ములుగు ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయాలి

– రామప్ప-లక్నవరం కెనాల్‌కు భూసేకరణ చేపట్టాలి
– పొట్లాపూర్ ప్రాజెక్టు పనులను వెంటనే ప్రారంభించాలి
– ఆదేశించిన మంత్రులు ఉత్తమ్ కుమార్, సీతక్క

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 27: ములుగు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి రైతులకు శాశ్వత సాగునీరు అందించేలా చర్యలు వేగవంతం చేయాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రామప్ప-లక్నవరం గ్రావిటీ కెనాల్, పొట్లాపూర్ ప్రాజెక్టుతోపాటు జిల్లాలో కొనసాగుతున్న అన్ని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రైతుల ప్రయోజనాలకు భంగం కలగకుండా అభివృద్ధి పనులను పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, రైతులకు న్యాయం చేస్తూనే ప్రాజెక్టులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన నియోజకవర్గ పరిధిలోని నీటిపారుదల శాఖ అభివృద్ధి పనులపై సచివాలయంలో శనివారం ప్రత్యేక సమీక్షా సమావేశం జరగగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామప్ప-లక్న వరం గ్రావిటీ కెనాల్‌కు అవసరమైన భూసేకరణపై అధికారులు సమగ్ర నివేదికను మంత్రులకు సమర్పించారు. కాసిందేవిపేట, ఇంచెర్ల, రామచంద్రాపూర్ గ్రామాల పరిధిలో సుమారు 244.23 ఎకరాల భూమి అవసరమవుతుందని, ఇందులో ఇప్పటివరకు 201.03 ఎకరాలకు మాత్రమే అవార్డులు జారీ అయినప్పటికీ భూసేకరణ పూర్తికాలేదని వివరించారు. భూసేకరణకు సంబంధించి 2020-21లో జారీ చేసిన అవార్డుల ప్రకారం ఎకరాకు రూ.2.47 లక్షల నుంచి రూ.8.26 లక్షల వరకు మాత్రమే పరిహారం నిర్ణయించారని, ప్రస్తుతం భూముల మార్కెట్ విలువలు గణనీయంగా పెరగడంతో పాత ధరలకు రైతులు భూములు ఇచ్చేందుకు అంగీకరించడం లేదని అధికారులు వివరించారు. పాత ధరలతో భూసేకరణ కొనసాగించడం వల్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుత మార్కెట్ ధరలకు అనుగుణంగా కొత్త భూసేకరణ ప్రక్రియ చేపట్టడమే సరైన మార్గమని అధికారులు అభిప్రాయపడ్డారు. దీనిపై మంత్రులు స్సందిస్తూ రైతుల ప్రయోజనాలకు ఎలాంటి నష్టం కలగకుండా 2020-21లోని పాత అవార్డును ఉపసంహరించి తాజా మార్కెట్ విలువల ఆధారంగా కొత్త అంచనాలు రూపొందించి వెంటనే తాజా భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించారు. రైతుల విశ్వాసాన్ని పొందుతూ పెండింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. రామప్ప-లక్నవరం కెనాల్ నిర్మాణం రెండేళ్లలో పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ఇది పూర్తయితే రామప్ప చెరువు నుంచి లక్నవరం చెరువుకు గ్రావిటీ ద్వారా నీటి తరలింపు సాధ్యమవుతుందని, సుమారు 8,700 ఎకరాలకు నీరు అందుతుందని అధికారులు వివరించారు. మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర సందర్భంగా తాగునీటి అవసరాలు తీర్చడంలోనూ, లక్నవరం పర్యాటకాభివృద్ధికి కూడా కీలకంగా ఉపయోగపడుతుందని తెలిపారు. అలాగే పొట్లాపూర్ ప్రాజెక్టు పనులను వెంటనే ప్రారంభించాలని, వచ్చే వారంలో శంకుస్థాపన జరిగేలా ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. ప్రతి ప్రాజెక్టు పురోగతిపై క్రమం తప్పకుండా నివేదిక సమర్పించాలని ఇరిగేషన్ ఈఎన్‌సీని ఆదేశించారు. సమావేశంలో నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి ఈ.శ్రీధర్, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఇరిగేషన్ ఈఎన్‌సీ రమేష్‌బాబు, ఆర్డీవో కృష్ణవేణి, సంబంధిత సీఈలు, ఎస్‌ఈలు, ఈఈలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *