కవిత బెయిల్‌పై రాజకీయపార్టీల సెటైర్లు

   ( మండువ రవీందర్‌రావు )
మద్యం కుంభకోణం కేసులో నిందితురాలిగా ముద్రపడిన బిఆర్ఎస్‌ ఎంఎల్సీ కల్వకుంట్ల కవితకు ఎట్టకేలకు సుప్రీంకోర్టు బెయిల్‌ ‌మంజూరు చేయడంతో బిఆర్ఎస్‌ ‌వర్గాలు సంబరాలు చేసుకుంటుంటే బిజెపి, కాంగ్రెస్‌ ‌పార్టీలు సెటైర్లు విసురుతున్నాయి. దిల్లీ  మద్యం కేసుకు సంబందించి మొత్తంగా 164 రోజులపాటు కవిత  నిర్బంధ జీవితాన్ని గడిపిన విషయం తెలిసిందే. ఒక మహిళా నాయకురాలుగా ఇంతకాలం జైల్‌ ‌జీవితం కడిపిన వ్యక్తి కవితేనంటున్నారు. ఈ మధ్యకాలంలో ఆమె బెయిల్‌కోసం హైకోర్టునుండి సుప్రీంకోర్టు వరకు అనేక పర్యాయాలు ప్రయత్నాలుచేసినా లాభం లేకుండా పోయింది. కాని, మంగళవారం ఆమె తరఫు న్యాయవాదుల వాదనలు విన్న దేశ అత్యున్నత న్యాయస్థానం ఆమెకు బెయిల్‌ ‌మంజూరు చేయడంకూడా రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

కవిత జైల్‌ ‌జీవితాన్ని గడుపుతున్నంతకాలం బిఆర్ఎస్‌ ‌పార్టీని, ఆ పార్టీ అధినేత కెసిఆర్‌పై దుమ్మెత్తిపోసిన రాజకీయ పార్టీలు బెయిల్‌ ‌విషయంలోనూ పోటీపడి విమర్శనాస్త్రాలు  సంధిసున్నాయి.తాము మొదటినుండీ చెబుతున్నట్లు బిఆర్ఎస్‌, ‌బిజెపి కుమ్మక్కుతోనే బిఆర్ఎస్‌ ఎంఎల్సీ కవితకు బెయిల్‌ ‌లభించిందని కాంగ్రెస్‌ ‌కామెంట్‌ ‌చేస్తుంటే, తాము అనుమానించినట్లే కాంగ్రెస్‌, ‌బిఆర్ఎస్‌ ‌కుమ్మక్కువల్లె కవితకు బెయిల్‌ ‌ వొచ్చిందని బిజెపి అంటున్నది. తమ పార్టీని  దెబ్బతీసేందుకు బిజెపితో బిఆర్ఎస్‌ ‌చీకటి ఒప్పందం చేసుకుందంటున్నారు కాంగ్రెస్‌ ‌నాయకులు. కవితకు బెయిల్‌ ‌ వొచ్చిన కొద్ది గంటల్లోనే తెలంగాణ కాంగ్రెస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌మహేష్‌కుమార్‌ ‌గౌడ్‌ ‌చేసిన కామెంట్‌ అదే విషయాన్ని చెబుతున్నది. గత ఎన్నికల్లోనే తమ పార్టీని దెబ్బతీసేందుకు బిజెపి, బిఆర్ఎస్‌ ‌చీకటి ఒప్పందాలు చేసుకున్నాయంటారాయన.  ఇప్పుడు కవితను కాపాడుకోవడానికి బిజెపికి బిఆర్ఎస్‌ ‌దాసోహమంటున్నది.

