తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచారు

– బేషరతుగా తేజస్వి క్షమాపణలు చెప్పాలి
– మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చుతూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. పార్లమెంట్ వేదికగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచిన తేజస్వి సూర్య వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దశాబ్దాల పోరాటం, వేలాదిమంది యువత త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణను రక్తపాతంతో కూడిన దేశ విభజనతో పోల్చడం అమరవీరుల త్యాగాలను అవమానించడమేనని మండిపడ్డారు. ఇవాళ బీఆర్ఎస్ ఎంపీలే గనుక సభలో ఉండి ఉంటే తేజస్వి సూర్య సంగతి తేల్చిపారేసేవారని హరీష్‌రావు అన్నారు. తెలంగాణ ఏర్పాటు పక్రియ రాజ్యాంగబద్ధంగా జరిగిందని గుర్తు చేస్తూ ఈ రాష్ట్రం నేడు దేశానికే ఆదర్శంగా నిలవడాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు. ఒకవేళ తెలంగాణ ఏర్పాటు భారత్-పాక్ విభజన వంటిదే అయితే ఆనాడు పార్లమెంట్‌లో బీజేపీ ఈ బిల్లుకు ఎందుకు మద్దతు ఇచ్చిందని ఆయన ప్రశ్నించారు. గతంలో ప్రధాని మోదీ కూడా రాష్ట్ర ఏర్పాటుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఇప్పుడు తేజస్వి సూర్య అదేబాటలో నడుస్తూ విషం చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రం నుంచి ఎన్నికైన బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల మౌనాన్ని హరీష్ రావు తీవ్రంగా తప్పుబట్టారు. తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచి దిల్లీ పెద్దల ముందు రాష్ట్ర గౌరవాన్ని తాకట్టు పెట్టడం సిగ్గుచేటని విమర్శించారు. తెలంగాణ ఆత్మగౌరవంపై దాడి చేసే శక్తులను ఇక్కడి ప్రజలు ఎన్నడూ క్షమించరని, త్యాగాల చరిత్రను అగౌరవపరిస్తే సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *