ఎడతెగని సమస్యగా మానవ హక్కుల రక్షణ!

భారత రాజ్యాంగంలో సమానత్వానికి, సేచ్ఛకు పెద్దపీట వేశారు. ప్రాథమిక హక్కుల పేరుతో ఒక ప్రత్యేక విభాగమే పొందుపరిచారు. ప్రాథమిక హక్కులంటే ఒక రకంగా మానవ హక్కులే. ఆ విభాగంలో దాదాపు అన్ని అధికరణాలు మానవ హక్కులకు సంబంధించినవే. అయితే.. చిన్న చిన్న విషయాల్లోనూ మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడటం నిత్యకృత్యంగా మారింది. వ్యక్తులూ, వ్యవస్థలే కాదు, ప్రభుత్వం సైతం అనేక మార్లు నిర్లజ్జగా మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడటం, అవి కాస్తా ఉన్నత న్యాయస్థానాలకు చేరాక చివరికి తప్పును సరిదిద్దుకోవడం మనం చూస్తున్నదే. ఆదేశిక సూత్రాల పేరిట ఉన్న విభాగంలో అనేక అధికరణాలు మానవ హక్కుల కోణంలోనివే. అధికరణం 38 మొదలు 51వరకూ, అధికరణం 12 మొదలు 21 ఏ వరకూ అన్నీ మానవ హక్కుల రక్షణకు ఉద్దేశించినవే. వీటికి వ్యాఖ్యానాలను సైతం ఇస్తూ మానవ హక్కుల రక్షణకు పటిష్టమైన నిబంధనలను రూపొందించారు. వాటి అమలుకు సంస్థాగతమైన, వ్యవస్థాగతమైన యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేశారు. జాతీయ మానవ హక్కుల కమిషన్‌, జాతీయ బాలల హక్కుల కమిషన్‌, జాతీయ మహిళా హక్కుల కమిషన్‌, జాతీయ మైనార్టీ హక్కుల కమిషన్‌, జాతీయ ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక కమిషన్‌తో పాటు రాష్ట్రాల స్థాయిలోనూ ఇలాంటి కమిషన్లు ఆవిర్భవించాయి.

మానవ హక్కుల రక్షణకు సీఆర్‌పీసీ, సీపీసీలలో నిబంధనలను చేర్చారు. చట్టాల్లో ఇంతగా ఉన్నా, మానవ హక్కుల పరిరక్షణ ఎడతెగని సమస్యగా మారింది. ఇది ఒక ప్రాంతానికో, రాష్ట్రానికో, దేశానికో పరిమితమైనది కాదు, వాస్తవానికి ఇది ప్రపంచ సమస్య. అగ్రరాజ్యాలు సహా అభివృద్ధి చెందిన, చెందుతున్న, పేద దేశాల్లోనూ మానవ హక్కుల సమస్య కనిపిస్తోంది. బ్రిటన్‌, అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌, జపాన్‌, దక్షిణ కొరియా వంటి పెట్టుబడిదారీ దేశాలలో ఒక పక్క మానవ హక్కుల రక్షణ జరుగుతున్నా, మరో పక్క ఉల్లంఘనలూ అదే స్థాయిలో జరుగుతున్నాయి. మానవ హక్కుల ఆవిర్భావం బ్రిటన్‌, అమెరికాల్లోనే జరిగిందని చెప్పాలి. ఆధునిక పెట్టుబడిదారీ ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లుగా బ్రిటన్‌ను చెబుతుంటారు. పెట్టుబడిదారీ ప్రజాస్వామ్య హక్కుల భావజాలానికి నాందీ ప్రస్తావన జరిగింది బ్రిటన్‌లోనే. ‘మాగ్నాకార్టా’ అంటే హక్కుల ప్రకటన. క్రీ.శ 1225లోనే మాగ్నాకార్టాను ప్రకటించారు. బ్రిటన్‌తో పాటు యూరప్‌లోని రాచరికానికి, పోప్‌ నాయకత్వంలోని క్రైస్తవ పురోహిత వర్గానికీ ఆధిపత్య యుద్ధం జరుగుతున్న కాలంలోనే బ్రిటన్‌ రాజు మొదటి జాన్‌కూ క్రైస్తవ వర్గానికీ పెద్దయుద్ధమే జరిగింది. ఆ యుద్ధంలో రాజు ఓడిపోయాడు, ఈ సందర్భంగా కుదిరిన సంధి పర్యావసానమే మాగ్నాకార్టా. రాజు దైవాంశ సంభూతుడు అనే భావనను మాగ్నాకార్టా నిబంధనలను మార్చేసింది.

రాజు సైతం చట్టానికి లోబడి ఉండాలని, చట్టాన్ని గౌరవించాలని, అక్రమంగా పౌరులను అరెస్టు చేయరాదని, అలా వ్యవహరించడం అంటే ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని మాగ్నాకార్టా పేర్కొంది. చట్టబద్ధ పాలన, మానవ హక్కులకు అంకురార్పణ బ్రిటన్‌లోనే జరిగిందని చెప్పుకోవాలి. మాగ్నాకార్టా తర్వాత 1668లో చెప్పుకోదగ్గ అంశం పిటిషన్‌ ఆఫ్‌ రైట్స్‌. 16వ శతాబ్దిలో బ్రిటన్‌ పార్లమెంటరీ వ్యవస్థ బలహీనపడగానే కొన్ని అధికారాలు చట్టసభలకు ఇచ్చారు. కానీ అందులో ఎక్కువ అధికారాలు రాజు వద్దే ఉండిపోయాయి. దీంతో రాజుకు, చట్టసభలకు మధ్య ఘర్షణ మొదలైంది. రాజు అధికారాలకు కత్తెర వేస్తూ చట్టసభలే పైచేయిగా ఉండేలా పిటిషన్స్‌ ఆఫ్‌ రైట్స్‌ రూపొందించారు. దాంతో రాజు కేవలం పేరుకే తప్ప మానవ హక్కులకు సంబంధించిన అధికారాలన్నీ చట్టసభలకు దక్కాయి. చాలా దేశాల్లో ఘరానా నేరస్థులు చివరికి బ్రిటన్‌ చేరుతుంటారు. అక్కడ వ్యక్తిస్వేచ్ఛ అద్భుతంగా ఉండటమే దీనికి కారణం.

ఆర్థిక నేరగాడిగా అభియోగాలున్న విజయ్‌ మాల్యా సైతం బ్రిటన్‌లో తిరుగుతూ స్వేచ్ఛగా ఉన్నాడంటే దానికి కారణం మనకు ఇట్టే అర్థమైపోతుంది. బ్రిటన్‌లో ప్రస్తుతం రెండు చట్టసభలున్నా.. మొదట్లో ప్రభువుల సభ (హౌస్‌ ఆఫ్‌ లార్డ్సు) మాత్రమే ఉండేది, తర్వాత సామాన్యుల సభ (హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌) వచ్చింది. ధనవంతులు, చర్చి పెద్దలు, భూస్వామ్యులు మరికొందరు ముఖ్యులకు మాత్రమే ప్రభువుల సభలో సభ్యత్వం ఉండేది, తర్వాత అనేక పోరాటాలతో సామాన్యుల సభ ఏర్పాటైనా దానికి ఎలాంటి అధికారాలు లేవు. సుదీర్ఘ సమరం తర్వాత సామాన్యుల సభకూ అధికారాలు దక్కాయి. ప్రారంభ రోజుల్లో వయోజన వోటు హక్కు, మహిళలకు వోటు హక్కు లేనందున వాటిని కూడా పోరాడి సాధించుకోవల్సి వచ్చింది. ఒక పక్క మానవ హక్కులకు పోరు సాగుతుంటే మరో పక్క బ్రిటన్‌ సామ్రాజ్యవాద ధోరణి ప్రదర్శించింది. ఇతర దేశాలను ఆక్రమించుకోవడం, అక్కడి సంపదను కొల్లగొట్టడమే పనిగా పెట్టుకుంది. భారత్‌ సహా అనేక దేశాలను తమ వలస రాజ్యాలుగా మార్చుకుంది. ఇదే దారిలోనే ఫ్రాన్స్‌, అమెరికా, స్పెయిన్‌ తదితర సామ్రాజ్యవాద దేశాలూ పయనించాయి.

యాభై రాష్ట్రాల సమాహారంగా ఉన్న అమెరికా సైతం సామ్రాజ్యవాద దాహాన్ని తీర్చుకునేందుకు ఎన్నో కుయుక్తులకు పాల్పడిరది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో చాలా మటుకు బ్రిటిష్‌ వలస ప్రాంతాలే. కొంతమంది బ్రిటిష్‌ పౌరులు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉత్తర అమెరికాకు వలస వెళ్లి అక్కడ అనేక ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. అటువంటి యాభై ప్రాంతాలు కలిసి అమెరికా ఏర్పడిరది. కొంతకాలం పాటు బ్రిటన్‌ ఆధిపత్యానికి తలవంచి వలసలుగా ఉన్న ఆ ప్రాంతాలు తర్వాత బ్రిటన్‌పై యుద్ధం చేసి స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాయి. అప్పటికే అక్కడ ఉన్న స్థానికులు నల్ల జాతీయులుగా అల్పసంఖ్యాకులు కాగా, తెల్లగా ఉన్న వారంతా తెల్లజాతీయులుగా సంపన్న వర్గాలుగా మారారు. అమెరికా స్వతంత్ర ప్రకటన 1776లో జరిగింది. అమెరికా రాజ్యాంగం 1787లో అమలులోకి వచ్చింది. స్వతంత్ర ప్రకటనలోనూ, రాజ్యాంగంలోనూ అమెరికా మానవ హక్కులకు పెద్దపీట వేసింది. ఆ తర్వాత అమెరికా రాజ్యాంగానికి 1791లో జరిగిన పది సవరణలు (బిల్‌ ఆఫ్‌ రైట్స్‌) భావ ప్రకటనకు, మత స్వేచ్ఛకు, ఆయుధాలు కలిగి ఉండే స్వేచ్ఛకు, ఇతర హక్కులకు గ్యారంటీ ఇచ్చింది. అప్పటికే ఆఫ్రికన్‌ నీగ్రోలను బానిసలుగా విక్రయించేందుకు చట్టబద్ధత ఉండేది, ఆ తర్వాతనే అమెరికా 13వ, 15వ రాజ్యాంగ సవరణ చేసి బానిసల వ్యాపారాన్ని రద్దుచేసి, వారికి సైతం వోటు హక్కును కల్పించింది. రెండో ప్రపంచ యుద్ధానంతరం బ్రిటన్‌ తదితర దేశాలను వెనక్కునెట్టి అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యవాద దేశంగా, శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశంగా అమెరికా అవతరించింది.

ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికాల్లోని పలు దేశాలను దోచుకోవడం మొదలుపెట్టింది. ఫ్రాన్స్‌, జపాన్‌, ఆస్ట్రేలియా, సింగపూర్‌ వంటి దేశాల్లో మానవ హక్కుల రక్షణ బాగానే ఉంది. ఎటువంటి వివక్ష లేకుండా సమానత్వపు హక్కు ఉంది. జాతి పరమైన అసమానతలు లేకపోవడం, వివక్ష లేకపోవడం, అంతరాలున్నా అందరికీ కనీస సౌకర్యాలుండటం, ఆకలి చావులు లేకపోవడం, పేదరికం తక్కువగా ఉండటం, సంపన్న వర్గాలకు అందే సౌకర్యాలు సైతం దిగువ తరగతి ప్రజలకు సమానంగా అందడం వంటి కారణాలతో మానవ హక్కుల ఉల్లంఘనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఇక భారత్‌, పాకిస్తాన్‌, శ్రీలంక, పశ్చిమాసియా దేశాలు, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాలలోమానవ హక్కులు దాదాపు మృగ్యం. మానవ హక్కులు ఉన్నట్లు పైకి చెబుతున్నా ఆచరణలో మాత్రం ఎక్కడో ఒక చోట నిర్లజ్జగా మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయి.

సిరియాలో మారణ హోమం, ఖుర్దూ జాతీయులపై టర్కీ దమనకాండ, రోహింగ్యాలపై మయన్మార్‌ అణచివేత, పాలస్తీనీయులపై ఇజ్రాయెల్‌ దమనకాండ, శ్రీలంకలో మైనార్టీ తమిళ వేర్పాటువాదుల ఊచకోత, దక్షిణ అమెరికా, ఆఫ్రికాల్లో అంతర్యుద్ధాలు, జాతుల మధ్య ఘర్షణలు, సైనిక తిరుగుబాట్లు, భారత్‌లోనూ మైనార్టీ వర్గాలపైనా, కొన్ని కులాలకు చెందిన వారిపైనా అణచివేత, దాడులు, నిర్బంధాలు అన్నీ మానవ హక్కుల ఉల్లంఘనలే. ఐక్యరాజ్యసమితి చార్టర్‌లోని 19 అధ్యాయాల్లో 111 అధికరణాలలో మానవ హక్కులకే అధిక ప్రాధాన్యత ఉంది. తొమ్మిదో అధ్యాయం 55 నుండి 60 అధికరణం వరకూ ప్రత్యేకించి మానవ హక్కుల రక్షణ గురించి ప్రస్తావించారు. ఈ అధ్యాయం కింద ఆర్థిక, సామాజిక మండలిని ఏర్పాటు చేశారు. ఉన్నత ప్రమాణాలతో కూడిన జీవనం, ఉపాధి, మానవాభివృద్ధికి అవసరమైన అన్ని పరిస్థితులు కల్పించడం ఈ మండలి బాధ్యత. అంతర్జాతీయ సమాజం ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక , ఆరోగ్య సంబంధిత సమస్యలకు తగిన పరిష్కారాలను ఈ మండలి కనుగొనాల్సి ఉంటుంది.
-సమీర్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page