నిమగ్నతతో, నిబద్ధతతో నిష్కర్షగా తాను అర్థం చేసుకున్న సామాజిక విషయాన్ని కవితాత్మకం చేయగలిగిన శక్తి కలిగిన కవి కృపాకర్ మాదిగ. సమాజం నుండి ప్రాపంచికత వైపు ఉద్విగ్నంగా సాగిన సామాజిక సంఘర్షణల సమ్మిళితమైంది ఆయన కవిత్వం. దళిత ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచి ఆలోచనాత్మకమైన ఎంతో సాహిత్యాన్ని ఆయన అందించారు. ఉద్యమ సందర్భమే కాదు విషయమేదైనా అద్భుతంగా, కళాత్మకంగా కవిత్వాన్ని అల్లగలిగిన కవిత్వ నిపుణుడు. పంచుకుందాం రా! అన్న కృపాకర మాదిగ బహుజన మహాకావ్యం ఉత్పత్తి కులాల సాంస్కృతిక జైత్రయాత్రగా దండోరా ప్రచురణల ద్వారా వెలువడింది. సామాజిక అసమానతలను, ఎత్తుపల్లాలను నిలేసి విశ్వజనీన సంఘర్షణల ప్రతిఫలనంగా ఈ సంపుటి రూపుదిద్దుకుంది. మాదిగ జీవితాన్ని ప్రధానాంశంగా తీసుకుని కవిత్వం రాసినా తానున్న స్థానం నుండి విశ్వజనీనతను చూపించగలిగే విశాల కవితా సముద్రం కవిలో కన్పిస్తుంది. అధ్‌లయనం, అనుశీలన, నిర్మాణశైలి, శిల్పాల పరిణామాల్ని గమనిస్తూ ఆకలి మంటలు, ఆగ్రహం, ఆత్మగౌరవ పోరాటాల తీవ్రతను బలంగా చెప్పిన ఎన్నో కవితలు ఈ సంపుటిలో ఉన్నాయి.
అట్టడుగు, అణగారిన వర్గాల అస్తిత్వాన్ని, మానవీయ కోణాలను, బహుజన తాత్విక చింతనను, దళిత శ్రమైక జీవితాన్ని తెలిపిన కవిగా ఇందులోని అనేక కవితల్లో ఆయన వ్యక్తమయ్యారు. కాలాన్ని కులం కమ్మేసిన వ్యవస్థలో ఎంతో కష్టమైనా దాని రూపాల్ని పట్టుకొని ఎక్కడా పట్టువిడవని ధీశాలిగా కవిత్వమై రగిలి ప్రశ్నించిన తీరు ఈ కవి కవితల్లో కనబడింది. సంస్కృతిలోని గొప్పతనానికి, మానవానుబంధాలకు నిలయంగా తన గూడెంను చూపి పంచుకుందాం, మా గూడెంలోకి రా అని కవి గూడెంలోని మేలిమిని ప్రపంచానికి చాటి చెప్పారు.
ఇరిగిన పాత చాటలం / అరిగిన మొండి చీపుర్లం/ సద్దిపడని కంచాలం అందువల్లనే మేం చాలా హాట్ గురూ అంటూ సహజ స్థితిని స్పష్టంగా చెప్పారు. మేమే సక్సెస్ కవితలో వంద ఓటముల మైలు రాళ్ళను దాటే మా ధిక్కారం/ సక్సెస్ కాక ఇంకేందహె ? అన్న వాక్యాలు ఎడతెగని ఆత్మవిశ్వాసానికి ప్రతీకలయ్యాయి. పక్షులు వేకువ పాడితే తాను విముక్తిని, భూపాలాన్నీ బిగ్గరగా పాడతానన్నారు. కాసిన్ని గీతాల కోసమే కదా అని బతుకు పాటలోని వ్యధలను వివరించారు. జీవితమే యుద్ధరంగ మైనప్పుడు వెన్ను చూపేదేముందని ధైర్యాన్ని నూరిపోశారు. వివక్షల కాడిని ఇరగదన్నే ఎద్దును, మానవాభివృద్ధి పొద్దునని ఘంటా పధంగా చెప్పారు. రాత్రి తగలబడ్డ గుడిసెలా మాదిగతనం అంతరించిపోతున్నదని దుఃఖ రాగమయ్యారు. నేనూ ఈ దేశస్తుణ్ణే/ సమాజ కారాగారానికి పుట్టిన ఖైదీనే అని మానవత్వం కరువై బరువైన గుదిబండలుగా మారిన పరిస్థితులను వివరించారు. జీవితానికి అన్వయిస్తూ అతిపెద్ద దెబ్బ సోషల్ ట్రామా అన్నారు. ఆవిరై, అంతర్థానమై పోవడమే చివరకు మిగులుతుందని చెప్పారు. బతికున్న ప్రతి ప్రశ్న ఆశేనన్నారు. మనిషిని వాస్తవాలు తెలుసుకుని తేజరిల్లమని హెచ్చరించారు.
పేదోడంటరేంటి/ ఏ తరగతీ వొద్దంటాను/ మనిషి మనిషిగా బతకాలనంటాను అన్నారు. నేను చావుపై చిందాడె తప్పెట దరువుని గుర్తుపట్టు అని చెప్పారు. నా గుడిసె మీద కప్పు లేదు నేను సంచారినే అన్నారు. నా స్వేచ్ఛల మీద వివక్షల మేకులు కొట్టిందెవరని ప్రశ్నించారు. నా జీవితానికి మట్టి మహాలంకారము/ మోసపు ముసుగు లేని నగ్నత్‌దమే నా సౌందర్యము అని ఘంటాపథంగా ప్రకటించారు. నాది చర్మకార భాష/ చెప్పుల భాష అన్నారు. పాట మేలు కొలుపు అని చెప్పారు. సమాంతర కవితలో ముగింపులో నీ చుట్టూ కొంగవాలు కత్తులున్నప్పుడు / నువ్వు మాన్యశ్రీగానే వుంటావు అని తెలిపారు. ఎన్నో బల్లేలతో పొడిపించుకుంటివే/ ఒక్కసారి నీ గూటాన్ని ఎత్తరాదూ అని చైతన్యం నూరిపోశారు. చూపు, స్పర్శ, పాట, పిలుపు, దేవులాటే మనిషని చెప్పారు. ఫ్రెండ్ అంటే ఒకటే ఆనందానికి/ రెండు మనసులై భాష్పించడం అన్నారు. ఈ వార్ ఇప్పటిది కాదు వొరే/ జాంబవ తాత నిలేసినప్పటిది అని అవిశ్రాంతంగా సాగుతున్న అనంతయుద్ధాన్ని వివరించారు. విశ్వధూళిగా ఎగిసి/ నక్షత్ర కాంతిగా మరలి వచ్చేది నా పాట అన్నారు. చెప్పింది వినకపోతే చావు పిలుపు ఎప్పుడైనా, ఏ రూపంలోనైనా రావచ్చునని హెచ్చరించారు. మరణ సంగీతంగా కాక మానవ సుగుణంగా మారమని మగాడికి హితవు చెప్పారు. రంగస్థలిపై జీవిస్తా/ యుద్ధ స్థలిలో కొట్లాడుతా అన్నారు. పీటల మీద పీటలతో బక్కోని మీద కుర్చీ వేసుకుని, పోగులన్నీ తన్నుకుపోదాం అనే తత్వాన్ని ఎజెండా కవితలో ఖండించారు. మా తత్వం, జాంబవీయం, మాలీకరణ అట్టా అనుకోకు సామే, సమాంతరం, మహాదిగ, పంచుకుందాం రా, వారు కుట్లు, బీసీ ఐతేంది, వోసీ ఐతేంది, దండోరా ధూంధాం, గూటమే నా ఘంటం, ఏదిరా సమ ఐక్యత, ద్రోహ సందేశం కవితలు ఘాటుగా, సూటిగా, భావోద్వేగంతో దూసుకెళ్లాయి.
దండోరా దరువు నా కవిత/ గూటందెబ్బ నా కవిత అని తన కవితాంతరంగాన్ని విడమర్చి చెప్పారు. నటన, దూకుడుతో ఆత్మగౌరవమని ఎగిరి వంచనతో మైదుబెట్టే లోపలి నక్కతో జాగ్రత్తని హెచ్చరించారు. డప్పు ఇప్పుడు నిప్పుల తప్పెట అని చెప్పారు. జాంబవ దేశ జెండాని, బాబా సాహెబ్ లేచే ఉన్నాడు, కులానికి ఉరి కలేకూరి, పాటలమ్మే, నీడల్లోంచి నక్షత్రాల్లోకి, వాకిలి పిట్టలు, సిన్నమ్మికి, చొరబాటు ప్రేమలు, రాయిని, నిర్భయ, శోకపల్లి, శబథం, కల్లోలిత, వాల్మీకి పావురం, హెచ్చరిక, మరియమ్మల మెనిఫెస్టో, దిగులు పాట ప్రేమీకి ప్రేమతో, వొంటరి పాట, ఆహ్వానం, నివురు, ప్రేమ ఋతువుని, కాలం తెచ్చే చిగురు, జలపాతం, వర్ణ ధనుస్సు, అలవని కల, కళ దప్పిన లోకం, ఏ దేశం నీది, కోటను కొట్టందే, హత సాక్షిని వంటి కవితలు కవిలోని విశ్లేషణాత్మక దృష్టిని వెల్లడించాయి. మా గూడెంలోకి రా కవితలో పక్షి రెక్కలు ఇదిల్చినట్టు/ నీ బయాలు వొదిలి పోతయి/ రా మా గూడెంలోకి అన్నారు. కాలం పాత్ర నిండా జీవం పొంగి పొర్లుతుందని చెప్పారు. నీకు సాయం చేయడానికి ఆఖరికి ఎవరూ రారన్న సంగతిని గమనించమని సూచించారు. శరణార్థిని కాను, దిల్ దుఖ్ నగర్, ప్రత్యేక చావు మండళ్ళం, ఎంతెంత కాలం దిగ్నేత్ర, ఇంగ్లీష్ అంటే ఇంతేనా, ఆగని నడక, వాళ్ళొస్తారు వంటి కవితల్లో వ్యవస్థలోని అసమానతలపై అగ్ని కురిసింది. ఇప్పటి చండాలుడు/ ఇక ఎప్పటికీ తొలగిపోడు/ నలిగిపోయిన దేహాత్మలని/ అసహనాలపై నిరసన జెండా ఎగరేశాడు అని చండాల జెండాలో చెప్పారు. మనిషంటే, చివరి ప్రార్థన, ప్రేమ ఒయాసిస్, నిరాధార్, సాగర సందర్శన, గ్రీన్‌కార్డ్ కవితల్లో కవిలోని అంతరంగ భావోద్వేగం వెల్లువైంది. మీడియా సామాజిక బాధ్యతను కూడా ఒక కవితలో వెల్లడించారు.
సంస్కృతి ఆటలాడాల్సిన చోట సాంకేతికత కేరింతలు కొట్టడమేమిటంటూ విశ్వక్రీడా మైదానంలో/ సాంస్కృతిక జైత్రయాత్రలు జరగాలని చైనా ఓలంపిక్స్ సందర్భంగా రాసిన నూరు పూలు పూయనీ కవితలో అన్నారు. చావు పట్టం, కోలు కోవాలి కోటీ, దొమ్మీస్వామ్యం, మనిషే గెలుస్తుంది, అంటుకోని కాలం, పాదనాదం, మేమో నువ్వో సోషల్ స్మగ్లర్, అట్టెట్టా, కాల్‌మనీ కాలిపోవాలనీ, నాగలి ప్రశ్న, డేగరాగం, నాదరాజా, ఇగ నీ బొమ్మల పెట్టెను ముస్తావా, స్వేచ్ఛ నా భాష, మహాచిందు, సమ్యక్ చేతన, వెలుగులోంచి వెలుగులోకి జాగ్రత్త తమ్ముడా జాగ్రత్త అన్న కవితల్లో వర్తమాన సంఘటనలు దృశ్యమానమయ్యాయి. వాక్యాలు వీలుకాని కాడ/ ఒకే ఒక్క వాక్కై నినదించాలి అని కొయ్యగుర్రం కవితలో పిలుపునిచ్చారు. గూడెం గోసలను ఘోషించగలవా/ మా కేకలే నా కవిత్వం అని కవిత్వ పారిశుధ్యం కవితలో చెప్పారు. అంబేడ్కరంటే ఆత్మగౌరవ రక్షణ అని, బతుకుదాం బతక నిద్దాం అన్న భరోసా అని చెప్పారు. బహుజన కవితలో శ్రమ నా సామాజికత/ సహకారత నా జాతీయత/ మానవత నా అంతర్జాతీయత/ వివక్షలపై ఉగ్రత నా స్వాభావికత అని స్పష్టంగా చెప్పారు. చివరి దాకా అన్న శీర్షికతో ఉన్న చివరి కవితలో పొద్దు పొడిచే దాకా నడవాల్సిందే / జెండావై నిలవాల్సిందేనని దిశానిర్దేశం చేశారు. కవిలోని సొంతతనం, నిర్మాణ నిపుణత ప్రతి కవితలో కనిపించింది. ఉద్రేకంగా, ఆర్థ్రంగా, సూటిగా, హృద్యంగా, మానవీయంగా సాగిన ఈ కవితలు అసమానతల వ్యవస్థలోని సందిగ్దావస్థలో చిక్కి అనుక్షణం పోరాడుతూనే ముందుకు సాగుతున్న సగటు మనిషి ఆత్మనిబ్బరపు ఊపిరుల రెపరెపలు.
– డా. తిరునగరి శ్రీనివాస్
9441464764