– రాష్ట్ర క్రీడాకారులు అంతర్జాతీయస్థాయిలో రాణించేందుకు సహకారం
– బీఆర్ఎస్ నేత కేటీఆర్ హామీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16 : తెలంగాణ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అన్ని విధాల సహకారం అందిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ హామీ ఇచ్చారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన కేసీఆర్ క్రికెట్ కప్ 8వ ఎడిషన్ పోటీల విజేతలకు చెక్‌లు, ట్రోఫీలను హైదరాబాద్‌లోని నందినగర్ నివాసంలో కేటీఆర్ గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో సమగ్ర క్రీడా పాలసీ తీసుకురావాల్సిన అవసరం ఉందని, వచ్చే బీఆరఎస్ ప్రభుత్వంలో క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి చేయడంతోపాటు క్రీడాకారులను అంతర్జాతీయస్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేసీఆర్ క్రికెట్ కప్ స్ఫూర్తితో వచ్చే ఏడాది కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా క్రికెట్ పోటీలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ గులాబీ శ్రేణులను, కాకతీయ క్రికెట్ అకాడమీ సభ్యులను అభినందించారు.
ఓరుగల్లు క్రీడాకారులు అంతర్జాతీయస్థాయిలో రాణించాలి : వినయ్ భాస్కర్
పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఎనిమిదేళ్లుగా కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. హనుమకొండ జిల్లా పరిధిలోని పేద క్రీడాకారులకు చేయూతనందిస్తున్నామన్నారు. పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులను, టోర్నమెంట్ నిర్వహణకు సహకరించిన కాకతీయ క్రికెట్ అకాడమీ బృందాన్ని అభినందించారు.
విజేతలకు చెక్‌లు, ట్రోఫీల ప్రదానం
కేసీఆర్ క్రికెట్ కప్ 8వ ఎడిషన్ పోటీల్లో విన్నర్ 51వ డివిజన్ జట్టుకు, రన్నర్స్ 49వ డివిజన్ జట్టుకు కేటీఆర్ చేతుల మీదుగా నగదు బహుమతులు, ట్రోఫీలు అందజేశారు. డిపార్టుమెంట్ క్రికెట్ విభాగంలో విన్నర్‌గా నిలిచిన అంజలి కిడ్నీ కేర్ సెంటర్ హాస్పిటల్ జట్టుకు, రన్నర్-అప్‌గా నిలిచిన సంకీర్తన హాస్పిటల్ జట్టుకు కూడా ట్రోఫీలను అందజేశారు. కార్యక్రమంలో కాకతీయ క్రికెట్ అకాడమీ (కేసీఏ) ఫౌండర్ చైర్మన్ ఫారుక్ అలీ, సభ్యులు మాజీద్, వీరు, సిరాజ్, రాజేష్, రాంబాబు, 51వ డివిజన్ కార్పొరేటర్ బోయినపల్లి రంజిత్ రావు, ప్రెసిడెంట్ ఫిరోజ్, 4వ డివిజన్ కార్పొరేటర్ బొంగు అశోక్ యాదవ్, మూటిక రాజు, యాదగిరి, పులి రజనీకాంత్, జోరిక రమేష్, నయీముద్దీన్, ఇమ్మిడి రాజు, దువ్వ కనకరాజు, ఇస్మాయిల్, తదితర డివిజన్ నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