అందులో భాగంగానే బిఆర్ఎస్‌ ‌నేతలు హరీష్‌రావు, కెటిఆర్‌లు పలుమార్లు దిల్లీ వెళ్ళి బిజెపి అగ్రనేతలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేశారని, కవితకు బెయిల్‌ ‌రావడంకూడా అందులో ఒక భాగంగా ఆయన పేర్కొన్నారు. ఇప్పుడిక బిఆర్ఎస్‌ ‌బిజెపిలో విలీనమే మిగిలిందంటూ ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. కాగా బిజెపి కూడా తానేమీ తక్కువ తినలేదన్నట్లుగా కాంగ్రెస్‌, ‌బిఆర్ఎస్‌ ‌పైన విరుచుకుపడింది. కవితకు బెయిల్‌ ‌రావడానికి కాంగ్రెస్‌ ‌లాయర్లు తీవ్రస్థాయిలో ప్రయత్నించారని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌కామెంట్‌ ‌చేశారు. అందుకే బెయిల్‌ ‌రావడమన్నది ఈ రెండు పార్టీల గెలుపుగా ఆయన అభివర్ణించారు. బెయిల్‌కోసం ఈ రెండు పార్టీలు అలుపెరుగని ప్రయత్నాలు చేశాయంటున్న సంజయ్‌, ‌వాస్తవంగా రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్‌ ‌మను సింఘ్వీని గెలిపించుకునే విషయంలో ఈ రెండు పార్టీలు చీకటి ఒప్పందం చేసుకున్నాయంటారాయన. దిల్లీ మద్యం కేసులో ఇరుక్కున కవిత తరఫున నిన్నటివరకు కేసు వాదిస్తున్న సింఘ్వీనే కాంగ్రెస్‌ ‌పార్టీ తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఆయన ను గెలిపించుకునే  విషయంలో కాంగ్రెస్‌కు మద్దతిచ్చే విషయంలో ఆ రెండు పార్టీల మధ్య ఒప్పందం జరిగిందన్నది సంజయ్‌ ఆరోపణ. ఎక్స్ ‌వేదికగా ఆయన చేసిన ఈ ట్వీట్‌పై బిఆర్ఎస్‌ ఎంఎల్ఏ, ‌మాజీ మంత్రి కెటీఆర్‌ ‌తీవ్రంగా స్పందించారు.

ఆయనకూడా ఎక్స్ ‌వేదికగా సంజయ్‌ ‌చేసిన వ్యాఖ్యలు అత్యుత్తమ న్యాయస్థాన తీర్పుకు వక్రభాష్యం చెప్పినట్లుందని, సంజయ్‌ ‌వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలని పేర్కొన్నారు. కవిత బెయిల్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణకు రావడంతో దిల్లీ లోనే మకాం పెట్టిన కెటిఆర్‌, ‌సుప్రీంకోర్టు బెయిల్‌ ‌మంజూరుచేస్తూ ఇచ్చిన తీర్పుపైన ఎక్స్ ‌వేదికగా తన సంతోషాన్ని వ్యక్తంచేస్తూ, సుప్రీం న్యాయస్థానానికి ధన్యవాదాలు తెలిపారు. చాలాకాలం తర్వాత తమకు ఉపషమనం లభించిందంటూ, ఈ తీర్పు వల్ల ఆలస్యంగానైనా న్యాయమే గెలిచిందన్నారు. కోర్టు తీర్పు రాగానే దేశ వ్యాప్తంగా ఉన్న బిఆర్ఎస్‌ ‌కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో బాణాసంచాపేల్చి తమ సంతోషాన్ని కార్యకర్తలు వ్యక్తం చేశారు. ఇంతకాలం తమ పార్టీపైన ఎదుటిపార్టీలు అవాకులు చెవాకులు పలికినవారికి ఈ తీర్పు ఒక చెంపపెట్టంటు నాయకులు వ్యాఖ్యానించారు.

తనను అరెస్టు చేసిన సందర్భంగా కవిత అన్నమాటలను వారు గుర్తుచేస్తున్నారు. కవిత నిజంగానే కడిగిన ముత్యంగానే వొస్తుందన్నారు.  ఈ సందర్భంగా సుప్రీం జడ్జిల ద్వయం చేసిన కామెంట్‌నుకూడా వారు ఉదహరిస్తున్నారు. సుమారు అయిదు నెలల 11 రోజుల పాటు కవితను నిర్బంధించిన ఇడి, సిబిఐలు ఆమెను నేరస్తురాలిగా రుజువుచేసే ఒక్క ఆధారాన్ని కూడా చూపలేకపోయారన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏదో జరిగిపోయిందని గోలచేసి, విచారణల పేరుతో అప్రతిష్టపాలుచేసి ఎన్నికల్లో లబ్ధిపొందాలని కాంగ్రెస్‌, ‌బిజెపిలు చూశాయని, పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్‌కు ఒక రోజు ముందు కవితను అరెస్టుచేయడంకూడా అందులో ఒక భాగమన్నారు బిఆర్ఎస్‌ ‌నాయకులు. అయినా న్యాయం తమవైపే ఉందని, బిఆర్ఎస్‌ ఇక పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందన్న ఆశాభావాన్ని వారు వ్యక్తంచేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page