తేజస్వి మాటలను బీఆర్ఎస్ అపార్థం చేసుకుంది

– కాంగ్రెస్ తీరుతోనే తెలంగాణ ఉద్యమంలో రక్తపాతం
– అందుకే దేశ విభజన నాటి అంశాన్ని పోలికగా చెప్పారు
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16 : తమ ఎంపీ తేజస్వి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ తప్పుగా అర్థం చేసుకుని రాజకీయ లాభం పొందేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అప్పట్లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రజలు పోరాడుతుండగా ఉమ్మడి రాష్ట్రాన్ని ఏలుతున్న కాంగ్రెస్ పార్టీ వైఖరి కారణంగా వల్ల ఆనేకమంది యువకుల ఆత్మహత్యలకు దారితీసిందని గుర్తు చేశారు. అదే ప్రధానమంత్రిగా వాజ్‌పేయి ఉన్న సమయంలో ఒక్క రక్తపు చుక్క చిందకుండా, ఎలాంటి అల్లర్లు లేకుండా అందరి సమ్మతితో, సహకారంతో మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. దేశ విభజన సమయంలో జరిగిన ప్రాణ నష్టాలను ఉదాహరణగా ప్రస్తావిస్తూ తెలంగాణ ఏర్పాటులో కూడా అనేకమంది ప్రాణత్యాగాలు చేశారని తమ పార్టీ ఎంపీ తేజస్వి పోలికగా చెప్పారన్నారు. ఎవరు ఏ సందర్భంలో మాట్లాడారో ఆ నేపథ్యాన్ని అర్థం చేసుకోవడం అవసరం అని రామచందర్‌రావు హితవు పలికారు. తెలంగాణ ఉద్యమంలో బీజేపీ కూడా కీలక పాత్ర పోషించిందంటూ బీజేపీ మద్దతు లేకుండా తెలంగాణ సాధ్యమయ్యేదా అనే విషయం ప్రజలకు తెలిసిందేనన్నారు. నాడు పార్లమెంటులో తమ నాయకులు సుష్మాస్వరాజ్, రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు ఎంపీలు తెలంగాణకు బలంగా మద్దతు తెలిపారన్నారు. ఆ సమయంలో కాంగ్రెస్‌కు చెందిన పలువురు ఎంపీలు సరైన విధంగా చర్చలో, ఉద్యమంలో పాల్గొనలేదని, ఇప్పుడు బీజేపీపై ఆరోపణలు చేయడం విచారకరమని ఆయన అన్నారు. తెలంగాణను ఎప్పుడూ పాకిస్థాన్‌తో పోల్చలేదంటూ తప్పుడు ప్రచారాలను బీఆరఎస్ వెంటనే మానుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడి దాదాపు 13 సంవత్సరాలు అయిందని, ఎవరైనా ఇప్పటికీ తెలంగాణ గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తే తాము సహించమని రామచందర్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల భావోద్వేగాలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ప్రజలు కూడా నిజాలను గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *