపారు. వాటిని మహిళలు సకాలంలో గుర్తించి అందుబాటులో ఉన్న రక్షణ వ్యవస్థలను వినియోగించుకోవాలని సూచించారు. పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డీఎస్పీల కోసం పని ప్రదేశాల్లో మహిళల భద్రత చట్టం(పోష్) అమలు, మహిళలు ఎదుర్కొనే సమస్యలు అనే అంశంపై శనివారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్ ప్రత్యేక ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఐడీ డీజీ చారు సిన్హా మాట్లాడుతూ పోష్ చట్టం గురించి సమగ్రంగా వివరించారు. వివిధ వాస్తవ ఉదాహరణల ద్వారా ఈ చట్టం ప్రాముఖ్యతను వివరించి ప్రతి అధికారి మహిళలకు సురక్షితమైన కార్యాలయ వాతావరణాన్ని కల్పించే బాధ్యతను గుర్తుంచుకోవాలన్నారు. విమెన్ సేఫ్టీ వింగ్ కౌన్సెలర్ ఇషా శర్వాణి మాట్లాడుతూ మహిళలు ఉద్యోగ జీవితంలో ఎదుర్కొనే మానసిక, సామాజిక, వృత్తిపరమైన సవాళ్లు, లైంగిక వేధింపుల వివిధ రూపాలు, వాటిని ఎదుర్కొనే విధానాలపై ఉదాహరణలతో వివరించారు. మహిళల భద్రత, గౌరవ పరిరక్షణ విషయంలో పోలీసు అధికారులు చట్టంపై పూర్తి అవగాహనతో వ్యవహరించి, సమాజంలో కూడా విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. మహిళలకు సురక్షితమైన, గౌరవప్రదమైన కార్యాలయ వాతావరణం కల్పించడంలో పోలీసు అధికారుల పాత్ర అత్యంత కీలకమని వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమానికి డీఎస్పీ సతీష్ లైజన్ అధికారిగా వ్యవహరించగా 112మంది ప్రొబేషనరీ డీఎస్పీలు పాల్గొన్నారు.

ప్రొబేషనరీ డీఎస్పీలు – ట్రైనీ ఎక్సైజ్ అధికారుల సాంస్కృతిక వైభవం

ప్రొబేషనరీ డీఎస్పీలు, ట్రైనీ ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్లు సంయుక్తంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహ భరితంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్ ముఖ్య అతిథిగా హాజరై ట్రైనీల ప్రతిభను అభినందించారు. శిక్షణతోపాటు కళలు, సంస్కృతి, వ్యక్తిత్వ వికాసానికి కూడా ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయమ న్నారు. ట్రైనీలు క్లాసికల్ నృత్యాలు, జానపద నృత్యాలు, గర్బా, బోనాల నృత్య ప్రదర్శనలు, దుర్యోధనుని మోనోలాగ్, గ్రూప్ డ్యాన్సులు తదితర ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. కార్యక్రమాన్ని ఇండక్షన్ ట్రైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ చేతన్, కోర్స్ కోఆర్డినేటర్ శ్రీనివాస రెడ్డి, ఔట్‌డోర్ అసిస్టెంట్ డైరెక్టర్ యార్లగడ్డ రాంబాబు, డీఎస్పీల కల్చరల్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇన్‌చార్జి డీఎస్పీ ఆదూరి శ్రీనివాసరావు మార్గదర్శకత్వంలో ఔట్‌డోర్ డీఎస్పీ కృష్ణ సహకారంతో కార్యక్రమం విజయవంతమైంది. ట్రైనీ డీఎస్పీలు నిశాంత్, శ్రీకాంత్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించి సభికులను ఆకట్టుకున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *