మెరుపు తీగెలు

మొగుడూ పెళ్ళాలిద్దరూ గొడవ పడుతున్నారు

ఎందుకూ?

మొగుడూ పెళ్ళాలు కాబట్టి

గొడవ యెక్కడ మొదలైంది? ఊ… కూర దగ్గర కర్రీ పాయింట్ దగ్గర

అర్థం కాలేదు?

‘రోజంతా వర్క్ చేసి వచ్చి మళ్ళీ నువ్వు యింట్లో కర్రీ చేయడమెందుకు’ అన్నాడు మొగుడు.

పెళ్ళాం యేమంది?

‘నా చేతి వంట నచ్చట్లేదు అని చెప్పండి’ అంది పెళ్ళాం.

సరిపోయింది!

ఏం సరిపోయింది, ‘కర్రీ పాయింట్ ఆవిడ బాగా నచ్చినట్టుంది’ అని కూడా పెళ్ళాం అనేసింది.

అయ్యో?!

అయ్యో అనలేదా మొగుడు, ‘పోని అలాగే అనుకో… నీ ముచ్చట నేనెందుకు కాదనాలి?’ అన్నాడు.

గొడవ ముదిరి పాకాన పడిందన్నమాట!

ఎప్పటెప్పటి సంగతులన్నీ యెంత గుర్తుపెట్టుకున్నారో గాని యిద్దరూ చక్కగా దెప్పి పొడుచుకున్నారు.

మేనత్తవి నువ్వున్నావని కూడా ఆగలేదన్నమాట!

నా సంగతి అటుంచు, పిల్లలున్నారని కూడా ఆగలేదు, కొట్టుకు చస్తారని అనుకున్నాను…

ఇదే మొదటి సారా… లేకపోతే…

మొగుడూ పెళ్ళాలు జీవితంలో వొక్కసారే గొడవపడతారా?

అయితే కొట్టుకున్నారా?

కొట్టుకోవడం కొట్టుకోవడం కొని తేవాలా? వాళ్ళకి కొట్టుకోనేంత టైం లేదు…

ఔను, తిండి కూడా నిలబడే తిని పరుగులెడుతున్నారుగా?

మొత్తానికి డైవర్స్ కూడా ఖచ్చితంగా తీసేసుకుంటారనిపించింది, నాకయితే వూపిరాడలేదనుకో…

ఇంతకీ యేమయ్యింది?

ఏమీ అవలేదు!

అదేంటది?

నిప్పులా వున్నోళ్ళు యిద్దరూ నీరైపోయారు… యేమీ జరగనట్టు!

పిల్లల ముఖం చూశా?

కాదు, సెల్ చూసి…

ఆ?!

ఎవరి సెల్ వారు చూసుకుంటూ సైలెంటయిపోయారు, యేమీ జరగనే జరగనట్టు!

సెల్లులొచ్చి చెడిపోయారని అనుకుంటాం గాని, అది నిజం కాదు…

మరేం?!

బమ్మిడి జగదీశ్వరరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *